పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యతగా స్వీకరించాలి
ABN , Publish Date - Jun 06 , 2025 | 12:41 AM
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని, ప్లాస్టిక్ వసువులు, క్యారీ బ్యాగుల వాడకానికి స్వస్థి పలికి, గుడ్డ సంచులను వాడాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్‌చార్జి చైర్మన్, ఏడో అదనపు జిల్లా జడ్జి వై.శ్రీనివాసరావు పిలుపు నిచ్చారు.
ఏలూరు క్రైం, జూన్ 5 (ఆంధ్రజ్యోతి): పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని, ప్లాస్టిక్ వసువులు, క్యారీ బ్యాగుల వాడకానికి స్వస్థి పలికి, గుడ్డ సంచులను వాడాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్‌చార్జి చైర్మన్, ఏడో అదనపు జిల్లా జడ్జి వై.శ్రీనివాసరావు పిలుపు నిచ్చారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వనం–మనం కార్యక్రమంలో భాగంగా ర్యాలీని నిర్వహించి, జిల్లా కోర్టు ప్రాంగణంలో మొక్కలను నాటి, ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడు విధిగా కనీసం రెండు మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రతి ఇంటి ఆవరణలో, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో విధిగా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసి భూగర్భజలాలను వృద్ధికి సహకరించా లని సూచించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ మాట్లాడుతూ ప్రకృతిలోని సమతుల్య స్థితిని కాపాడాలని పర్యావరణ పరిరక్షణ అనే అంశాలపై ప్రజలకు న్యాయ విజ్ఞాన సదస్సులతో అవగా హన కల్పిస్తున్నామన్నారు. ఎనిమిదో అదనపు జిల్లా జడ్జి ఐ. శ్రీనివాసమూర్తి, అదనపు సీనియర్ సివిల్ జడ్జి పీఎస్‌వీబీ కృష్ణసాయితేజ, ప్రిన్సిపల్ జూనియర్ జడ్జి మహ్మద్ అబుతాలిబ్‌షేక్, తదితరులు పాల్గొన్నారు.
పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఉమ్మడి జిల్లాల న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ అన్నారు. గురువారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ భవనంలో పలు పరిశ్రమల ప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కాలుష్య నివారణ మండలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు కె.వెంకటేశ్వరరావు, పరిశ్రమల ప్రతినిధులు, జిల్లా కోర్టు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.