సిఫార్సుకే ప్రాధాన్యం
ABN , Publish Date - Jun 29 , 2025 | 11:59 PM
గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంఽధించి కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఆదివారం బదిలీ కౌన్సెలింగ్ నిర్వహించారు.
కొనసాగుతున్న సచివాలయ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్
ఏలూరుసిటీ, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంఽధించి కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఆదివారం బదిలీ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ ప్రక్రియలో ప్రధానంగా సిఫార్సు ఉంటేనే బదిలీ చేసే పరిస్థితులు ఏర్పడ్డాయని సచివాలయ ఉద్యోగులు చెబుతున్నారు. బదిలీ ప్రక్రియ పారదర్శకంగా జరగడం లేదని, ఎమ్మెల్యేల సిఫార్సు పత్రాలు ఉంటేనే బదిలీలు చేస్తున్నారని పలువురు ఉద్యోగులు బహిరంగంగానే విమర్శించడం గమనార్హం.
జిల్లాలో సచివాలయ ఉద్యోగుల బదిలీ ప్రక్రియలో భాగంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు సంబంధించి పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు రెండో రోజు ఏలూరులోని పీఆర్ ఎస్‌ఈ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ముఖ్యంగా ఆప్షన్ ఫారాలపై మూడు ఆప్షన్లు కోరుకోమని చెబుతున్నారని, అసలు ఖాళీలు జాబితా ప్రకటించకుండా ఏ విధంగా కోరుకోవాలని పలువురు సచివాలయ ఉద్యోగులు ప్రశ్నించారు. సిఫార్సు పత్రాలు ఉన్నవారినే పరిగణలోకి తీసుకుంటున్నారని పేర్కొంటున్నారు. అసలు ఏ సిఫార్సు పత్రాలు లేకుంటే బదిలీలు చేయరా..? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు స్పౌజ్ కోటా ఉన్నా సిఫార్సు లేఖ ఉంటేనే ఉద్యోగులు ఎంపిక చేసుకున్న ప్రాంతానికి బదిలీ చేస్తామని సంబంధిత అధికారులే చెబుతుండడంతో ఉద్యోగులు ఏమి చేయాలో తెలియక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. సచివాయాల హేతుబద్ధీకరణ నేపఽఽథ్యంలో కొన్ని చోట్ల ఇంజనీరింగ్ పోస్టులకు అవకాశం లేకుండా పోయిందని ఉద్యోగులు వాపోతున్నారు. కాగా సచివాలయ ఉద్యోగుల బదిలీ ప్రక్రియ ఒక ప్రహసనంలా మారిందని, రాజకీయ పలుకుబడి ఉన్నవారికే ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శలు సర్వత్రా వినవస్తున్నాయి. ఆదివారం ఇంకా పలు శాఖలకు చెందిన సచివాలయ ఉద్యోగుల కౌన్సెలింగ్ జరిగింది.
సార్.. అన్యాయం చేయొద్దు..
కౌన్సెలింగ్‌లో నిబంధనలు పాటించడం లేదు.. ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్ల నిరసన
ఏలూరు రూరల్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి) : బదిలీల్లో సోషల్ వెల్ఫేర్ జేడీ నిబంధనలు పాటించడం లేదని గ్రామ, వార్డు సచివాలయాల ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు ఆరోపించారు. స్థానిక బాలయోగి సైన్స్ పార్క్ వద్ద సంఘం ఆధ్వర్యంలో పలువురు ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్లు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం సోషల్ వెల్ఫేర్ జేడీ వై.విశ్వమోహన్‌రెడ్డి కలిసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా ప్రతినిధుల సిఫార్సు చేసిన వారికి బదిలీల్లో ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. పారదర్శకంగా నిబంధనలు పాటించి బదిలీలు చేస్తున్నామని జేడీ వ్యాఖ్యలపై మండిపడుతూ కార్యాలయ ఆవరణలోనే ఆందోళనకు దిగారు. గ్రామ, వార్డు సచివాలయాల ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.అజయ్‌బాబు, ఏపీ జేఏసీ కార్యదర్శి మాట్లాడుతూ ఖాళీ పోస్టుల వివరాలు బహిర్గత పరచకుండా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారని, అధికార పార్టీ ఎమ్మెల్యే సిఫారసు లేఖలు ఉంటేనే ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు. తమకు న్యాయం జరగకపోతే కౌన్సెలింగ్ బాయ్‌కాట్ చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుత బదిలీల ప్రక్రియలో సుమారు 700 మంది తప్పనిసరిగా బదిలీ అయ్యే పరిస్ధితి ఉండగా ఆ మేరకు ఖాళీల వివరాలు తెలపకుండా కౌన్సెలింగ్ కేంద్రాల అధికారులు మూడు ప్రాంతాల్లో ఆప్షన్లు ఇవ్వాలని సూచిస్తున్నారని, ఉద్యోగులు ఇచ్చిన మూడు ఆప్షన్లు ఖాళీ లేకపోతే ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. కాగా బదిలీలు పారదర్శకంగా నిర్వహిస్తున్నామని సోషల్ వెల్ఫేర్ జేడీ వై.విశ్వమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. బదిలీల్లో దివ్యాంగులు, వితంతువులకు ప్రాధాన్యనిస్తున్నామని, ప్రజా ప్రతినిధుల లేఖలకు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్లు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.