కోడి లేకుండా.. కోడిపిల్ల!
ABN , Publish Date - Sep 03 , 2025 | 12:41 AM
కోడి గుడ్లను కోడి పెట్ట పొదిగితే పిల్లలు వస్తాయి.. ఇక్కడ కోడి పెట్ట లేకుండానే కృత్రిమ పద్ధతిలో పిల్లలు వస్తున్నాయి.
ఆధునిక టెక్నాలజీతో థర్మాకోల్ ఇంక్యుబేటర్స్
కోడి పిల్లలను పొదిగించడంలో మెరుగైన ఫలితాలు
ఇంక్యుబేటర్ ఖర్చు రూ.4 వేలు
బయట మార్కెట్‌లో రూ.25 వేల నుంచి రూ.లక్ష
గురవాయిగూడెం రైతు సృష్టి
కోడి గుడ్లను కోడి పెట్ట పొదిగితే పిల్లలు వస్తాయి.. ఇక్కడ కోడి పెట్ట లేకుండానే కృత్రిమ పద్ధతిలో పిల్లలు వస్తున్నాయి. వాస్తవానికి కోడి పెట్టను డమ్మీ గుడ్లతో మాయ చేసి మరీ పిల్లలను చేస్తారు. ఇంక్యుబేటర్‌లో నాటు కోడి గుడ్లను ఉంచి సరిపడా టెంపరేచర్ అందేలా విద్యుత్ బల్బ్ ఏర్పాటు చేసి నిర్ణీత సమయంలో పిల్లలను చేస్తారు. పిల్లల సంరక్షణ చూసేలా కోడిపెట్టను డమ్మీ గుడ్లపై ఉంచుతారు. ఇంక్యుబేటర్ నుంచి వచ్చిన పిల్లలను తర్వాత కోడి పెట్ట వద్ద ఉంచుతారు. అది తానే పొదిగి పిల్లలను చేసినట్లు భావిస్తుంది. మార్కెట్‌లో ఇంక్యుబేటర్ దాదాపు రూ.25 వేల నుంచి రూ.లక్ష ధర ఉంటుంది. గురవాయిగూడెం గ్రామానికి చెందిన రైతు కేవలం రూ.4 వేలతో థర్మాకోల్ ఇంక్యుబేటర్లు తయారు చేశారు.
జంగారెడ్డిగూడెం, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి అతి తక్కువ ఖర్చుతో పందెం కోడి పిల్లలను పొదిగిస్తూ ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నారు గ్రామీణ రైతు దల్లి చంద్రశేఖర రెడ్డి. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామా నికి చెందిన రైతు దల్లి చంద్రశేఖర రెడ్డికి పందెం కోళ్లను పెంచడం అంటే ఎంతో ఇష్టం. తన పొలంలో మంచి జాతి కోళ్లను పెంచుతున్నారు. అంతేకాదు వాటి గుడ్లను సేకరించి ఇంటివద్దనే థర్మాకోల్ బాక్స్‌లతో చేయించిన ఇంక్యుబేటర్ల (కోడిగుడ్లను పొదిగే యంత్రాలు)లో పిల్లల ను పొదిగిస్తున్నారు. ఒక్కొక్క ఇంక్యుబేటర్ గుడ్ల సంఖ్య ను బట్టి పలు కంపెనీలు రూ.20 వేల నుంచి రూ.లక్ష వరకు అమ్ముతున్నాయి. కంపెనీలు తయారు చేసిన ఇంక్యుబేటర్ కొంతకాలం వాడిన తరు వాత ఖర్చు బాగా పెరిగిపోతుంది. దీనితో రైతు చంద్రశేఖరరెడ్డి ప్రత్యామ్నా యం ఆలోచించారు. జంగారెడ్డిగూడెం మండలంలోని పేరంపేట గ్రామానికి చెందిన చదలవాడ కృష్ణ సహకా రంతో మెటీరియల్‌ను ఆన్‌లైన్‌లో థర్మాకోల్ బాక్స్‌లు, ఇతర మెటీరియల్ తెప్పించి 3 ఇంక్యుబేటర్లను తయారు చేయించారు. వాటికి రూ.పది వేల లోపు ఖర్చు చేసినట్లు చంద్రశేఖర రెడ్డి తెలిపారు. నాలుగేళ్లుగా థర్మాకోల్ ఇంక్యుబేటర్లను ఉపయోగిస్తూ మెరుగైన ఫలితాలను పొందుతున్నారు. ఒక్కొక్క ఇంక్యుబేటర్‌లో 77 గుడ్లు ఉంచుతున్నారు. వాటిలో ఒక్కొక్క బాక్స్‌లో 40 నుంచి 50 పిల్లలు మాత్రమే వస్తాయని మిగతా గుడ్లు నుంచి పిల్లలు తయారు కావని ఆయన వివరించారు.
ఇంక్యుబేటర్ తయారీ విధానం
థర్మాకోల్ బాక్స్ లోపల కోడి గుడ్లకు వేడికోసం విద్యుత్ బల్బ్ ఏర్పాటు చేస్తారు. గుడ్లను ట్రేలలో ఉంచుతారు. తేమ కోసం బాక్స్ లోపల ప్రతీ రోజు పావు లీటరు నీటిని ఒక గిన్నెలో పెడ తారు. బాక్స్ లోపల నిరంతరం వేడిని చెక్ చేయడానికి బయట టెంపరేచర్ మీటర్, బాక్స్ లోపల ట్రేలపై పెట్టిన గుడ్లను ఆటో మేటిక్‌గా రొటేట్ చేయడానికి రొటేషన్ మీటర్‌ను బిగిస్తారు. బాక్స్ లోపల గుడ్లకు 37.5 సెంటిగ్రేడ్ వేడి ఉండేలా మీటర్‌లో సెట్ చేస్తారు. టెంపరేచర్ ఎక్కువైతే ఆటోమేటిక్‌గా బల్బ్ ఆగిపోయి కూలింగ్ ఫ్యాన్‌లు తిరుగుతాయి. కాస్త టెంపరేచర్ తగ్గగానే బల్బ్ ఆటోమేటిక్‌గా వెలుగుతూ వేడినిస్తుంది. 21 రోజుల పాటు తల్లి కోడిపెట్ట పొదిగినట్లే ఇంక్యుబేటర్‌లో కూడా 21 రోజుల్లో గుడ్ల నుంచి కోడిపిల్లలు బయటకు వస్తాయి. కోడి గుడ్లను ఇంక్యు బేటర్‌లో పెట్టే ముందుగానే కొన్ని డమ్మీ గుడ్లను కోడిపెట్టను పొదిగిస్తారు. ఇంక్యూబేటర్ నుంచి వచ్చిన కోడిపిల్లలను 24 గంటల తర్వాత కోడిపెట్ట దగ్గర ఉంచుతారు. ఆ కోడిపెట్ట తాను పొదిగిన పిల్లలే అన్న భావనతో అవి పెద్దవి అయ్యే వరకు సంరక్షిస్తుంది. నాటు కోళ్లను కృత్రిమ పద్ధతిలో తక్కువ ఖర్చుతో పొందవచ్చని రైతు చంద్రశేఖర రెడ్డి చెబుతున్నారు.