Share News

జాయింట్‌ ఎల్‌పీఎం.. టెన్షన్‌ వద్దు!

ABN , Publish Date - Jun 22 , 2025 | 11:37 PM

వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భూముల రీసర్వేలోని తప్పిదాల వల్ల జాయింట్‌ ఎల్‌పీఎం (ల్యాండ్‌ పార్శిల్‌ మ్యాప్‌)లతో చిక్కులు ఏర్పడ్డాయి. దీంతో రైతులు ప్రభుత్వ పఽథకాలకు దూర మయ్యే పరిస్థితి తలెత్తింది.

 జాయింట్‌ ఎల్‌పీఎం..  టెన్షన్‌ వద్దు!

గత ప్రభుత్వ డ్రోన్‌ రీ సర్వేతో ఇబ్బందులు

ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్న అర్హులు

సమస్యపై దృష్టి సారించిన టీడీపీ ప్రభుత్వం

రైతులకు వెసులుబాటు కల్పిస్తూ చర్యలు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి):

వైసీపీ ప్రభుత్వంలో జరిగిన భూముల రీసర్వేలోని తప్పిదాల వల్ల జాయింట్‌ ఎల్‌పీఎం (ల్యాండ్‌ పార్శిల్‌ మ్యాప్‌)లతో చిక్కులు ఏర్పడ్డాయి. దీంతో రైతులు ప్రభుత్వ పఽథకాలకు దూర మయ్యే పరిస్థితి తలెత్తింది. భూములకు సంబంధించి ఒక సర్వే నంబర్‌లో ఎక్కువ మంది వ్యక్తుల భూముల ఖాతాలు కలిపి ఉండడం వల్ల ఆన్‌లైన్‌లో ఒకేభూమి అందరికి ఒకే మొత్తంలో కనిపించ డంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల అర్హతలకు ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి.గత వైసీపీ ప్రభుత్వంలో డ్రోన్ల సాయంతో రీ సర్వే చేశారు. ఈక్రమంలో ఒకసర్వే నంబర్‌లో ఎంత విస్తీర్ణం భూమి ఉందో? దానంతటికి కలిపి ఒకే ల్యాండ్‌ పార్శిల్‌ మ్యాప్‌ (ఎల్‌పీఎం)ను కేటాయించడంతో క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం గ్లోబల్‌ నేవిగేషన్‌ శాటిలైట్‌ సిస్టమ్‌ ద్వారా రోవర్లను ఉపయోగించి భూముల సర్వేను చేస్తుండడంతో లెక్కలు సరిగ్గా తేలుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. కాగా సర్వే పూర్తయిన గ్రామాల్లో వెబ్‌ల్యాండ్‌ 2.0లో జాయింట్‌ పట్టాదారులుగా నమోదైన భూ యజమానులు వారి భూముల విభజనకు చేసేందుకు ప్రభుత్వం నిర్దేశించిన రుసుం రూ.500లను పూర్తిగా మినహాయించి ఉచితంగా ఈ సేవలను పొందేందుకు అవకాశం కల్పించింది. ఈ సేవను పొందేందుకు కేవలం నామమాత్రపు దరఖాస్తు రుసుం రూ.50ను గ్రామసచివాలయాల్లో చెల్లించి నెలాఖరులోగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిం చింది. ల్యాండ్‌ సర్వేలో చిక్కులపై ల్యాండ్‌ సర్వేశాఖ అసిస్టెంట్‌ డైరక్టర్‌ అన్సారీని వివరణ అడగగా వెబ్‌ల్యాండ్‌ ఆప్షన్‌లో ఆన్‌లైన్‌ ద్వారా ఎల్‌పీ నంబర్లను విడిగా రైతుల పొందేందుకు అనువుగా మార్పులను ప్రభుత్వం చేసిందన్నారు. కొత్తగా ఎల్‌పీఎం పొందేవారు రూ.50 చెల్లించి ఆన్‌లైన్‌ ద్వారా పొందవచ్చన్నారు.

గ్రామ సచివాలయాల్లో ఏర్పాట్లు

ముదినేపల్లి : భూముల డ్రోన్‌ రీ సర్వేకారణంగా ఏర్పడిన జాయింట్‌ ఎల్‌పీల సమస్యను పరిష్కరించేందుకు రెవెన్యూశాఖ చర్యలు చేపట్టింది. పెండింగులోని ఈ సమస్యను పరిష్కరించి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవన పథకాల లబ్ధి అర్హులైన వారికి అందేలా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ముదినేపల్లి మండలంలో వందల సంఖ్యలో విద్యార్థుల కుటుంబాలకు జాయింట్‌ ఎల్‌పీల కారణంగా తల్లికి వందనం సొమ్ము అందలేదు. తమ పేరున ఎక్కువ భూములు వెబ్‌ ల్యాండ్‌లో చూపిస్తున్నందున, వాస్తవ భూములను నమోదు చేయించాలని తహసీల్దార్‌ కార్యా లయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. జేసీ ఆదేశాల మేరకు రూ.50 రుసుము చెల్లించి వాస్తవంగా ఉన్న భూమికి సంబం ధించిన ఆధారాలు, అసలు తమ పేరిట భూమి లేకపోతే లేనట్టుగా వీఆర్వోల సర్టిఫికెట్లు సచివాలయాల్లో గ్రామ సర్వేయర్లకు అందజేస్తే వెబ్‌ ల్యాండ్‌లో సరిచేసేందుకు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ లతీఫ్‌ పాషా తెలిపారు.

Updated Date - Jun 22 , 2025 | 11:37 PM