Share News

మేడవరపు చెరువు కబ్జా

ABN , Publish Date - Dec 22 , 2025 | 12:04 AM

జిల్లాలో అధిక శాతం వరి పండించే మండలాల్లో చింతలపూడి మండలం రెండోది. మండలంలో వర్షాధార చెరువులతో వరి సాగు చేస్తారు.

మేడవరపు చెరువు కబ్జా

360 ఎకరాల విస్తీర్ణం..

150 ఎకరాలు ఆక్రమణ

రైతులకు సాగునీటి ఇబ్బందులు

పట్టించుకోని అధికారులు

చింతలపూడి, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అధిక శాతం వరి పండించే మండలాల్లో చింతలపూడి మండలం రెండోది. మండలంలో వర్షాధార చెరువులతో వరి సాగు చేస్తారు. వర్షాభావం ఏర్పడితే చెరువులన్నీ మైదానాలే. మండలంలో 36 పెద్ద చెరువులు, 120 చిన్న కుంటలు ఉన్నాయి. భూముల ధరలు పెరగడంతో చెరు వులను సైతం ఆక్రమిస్తున్నారు.

మండలంలోని మేడవరపు చెరువు కబ్జా కోరల్లో చిక్కింది. ఎర్రకాలువ జన్మస్థానం అయిన ఈ చెరువు ఎంతో చరిత్ర కలిగి ఉంది. చెరువు విస్తీర్ణం 360 ఎకరా లు కాగా 150 ఎకరాలు ఆక్రమణలో ఉంది. దీంతో నీటి సామర్థ్యం తగ్గిపోయింది. శెట్టివారిగూడెంలో ఉన్న చెరు వు ఒకప్పుడు 120 పల్లెకారు కుటుంబాలకు జీవనోపాధి. మండు వేసవిలోను నీరు నిల్వ ఉండడంతో పడవలపై చేపలు పట్టి, చెరువులో తామరాకుల విక్రయాలతో జీవనం సాగించేవారు. చెరువు ఎగువన చిన్నాపెద్ద చెరువులు 70 వరకు ఉంటాయి. వర్షాకాలంలో, తుఫాను సమయంలో ఆ చెరువులు నిండి అదనపు నీరు ఈ చెరు వుకు చేరతాయి. ఈ చెరువు రెండు అలుగుల నుంచి అదనపు నీరు ఎర్రకాలువగా మారుతుంది.

అధికారులకు ఫిర్యాదు చేసినా..

ఆక్రమణలపై పలుమార్లు గ్రామ పెద్దలు ఫిర్యాదులు చేస్తే అధికారులు సర్వే పేరిట ఆక్రమణదారులతో కుమ్మక్కై వదిలేశారన్న ఆరోపణలున్నాయి. దిగువన అధికారికంగా, అనధికారికంగా 700 ఎకరాలు సాగులో ఉంది. అవన్నీ రెండు పంటలు వేసే భూములు. ఇప్పుడు ఆక్రమణదారుల వల్ల చెరువునీటి సామర్ధ్యం తగ్గి సాగు నీటి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. నీటిపారుదల శాఖ అధికారులు పట్టించుకోవడంలేదు. ఆక్రమణలు తొలగించి చెరువు అభివృద్ధి చేస్తే దిగువన రెండు పంటలకు సాగు నీరందడమే కాకుండా వంద పల్లెకారు కుటుంబాలకు ఉపాధి కలుగుతుందని రైతులు పేర్కొంటున్నారు.

150 ఎకరాలు ఆక్రమణ

ఎర్రకాలువ పుట్టక అయిన మేడవరపు చెరువు 150 ఎకరాలు ఆక్రమణలకు గురైంది. ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. ఆక్రమణలను తొలగిస్తే నీటి సామర్థ్యం పెరుగుతుంది. ఎన్నో కుటుంబాలకు జీవనాధారమే కాకుండా పరిసరాల్లో భూ గర్భజలాలు మెరుగుపడతాయి. రైతులకు నీటి భరోసా ఉంటుంది.

– ఆది సత్యనారాయణ, సాగునీటి సంఘం డైరెక్టర్‌, లక్ష్మీనరసింహపురం

పల్లెకారుల జీవనోపాధికి గండి

మేడవరపు చెరువులో ప్రస్తుతం ఆక్రమణల వల్ల ఉపాధి కోల్పోతున్నాం. గతంలో మా పెద్దలు 150 కుటుంబాలు దీనిపై ఆధారపడి జీవించేవారు. ఇప్పుడు ఆక్రమణల వల్ల నీటి సామర్థ్యం లేకుండా పోయింది. దీనిని అభివృద్ధి చేసి పల్లెకారులకు జీవనోపాధి కల్పించాలి.

– బైరా ఆనంద్‌, పల్లెకారుల నాయకుడు, శెట్టివారిగూడెం

Updated Date - Dec 22 , 2025 | 12:04 AM