Share News

ఈజీగా రాసేద్దాం

ABN , Publish Date - Oct 28 , 2025 | 01:01 AM

విద్యా విధానంలో కూటమి ప్రభుత్వం అనేక మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగా ఇంటర్‌ ఫస్టియర్‌ ఎంపీసీ, బైపీసీ గ్రూపులలోని ఆరు పరీక్షలను ఐదింటికి కుదించింది. ఈ నేప థ్యంలో సబ్జెక్టుల మార్కులు మారాయి.

ఈజీగా రాసేద్దాం

ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్ష విధానంలో మార్పులు

ఎంపీసీలో మ్యాథ్స్‌కు రెండు కాదు.. ఒకటే పరీక్ష

బైపీసీలో బోటనీ, జువాలజీ కలిపి బయాలజీ

ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టులకు మార్కుల పెంపు

మ్యాథ్స్‌ 100 మార్కులు, బయాలజీ 85 మార్కులు

జిల్లాలో 19,703 విద్యార్థులకు కొత్త విధానంలో పరీక్షలు

భీమవరం రూరల్‌, అక్టోబరు 27(ఆంధ్ర జ్యోతి): విద్యా విధానంలో కూటమి ప్రభుత్వం అనేక మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగా ఇంటర్‌ ఫస్టియర్‌ ఎంపీసీ, బైపీసీ గ్రూపులలోని ఆరు పరీక్షలను ఐదింటికి కుదించింది. ఈ నేప థ్యంలో సబ్జెక్టుల మార్కులు మారాయి. ఎంపీసీ మార్కులు మొత్తం 500. రాత పరీక్షలకు 470, ప్రాక్టికల్స్‌ (కెమిస్ర్టీ 15+ఫిజిక్స్‌ 15) 30 మార్కులు. ఇప్పటి వరకు మ్యాథ్స్‌ సబ్జెక్టును రెండు పేపర్లుగా నిర్వహిస్తున్నారు. పేపర్‌ 1ఏకి 75 మార్కులు, పేపర్‌ 1బికి 75 మార్కులు మొత్తం 150 మార్కులతో పరీక్షలు జరిగేవి. ఇకపై 100 మార్కులతో ఒకే పేపరు నిర్వహిస్తారు. పాస్‌ మార్కులు 35. ఫిజిక్స్‌ 85, కెమిస్ట్రీ 85, ఫస్ట్‌, సెకండ్‌ లాంగ్వేజెస్‌కు వంద మార్కులు చొప్పున రెండు పరీక్ష పత్రాలు ఇస్తారు.

బైపీసీలో మార్కులు మొత్తం 500. రాత పరీక్షలకు 455, ప్రాక్టికల్స్‌ (కెమిస్ర్టీ 15 + ఫిజిక్స్‌ 15+బోటనీ, జువాలజి 15) 55 మార్కులు. బోటనీ 60 మార్కులకు, జువాలజీ 60 మార్కులకు రెండు పేపర్లు ఉండేవి. ఇప్పుడు ఈ రెండు కలిపి 85 మార్కులుగా ఒకే ప్రశ్నాపత్రంగా ఇస్తారు. ఆన్సర్‌ షీట్‌లు మాత్రం రెండుగా ఉంటాయి. బోటనీ 43 మార్కులు, జువాలజీ 42 మార్కులుగా ప్రశ్నలు ఉంటాయి. ఉత్తీర్ణత 29.5 మార్కులుగా నిర్ధారించారు. కాని అరమార్కు వుండదు. 29 మార్కులు వస్తే ఉత్తీర్ణతగా తీసుకుంటారు. ఫిజిక్స్‌ 85కి, కెమిస్ట్రీ 85 మార్కులకు ఉంటుంది. ఫస్ట్‌, సెకండ్‌ లాంగ్వేజెస్‌కు వంద మార్కుల చొప్పున పరీక్ష పత్రాలు ఇస్తారు. ఈ విధానంలో ఫస్టియర్‌ పరీక్షలు రాసిన విద్యార్థులు.. సెకండ్‌ ఇయర్‌లోనూ కొనసాగిస్తారు. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు పాత విధానంలోనే ప్రశ్నాపత్రాలు ఉంటాయి.

ఫస్టియర్‌ విద్యార్థులు 19,703

జిల్లాలో 146 ఇంటర్‌ ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థల నుంచి 19,703 మంది విద్యార్థులు ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు రాయనున్నారు. వీరిలో సోషల్‌ వెల్ఫేర్‌ ఒకటి నుంచి 110 మంది, ఒకేషనల్‌ 373, ఎయిడెడ్‌ 651, ప్రభుత్వ 1,625, ప్రైవేట్‌ 16,647, హెచ్‌ఎస్‌ ప్లస్‌ నుంచి 297 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ప్రభుత్వ కళాశాలలు, ప్లస్‌ 2 కళాశాలల్లోని విద్యార్థులకు ప్రశ్నాపత్రాలపై అవగాహన పెంచేందుకు ఓరియంటల్‌ క్లాసులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయులు ప్రశ్నాపత్రాలు రూపకల్పన చేసి వాటి విధానాన్ని అవగాహన కల్పిస్తున్నారు. విద్యార్థుల్లో ఉత్తీర్ణత పెంచే దిశగా విద్యా బోధన జరుగుతోంది.

Updated Date - Oct 28 , 2025 | 01:01 AM