ప్రభుత్వ స్థలాల్లో పేదలకు పట్టాలు
ABN , Publish Date - Sep 29 , 2025 | 12:03 AM
అభ్యంతరంలేని పోరంబోకు భూములలో పేదలకు పట్టాల మంజూరుకు అధికారులు చర్యలు చేపట్టారు.
ప్రతిపాదనలు సిద్ధం చేయండి
అధికారులకు జేసీ ఆదేశాలు
పేదలను కలిసిన రాహుల్ కుమార్‌రెడ్డి
భీమవరం రూరల్, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): అభ్యంతరంలేని పోరంబోకు భూములలో పేదలకు పట్టాల మంజూరుకు అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్‌రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. భీమవరం మండలం గొల్లవానితిప్ప గ్రామంలో జేసీ టి.రాహుల్ కుమార్‌రెడ్డి సంబంధిత శాఖల అధికారులతో కలిసి ఆదివారం పలు నివా సాలను పరిశీలించారు. ప్రభుత్వ పోరంబోకు స్థలాలలో ఇల్లు నిర్మించుకున్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులతో స్వయంగా మాట్లాడి ఇంటి పన్ను, కరెంట్ బిల్లు రసీదులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జీవో ఎం ఎస్ నెంబర్ 30 ప్రకారం 2019 ముందు ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న అందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. లబ్ధిదారులు ఇంకనూ ఎవరైనా ఉంటే వివరాలు సేకరించి ప్రతిపాదనలను పంపాలని జేసీ రాహుల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆర్డీవో కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి, తహసీల్దార్ రావి రాంబాబు, మండల సర్వేయర్, వీఆర్వో, సిబ్బంది తదితరులు ఉన్నారు.