ఎన్నాళ్లీ కష్టాలు!
ABN , Publish Date - Jul 13 , 2025 | 01:09 AM
ఏటా వర్షాకాలం వచ్చిందంటే చాలు మూడు నెలలుపాటు మూటాముల్లె సర్దుకోవాల్సిందే. కొండలు, గుట్టలమీద పాకలు వేసుకుని కాలక్షేపం చేయాల్సిందే.
పునరావాసం పూర్తయితే ఈ కష్టాలు తీరేవి
సొంతూరు వీడలేక గుట్టలమీదే ఆవాసాలు.. అధికారుల ఒత్తిడితో కొన్నాళ్లు సర్దుబాటు
ముంపు మండలాల్లో వానాకాలం కష్టాలు అన్నీఇన్నీకావు
ఏటా వర్షాకాలం వచ్చిందంటే చాలు మూడు నెలలుపాటు మూటాముల్లె సర్దుకోవాల్సిందే. కొండలు, గుట్టలమీద పాకలు వేసుకుని కాలక్షేపం చేయాల్సిందే. ఇదంతా ముంపు మండలాలైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో గిరిజనులు, గిరిజనేతరులు ఎదుర్కొం టున్న సమస్య. గోదావరి వరద వీరందరికి కొత్తేమి కాదు. భద్రా చలం వద్ద గోదావరి ఉరకలను బట్టి ఇక్కడ ముందస్తు జాగ్రత్తలకు దిగుతారు. అంతే తప్ప ఊరుదాటి వెళ్లేందుకు ఇష్టపడరు. ఇంకా ఎన్నాళ్లూ తమకు ఈ కష్టాలు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆరంభమైన తర్వాత, ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మాణం జరిగిన తర్వాత సీనే మారి పోయింది. ఎగువ నుంచి వస్తున్న వరద పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నుంచి దిగువకు మళ్లాల్సిఉంది. ఈ నేపథ్యంలోనే గత నాలుగేళ్లగా భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ కావడానికి ముందుగానే ముంపు మండలాల్లో సురక్షిత ప్రాంతాలకు ప్రజలు తరలింపు ఆరం భమవుతోంది. అధికారులు పెద్దసంఖ్యలో మకాం వేసి పున రావాస కాలనీలకు నిర్వాసితులను ముందస్తుగా తరలిస్తూ ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. ఎద్దువాగు, గుండేటివాగులోకి గోదావరి వరద చేరుతుండటంతో రాక పోకలు స్థంభిస్తున్నాయి. దాదాపు పాతిక గ్రామాలకు పైగానే ఇబ్బందులకు గురవుతున్నాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు గ్రామస్తులను పదేపదే ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు చేరాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. అయినా కొందరు ఈ వరద అంతా తమకు కొత్తేమి కాదనే ధీమాతో ఉన్నారు. గొమ్ముగూడెం ఇతర ప్రాంతాలకు చెందిన వారు సమీపాన ఉన్న గుట్టలపై తాత్కాలికంగా నివాసం కోసం పాకలు ఏర్పాటు చేసుకు న్నారు. రెండేళ్ల క్రితం గోదావరికి భారీ వరదలు వచ్చిన ప్పుడు రుద్రంకోట నుంచి ఇతర గ్రామాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలోనే రోజుల తరబడి కొండలపైనే కాలక్షేపం చేశారు. ఇంకోవైపు పునరావాసం కింద పూర్తిగా నష్టపరి హారం చెల్లించి పునరావాస కాలనీల్లో అన్ని సౌకర్యాలు కల్పించి ఉంటే ముంపు మండలాల వాసులకు ఈ కష్టా లు తప్పేవి. కానీ దీనికి భిన్నంగా వరుసగా నాలుగో ఏటా కూడా గోదావరి వరద తాకిడికి పెద్దసంఖ్యలో ప్రజలు ఇళ్లను ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది.
పొంచి ఉన్న ముప్పు : గతేడాది భారీ వర్షాల తాకిడికి పెద్దవాగు ప్రాజెక్టుకు గండిపడింది. ఒకవైపు తెలంగాణ, మరోవైపు ఆంధ్రప్రదే శ్‌లు ఈ ప్రాజెక్టు నిర్వహణా వ్యయంలో ఖర్చును భరించాల్సి ఉంది. మరమ్మతు చేయాలన్న ఇదే దామాషా పద్ధతి. ఈ నేపథ్యంలో గతేడాది పెద్దవాగు ప్రాజెక్టుకు నష్టం వాటిల్లితే కేవలం నామమాత్రపు పనులతో సరిపెట్టారు. కానీ ఈసారి మరోసారి భారీ వర్షాలకు ఆస్కారం ఉంటే పెద్దవాగు ప్రాజెక్టు వద్ద చేసిన తాత్కాలిక పనులన్నీ దెబ్బతినే అవకాశం లేకపోలేదు. ఇదే భయంతో దిగువ గ్రామాల్లో ఉన్న స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వేసవిలోనే పెద్దవాగు ప్రాజెక్టుకు శాశ్వత మరమ్మతులు చేపట్టాల్సిందీ పోయి కాలక్షేపం చేశారు. ఈ కారణంగా పెద్దవాగు ప్రాజెక్టు దిగువన వరద ముంపు పొంచే ఉంది.