కార్తీక స్నానాలకు గోదావరి రేవులు సిద్ధం
ABN , Publish Date - Oct 22 , 2025 | 12:52 AM
కార్తీక మాసం గోదావరిలో పుణ్యస్నానాలకు అనువు గా వలంధర్ రేవు మెట్లను శుభ్రం చేశారు.
పుష్కరఘాట్‌లు, ఆలయ చెరువల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు
నరసాపురం రూరల్, అక్టోబరు 21(అంధ్రజ్యోతి): కార్తీక మాసం గోదావరిలో పుణ్యస్నానాలకు అనువు గా వలంధర్ రేవు మెట్లను శుభ్రం చేశారు. ఆర్చికి విద్యుత్ దీపాలు ఏర్పాటుచేసి దుస్తులు మార్చుకునే గదులు మరమ్మతులు చేశారు. రేవులో జల్లు స్నానం సిద్ధం చేశారు. వలంధర్, రాజుల్లంక, అమరేశ్వర రేవుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్ అంజయ్య తెలిపారు.
ఆచంట(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో శివాలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కార్తీక మాసంలో ఆచంటేశ్వరుడిని ప్రతీ రోజూ వేల సంఖ్యలో భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. రామగుండం చెరువులో భక్తులు కార్తీక దీపాలు పెద్ద ఎత్తున వెలిగిస్తారు. రామగుండం చెరువును ఆలయ ఈవో ఆదిమూలం వెంకట సత్యనారాయణ, చైర్మన్ నెక్కం టి గజేశ్వరరావు శుభ్రం చేయించారు.
పెనుగొండ(ఆంధ్రజ్యోతి): దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిన సిద్ధాంతం కేదార్‌ఘాట్ భక్తులకు కార్తీక మాస పుణ్యస్నానాలకు సిద్ధమైంది. రెండు రోజుల నుంచి స్థానిక పంచాయతీ సర్పంచ్ చింతపల్లి గనిరాజు, దేవస్థానం అధికారి ముత్యాల సత్యనారాయణ ఆధ్వర్యంలో స్నానాల రేవుల ప్రక్షాళన చేపట్టారు. రేవులలో సీసా పెంకులు, చెత్తా చెదారాలను ఒండ్రు మట్టిని పూర్తిగా తొలగించారు. నడిపూడిలో కూడా గోదావరి పుష్కర రేవు, మండలంలోని పలు ఆల యాల పుష్కరిణులు శుభ్రం చేశారు.