అల కల్లోలం
ABN , Publish Date - Oct 29 , 2025 | 01:02 AM
మొంథా తుఫాన్ ప్రభావంతో మంగళవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తీవ్రమైన ఈదురుగాలులు, భారీ వర్షాలతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు.
నరసాపురం, మొగల్తూరుకు తీవ్ర నష్టం..
పలు గ్రామాలను ఖాళీ చేయించిన అధికారులు
వంద మీటర్లు ముందుకొచ్చిన సముద్రం
100 కిలోమీటర్ల వేగంతో గాలులు
బిక్కుబిక్కుమంటున్న తీర గ్రామాల ప్రజలు
పునరావాస కేంద్రాలకు వేల మంది తరలింపు
పీఎం లంకలో చెట్టుకొమ్మ పడి వృద్ధురాలి మృతి
పలు చోట్ల నేలకొరిగిన భారీ వృక్షాలు
ట్రాఫిక్, విద్యుత్ సరఫరాకు అంతరాయం
మొంథా తుఫాన్ ప్రభావంతో మంగళవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తీవ్రమైన ఈదురుగాలులు, భారీ వర్షాలతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. తీర ప్రాంతంలో కడలి ఉవ్వెత్తున ఎగసిపడడంతో అల్లకల్లోలంగా మారింది. సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చింది. గాలుల తీవ్రతకు వరి చేలు నేలనంటాయి. మినుము పంట దెబ్బ తింది. ఆక్వా రైతులకు ఊపిరాడలేదు. భారీ చెట్లు నేలకూలాయి. విద్యుత్ స్తంభా లు విరిగిపడ్డాయి. పలుచోట్ల రోజంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పలు బస్సు సర్వీసులు రద్దు చేశారు. నరసా పురం, మొగల్తూరు మండలాల్లో 19, ఏలూరు జిల్లాలో 54 తుఫాను పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేశారు. ముందస్తు సహాయక చర్యలపై జిల్లా ఇన్‌చార్జి మంత్రులు, ప్రత్యేకాధికారులు, కలెక్టర్లు సమీక్షించారు. తీర ప్రాంతం, కొల్లేరులో క్షేత్రస్థాయిలో పర్యటించి సహాయక చర్యలు అడిగి తెలుసుకున్నారు.
నరసాపురం/రూరల్/మొగల్తూరు, అక్టోబరు 28(ఆంధ్ర జ్యోతి):మొంథా తుఫాన్ అల్లకల్లోలం సృష్టించింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రాత్రి పొద్దుపోయే వరకు ఈదు రు గాలులు, వర్షాలు, సముద్రహోరుకు ప్రజలు బిక్కుబిక్కు మంటూ గడిపారు. కడలి కల్లోలంగా మారింది. నరసా పురం, మొగల్తూరు మండలాల్లోని పేరుపాలెం, కేపీ పాలెం, పీఎం లంక వద్ద 100 మీటర్ల మేర కడలి ముందుకు చొచ్చుకొచ్చింది. అలలు ఎగసి పడుతున్నాయి. ఉద యం నుంచి భారీ వర్షం కురుస్తూనే ఉంది. ఈదురు గాలుల బీభత్సానికి భారీ వృక్షాలు నేలకొరిగాయి. కొబ్బరి, తాడి, సరుగుడు, మామిడి చెట్లు విరిగిపడ్డాయి. నరసా పురంలో వందేళ్ల నాటి భారీ వృక్షాలు కూకటివేళ్లతో సహా నేలకొరిగాయి. విద్యుత్ వైర్లు తెగి, స్తంభాలు నేలకొరి గాయి. ఉదయం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పీఎం లంకలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. నరసాపురం–సీతా రాంపురం, ధర్భరేవు, వేములదీవి గ్రామాల్లో చెట్లు రోడ్డుపై పడడం ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. గాలులకు, వర్షాల కు ప్రజలు ఇంటికే పరిమితమయ్యారు. చినలంక నుంచి మోళ్లపర్రు వరకు ఉన్న 19 కిలోమీటర్ల సముద్ర తీరాన్ని మూసివేశారు. సోమవారంతో పోలిస్తే మంగళవారం 100 మీటర్ల వద్ద ముందుకు చొచ్చుకొచ్చింది. పీఎం లంక వద్ద చాలాచోట్ల గట్టు కోతకు గురైంది. కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. పేరుపాలెం వద్ద ఇదే పరిస్థితి. ఎన్డీఆర్ ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్, మైరెన్, పోలీసులు గస్తీ నిర్వహించారు.
వేల మంది పునరావాస కేంద్రాలకు..
గాలలు, సముద్రం హోరుకు భయపడిన తీరప్రాంత వాసులు పునరావస కేంద్రాలకు తరలివచ్చారు. నరసా పురం, మొగల్తూరు మండలాల్లోని 19 కేంద్రాలకు వారిని తరలించారు. అత్యధికంగా పీఎంలంక క్రేందంలో 2వేల మంది పునరావాసం పొందారు. కేపీపాలెం ఉన్నత పాఠ శాల, మెట్రేవు, బీకే మెరక, మోళ్లపర్రు, పేరుపాలెం ఉన్నత పాఠశాల, లైన్ పల్లవపాలెం, పాతపాడు గ్రామాల్లో పునరా వాస కేంద్రాలు ఏర్పాటుచేసి మత్స్యకారులతోపాటు, తుఫాన్ ప్రభావిత గ్రామాల ప్రజలను తరలించారు. ఒక్కసారిగా గ్రామస్థులు రావడంతో చాలాచోట్ల భోజనాలకు ఇబ్బందులు ఏర్పడినా అప్పటికప్పుడు వండి వడ్డించారు. అన్ని కేంద్రాల వద్ద వైద్య శిబిరాలు, జనరేటర్లు ఏర్పాటు చేశారు.
ఉప్పుటేరుల్లో నీటి ప్రవాహం ముందుకు సాగడం లేదు. దర్భరేవు, గొంతేరు, బొంతేరు, వెస్ట్ కుక్కులేరు, ఈస్ట్ కుక్కు లేరు, మాగలేరు డ్రెయిన్ బిగిసి ఉండడంతో నీరు పారక వరి చేలు, ఆక్వా చెరువులోకి ప్రవహించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గ్రామాల్లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా కలెక్టర్ నాగరాణి ఏర్పాట్లు చేశారు. పునరావాస కేంద్రాలను ఎస్పీ నయీం అస్మీ, ఆర్డీవో దాసిరా జు, తహసీల్దార్లు, అధికారులు పరిశీలించారు. నరసాపురం నియోజకవర్గంలో 16 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు.