కందిపప్పు సొమ్ము రికవరీ ఎప్పుడు.. ?
ABN , Publish Date - Nov 07 , 2025 | 12:00 AM
గోదావరి వరదల సమయంలో వరద బాధితులకు కందిపప్పు అమ్మి ఆ సొమ్మును ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలని రేషన్ డీలర్లను సంబంధిత అధికారులు ఆదేశించారు.
వినియోగదారులకు నిలిచిపోయిన పంచదార పంపిణీ
దాదాపు రూ.12 లక్షలు బకాయి పడ్డ డీలర్లు
కుక్కునూరు, నవంబరు6(ఆంధ్రజ్యోతి):గోదావరి వరదల సమయంలో వరద బాధితులకు కందిపప్పు అమ్మి ఆ సొమ్మును ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలని రేషన్ డీలర్లను సంబంధిత అధికారులు ఆదేశించారు. కుక్కునూరు, వేలేరుపాడు మండాలల్లోని రేషన్ డీలర్లకు కందిపప్పు సరఫరా జరిగింది. డీలర్లు ఆ కందిపప్పు అమ్మకం జరిపారు కానీ ఆ సొమ్మును ప్రభుత్వ ఖాతాలో జమ చేయలేదు. ఆల స్యంగా మేల్కొన్న సంబంధిత అధికారులు కందిపప్పు సొమ్ము జమ చేయాలని ఆదే శించారు. కందిపప్పు సొమ్ము జమ చేస్తేనే పంచధార సరఫరా చేస్తామని చెప్పడంతో కొందరూ డీలర్లు సొమ్ము జమ చేయగా మరికొందరూ జమ చేయలేదు. దీంతో సుమారు 13 రేషన్ దుకాణాలకు పంచదార సరఫరా నిలిపివేయడంతో ఈనెల వినియోగదారులకు ఉచిత బియ్యం పంపిణీ మాత్రమే జరుగుతోంది.
కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గిరిజన సహకార సంస్థ (జీసీసీ) ఆధ్వర్యం లో కుక్కునూరు మండలంలోని నాలుగు రేషన్ దుకాణాలు, వేలేరుపాడులో ఆరు దుకాణాలున్నాయి. ఇక ప్రైవేటు రేషన్ దుకాణాలు కుక్కునూరు మండలంలో 17, వేలేరుపాడులో 8 ఉన్నాయి. మొత్తం 35 దుకాణాలున్నాయి. కుక్కునూరు మండలానికి కందిపప్పు జూలై 2024లో 12,093 క్వింటాళ్లు, 2025లో 2,998 క్వింటాళ్లు సరఫరా జరిగింది. మొత్తం రూ.9లక్షల 96,006 విలువ కలిగిన 15,091 క్వింటాళ్ల కందిపప్పు సరఫరా చేశారు. వేలేరుపాడు మండలంలో జూలై 2024లో 7,479 క్వింటాళ్లు, జూలై 2025 7,436 క్వింటాళ్ల కందిపప్పు సరఫరా అయ్యింది. మొత్తం రూ.9,84,390 విలువ గల 14,915 క్వింటాళ్ల కందిపప్పు సరఫరా అయ్యింది. నిబంధనల ప్రకారం డీలర్లు డీడీ రూపంలో ముందుగా సొమ్ము చెల్లించిన తరువాతనే కందిపప్పు సరఫరా జరగాలి. కానీ వరదల సమయంలో అత్యవసరం కాబట్టి డీలర్లకు కొంత వెసులుబాటు ఇచ్చి కందిపప్పు ముందుగానే సరఫరా చేశారు. డీలర్లు కందిపప్పు అమ్మినా ఆ సొమ్మును జమ చేయడంలో కాలయాపన చేశారు. దీనిపై ఆలస్యంగా స్పందించిన అధికారులు కందిపప్పు సొమ్ము జమ చేయాలని ఆదేశించారు. ఇటీవల కొందరు డీలర్లు రూ.7లక్షల 99వేల195లు జమ చేశారు. ఇంకా దాదాపు రూ.11 లక్షల 81,199లు జమ చేయాల్సి ఉంది. అధికారులు సొమ్ము జమ చేయమని ఆదేశిం చినా కందిపప్పు అమ్మినందుకు మాకు రావాల్సిన కమీషన్‌లో జమ చేసుకోండి.. అంటూ కొంద రూ డీలర్లు చెబుతున్నట్టు సమాచారం. కాగా జీసీసీ డీఎం దేవరాజు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడు తూ ‘జీసీసీ పరిధిలో ఉన్న డీలర్లు సొమ్ము జమ చేశారు. ప్రైవేటు డీలర్ల నుంచి ఇంకా సొమ్ము జమ కావాల్సి ఉంది. దీనిపై సివిల్ సప్లై అధికారులతో మాట్లాడాం. డీలర్ల కమీషన్ పోనూ మిగిలిన సొమ్మును కట్టించేలా చూస్తున్నాం. ఈ నెలలో పూర్తిగా రికవరీ అయ్యే అవకాశం ఉంది’ అన్నారు.