Share News

‘భవ్య భీమవరం’ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

ABN , Publish Date - Sep 04 , 2025 | 12:35 AM

‘భవ్య భీమవరం’ అభివృద్ధి పనుల పురోగతిని వేగవంతం చేయాలని సంబంధిత శాఖల అధికారులను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ టి.రాహుల్‌ కుమార్‌ రెడ్డి ఆదేశించారు.

‘భవ్య భీమవరం’ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
డీఆర్‌వో వెంకటేశ్వర్లును సత్కరించిన కలెక్టర్‌, జేసీ తదితరులు

జేసీ రాహుల్‌ కుమార్‌రెడ్డి

భీమవరంటౌన్‌, సెప్టెంబరు3(ఆంధ్రజ్యోతి):‘భవ్య భీమవరం’ అభివృద్ధి పనుల పురోగతిని వేగవంతం చేయాలని సంబంధిత శాఖల అధికారులను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ టి.రాహుల్‌ కుమార్‌ రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో భవ్య భీమవరం అభివృద్ధి పనులపై సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. పలు ప్రదేశాలలో చేపట్టిన పనుల పురోగతి, పింక్‌ టాయిలెట్స్‌ నిర్మాణాలకు తీసుకున్న చర్యలపై రెవెన్యూ, మున్సిపల్‌, సంబంధిత శాఖల అధికారులను నుంచి ఆరా తీశారు. ఆయన మాట్లాడుతూ భీమవరం పట్టణం పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని, పార్కుల అభివృద్ధి, పింక్‌ టాయిలెట్స్‌ ఏర్పాట్లపై క్షేత్రస్థాయిలోకి వెళ్లి అవసరమైన స్థలాలను పరిశీలించాలని ఆర్డీవో కె.ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి, మున్సిపల్‌ కమి షనర్‌ రామచంద్రారెడ్డిని ఆదేశించారు. జిల్లా టూరిజం శాఖ అధికారి వెంకట అప్పారావు, మునిసిపల్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ ఎ.రాంబాబు, మునిసిపల్‌ డీఈ టి.త్రినాథరావు, ఆర్‌అండ్‌బీ ఎస్‌సీ ఎ.శ్రీనివాసరావు, ఎలక్ట్రికల్‌ డీఈ వెంకటేశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు.

స్వచ్ఛంద సేవా సంస్థలపై తరచూ పర్యవేక్షణ ఉండాలి

ఆదరణ, సంరక్షణ అవసరమైన పిల్లల కోసం స్వచ్ఛంద సేవా సంస్థలు నిర్వహిస్తున్న సంస్థలపై, తరచూ పర్యవేక్షణ చేయాలని జేసీ రాహుల్‌ కుమార్‌ రెడ్డి అన్నా రు. కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి స్వచ్ఛంద సేవల సంరక్షణ కమిటీ సభ్యులతో ఆయన సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ లైసెన్సు కలిగిన 12 స్వచ్ఛంద సేవా సంస్థలను ప్రతి మూడు నెలలకు ఒకసారి పర్యవేక్షణ చేసి మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేవా తెలుసుకోవాలని సూచించారు. జిల్లాలో ప్రభుత్వ లైసెన్సు నిరాకరించిన ఏడు స్వచ్ఛంద సేవా సంస్థలకు సంబంధించిన పిల్లలను చైల్డ్‌ ప్రొడక్ట్‌ కమిటీ ద్వారా ఇతర హోమ్‌లకు లేదా తల్లిదండ్రుల సంరక్షణలోకి అప్పగించాలని కమిటీ సభ్యులను ఆదేశించారు.

డీఆర్‌వో వెంకటేశ్వర్లుకు సత్కారం

జిల్లా రెవెన్యూ అధికారిగా పనిచేస్తూ ఇటీవల కన్ఫర్మ్‌డ్‌ ఐఏఎస్‌గా పదోన్నతి పొందిన డీఆర్వో వెంకటేశ్వర్లుకు భీమవరం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌, జేసీ చేతుల మీదగా ఘనంగా సన్మానించారు. ఈ సంతర్భంగా కలెక్టర్‌ నాగరాణి మాట్లాడుతూ డీఆర్‌వో వెంకటేశ్వర్లు చిన్నతనంలోనే తల్లిని కోల్పోవడం, ప్రత్యేక పరిస్థితులలో పలు వసతి గృహాలలో విద్యను అభ్యసిం చినా, ఎక్కడా వెనుకడుగు వేయకుండా అంచెలంచెలుగా ఎదిగి ఐఏఎస్‌ శిఖరాన్ని అందుకోవడం చాలా గర్వించదగిన విషయం అన్నారు. అనంతరం జేసీ మాట్లాడారు. బి.శివన్నారాయణరెడ్డి, భీమవరం, నరసాపురం ఆర్డీవోలు కె.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, దాసి రాజు, కలెక్టరేట్‌ ఏవో చంద్రశేఖర్‌, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Sep 04 , 2025 | 12:35 AM