ఇనామ్ భూములకు పట్టాలు జారీ
ABN , Publish Date - Jul 31 , 2025 | 12:35 AM
ఇనామ్ భూముల సమస్య పరిష్కారానికి ప్రభు త్వం చర్యలు తీసుకుంటోంది.
జిల్లాలో ఉమామహేశ్వరం పైలట్ ప్రాజెక్ట్
310 మంది రైతుల గుర్తింపు
విక్రయించేశామంటున్న ఇనామ్‌దారులు
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
ఇనామ్ భూముల సమస్య పరిష్కారానికి ప్రభు త్వం చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో పెంటపాడు మండలం ఉమామహేశ్వరం, తాడేపల్లిగూడెం తాళ్ల ముదునూరుపాడులో ఇనామ్ భూములున్నాయి. వాస్తవానికి ఉమామహేశ్వరంలో క్రయవిక్రయాలు జరిగిపోతున్నాయి. ఇనామ్‌దారులే అమ్మడం రైతులు కొనుగోలు చేశారు. రైతులకు హక్కులు కల్పించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ఉమా మహే శ్వరంలో తొలుత పట్టాలు ఇవ్వాలని సంకల్పించింది. మొత్తంగా 310 మంది రైతులున్నట్టు రెవెన్యూశాఖ గుర్తించింది. సచివాలయాలకు చెందిన 8 మంది సిబ్బందిని ప్రత్యేకంగా ఉమామహేశ్వరంలో నియమిం చారు. సర్వే నెంబర్‌లతో సహా భూముల సరిహద్దుల ను గుర్తించి రైతులను నమోదు చేసుకున్నారు. రిజిస్ర్టేషన్ చేసుకున్న దస్తావేజులు రైతుల వద్ద ఉన్నాయి. సబ్ రిజిస్ర్టార్ కార్యాలయంలో నకళ్లు తీసుకుంటున్నారు. దీనిపై జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్‌రెడ్డి బుధవారం పెంటపాడు తహసీల్దార్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించి తహసీల్దార్, ఆర్‌ఐ నుంచి వివరాలను సేకరించారు. ఇప్పటికీ కొంత భూమి ఉన్న ఇనామ్‌దారుతో చర్చించారు. పూర్వీకులు భూములను విక్రయించారని ఒక ఇనామ్‌దారు చెప్పడంతో రైతుల వైపు న్యాయం ఉందని గుర్తించారు. పట్టాలు పంపిణీ చేయడానికి 45 రోజుల్లో కసరత్తు చేయాలని జేసీ ఆదేశించారు. సబ్ రిజిస్ర్టార్ కార్యాల యంలో ఉమా మహేశ్వరం భూముల నకళ్లు, ఈసీలు ఉచితంగా ఇవ్వాలని, ఆదిశగా లేఖ రాయాలంటూ పెంటపాడు తహసీల్దార్‌కు సూచించారు.