Share News

ఇల్లు కట్టుకుంటారా.. డబ్బులిచ్చేస్తారా..?

ABN , Publish Date - Aug 05 , 2025 | 12:42 AM

ప్రధానమంత్రి ఆవాస యోజనలో నాటి వైసీపీ ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లు లబ్ధిదారులకు శాపంగా మారాయి.

ఇల్లు కట్టుకుంటారా.. డబ్బులిచ్చేస్తారా..?

ఇళ్ల లబ్ధిదారులకు నోటీసులు

గతంలో నిర్మాణాలకు అడ్వాన్స్‌లు చెల్లింపు

ప్రస్తుతం రికవరీకి అధికారుల చర్యలు

కాంట్రాక్టర్లకు కూడా తాఖీదులు

గిట్టుబాటు కాదంటున్న కాంట్రాక్టర్లు

అమ్మకానికి ఇళ్ల స్థలాలు

రంగంలో దిగిన దళారులు

ప్రధానమంత్రి ఆవాస యోజనలో నాటి వైసీపీ ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లు లబ్ధిదారులకు శాపంగా మారాయి. పట్టణ ప్రాంత పేదలకు దూరంగా లోతట్టు ప్రాంతంలో స్థలం కేటాయించడంతో ఇంటి నిర్మాణానికి వెనుకంజ వేశారు. కొంత మందికి ప్రభుత్వం అడ్వాన్స్‌లు చెల్లిస్తే మరికొన్ని నిర్మాణాలు కాంట్రాక్టర్లకు అప్పగించారు. తాజాగా ఇళ్లు నిర్మించుకోండి లేకుంటే అడ్వాన్స్‌లు తిరిగిచ్చేయండి అంటూ అధికారులు లబ్ధిదారులకు నోటీసులు ఇస్తున్నారు. మరోవైపు కాంట్రాక్టర్లకు కూడా తాఖీదులు ఇచ్చినా తమకు గిట్టుబాటు కాదంటూ బేఖాతరు అంటున్నారు.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

ఇళ్ల నిర్మాణానికి అనువుగా లేదని లబ్ధిదారులు, వైసీపీ నేతల అశీస్సులతో స్థలాలు పొందిన అనుచరు లు ఇళ్లు నిర్మించుకోలేదు. వారిపై గృహ నిర్మాణ శాఖ కొరడా ఝళిపిస్తోంది. ఇళ్లు కట్టుకుంటారా లేదంటే ప్రభుత్వం ఇచ్చిన అడ్వాన్స్‌ తిరిగి చెల్లిస్తారా అంటూ లబ్ధిదారులను వెంటాడుతోంది. జిల్లాలో ఇప్పటి వరకు 1487 మంది లబ్ధిదారులు గత ప్రభుత్వంలో అడ్వాన్స్‌ తీసుకుని ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు. ప్రభుత్వం రూ. 2.87 కోట్లు అడ్వాన్స్‌ అప్పట్లో చెల్లించింది. ఆ సొమ్ముల రికవరీకి గృహ నిర్మాణ అధికారులు రంగంలో దిగారు. ఇంటి నిర్మాణం చేపడితే సరేసరి.. లేదంటే రికవరీ చేసేందుకే అధికారులు మొగ్గు చూపుతున్నారు. జిల్లా లో అడ్వాన్స్‌ తీసుకుని ఇంటి నిర్మాణాలు చేపట్టని లబ్ధిదారులకు నోటీసులు జారీ చేస్తున్నారు.

కాంట్రాక్టర్లకు తాఖీదు

వైసీపీ హయాంలో మంజూరు చేసిన ఇళ్లలో 3 కేట గిరీలుగా విభజించారు. లబ్ధిదారులు నిర్మించుకోలేని పక్షంలో ప్రభుత్వమే నిర్మించి ఇవ్వడానికి ముందుకు వచ్చింది. కాంట్రాక్టర్లను నియమించింది. జిల్లాలో 6700 ఇళ్లకు సంబంధించి కాంట్రాక్టర్లకు గతంలో అడ్వాన్స్‌లు కూడా చెల్లించారు. ముగ్గురు కాంట్రాక్టర్లు ఇళ్లు నిర్మించకుండా ముఖం చాటేశారు. అడ్వాన్స్‌ తీసు కున్న కాంట్రాక్టర్లకు అధికారులు నోటీసులు జారీ చేసి నా బేఖాతరు అంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.1.80 లక్షలు ఇంటి నిర్మాణానికి సరిపోవని కాంట్రాక్టర్లు వెనకడుగు వేశారు. వారందరికి ప్రస్తుతం నోటీసులు జారీ చేసినా స్పందించకపోవడంతో క్రిమినల్‌ కేసులు నమోదుకు అధికారులు సిద్ధపడుతున్నారు

చేతులు మారుతున్న స్థలాలు

పట్టణ లబ్ధిదారులకు మంజూరు చేసిన స్థలాలు విక్రయించేస్తున్నారు. దళారులు రంగప్రవేశంతో స్థలా లు చేతులు మారుతున్నాయి. ప్రభుత్వం భవిష్యత్‌లో ఇళ్లను విక్రయించుకునే వెసులుబాటు కల్పించడంతో గతంలో మంజూరైన స్థలాలను విక్రయించేందుకు లబ్ధిదారులు మొగ్గుచూపుతున్నారు. ఇంటి నిర్మాణ సామర్ధ్యం లేనివారు విక్రయిస్తున్నారు.

టిడ్కో ఇళ్లు ఇవ్వండి..!

తణుకు, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): టీడీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు నిర్మాణం పూర్తయిన టిడ్కో గృహాలను తర్వాత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఐదేళ్ల పాలనలో లబ్ధిదారులకు ఇళ్లు అప్పగించలేదు. టిడ్కో గృహసముదాయ భవనాలు పిచ్చిమొక్కలతో నిరుపయోగంగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం కూడా ఏడాది కాలంలో మిగిలిన కొద్దిపాటి పనులపై దృష్టి సారించలేదు.

టిడ్కో భవన సముదాయ నిర్మాణాలను ఏళ్ల తరబడి నిర్లక్ష్యం చేయడంతో నివాసానికి ఉపయోగప డతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇనుప ఊచలు పైకి అలానే ఉన్నాయి. ప్లాట్లు లోపల కూడా బీటలు వారాయి. ఇప్పటికే డబ్బు చెల్లించిన లబ్ధిదారులు ఇళ్ల కోసం ఇంకెంత కాలం వేచి చూడాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అద్దె ఇంట్లో ఉంటూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.

కాంట్రాక్టరు రావాల్సి ఉంది

ప్రభుత్వం కాంట్రాక్టరుకు పనులు అప్పగించింది. తొందర్లోనే కాంట్రాక్టరు పనులు చేపడతారు. లబ్ధిదా రుల బ్యాంకు రుణాలపై వడ్డీ ప్రభుత్వం చెల్లిస్తుంది. తొందర్లోనే ప్లాట్లు పూర్తి చేయడం జరుగుతుంది.

టి.రామ్‌కుమార్‌, మునిసిపల్‌ కమిషనర్‌

ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు

ప్లాటు కేటాయించినపుడు ప్రభుత్వానికి రూ.75వేలు డీడీ చెల్లించాం. రుణం వచ్చినప్పటికి ఇల్లు మాత్రం అప్పగించ లేదు. అధికారులు, బ్యాంకులో సరైన సమాధానం చెప్పడం లేదు. మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. వెంటనే పరిష్కారం చేసి ప్లాట్లు ఇవ్వాలి.

వి.లలిత, లబ్ధిదారు

అద్దె ఇంట్లో తప్పని తిప్పలు

చాలా వరకు నిర్మాణం పూర్తయినా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఇల్లు అప్పగించ లేదు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. డబ్బులు కట్టాలని బ్యాంకు నుంచి ఒత్తిడి చేసేవారు. అద్దె ఇంట్లో కుటుంబం గడవడం కష్టంగా ఉంది. ప్రభుత్వం స్పందించి వీలైనంత త్వరగా ఫ్లాట్‌ అప్పగించాలి.

కె.అనిత, లబ్ధిదారు

Updated Date - Aug 05 , 2025 | 12:42 AM