Share News

ప్రచారమేదీ ?

ABN , Publish Date - Oct 11 , 2025 | 12:42 AM

పట్టణాలు నగరాల్లో పేద, మధ్య తర గతి ప్రజలు సొంతింటి కల సాకారం చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం బృహత్తర అవకాశం కల్పించింది. ప్లాన్‌లు కోసం కాళ్లరిగేలా తిరగడంతో పాటు వివిధ అనామత్‌ ఖర్చుల కింద వేలల్లో భరించే వెసులుబాటు నుంచి విముక్తి కల్పించింది.

ప్రచారమేదీ ?

రూ.1కే.. ఇంటి నిర్మాణ ప్లాన్‌

50 చ.మీలకు ప్లాన్‌ రుసుం తొలగింపు

క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన లేమి

పట్టించుకోని అధికార యంత్రాంగం

ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు వెసులుబాటు

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

పట్టణాలు నగరాల్లో పేద, మధ్య తర గతి ప్రజలు సొంతింటి కల సాకారం చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం బృహత్తర అవకాశం కల్పించింది. ప్లాన్‌లు కోసం కాళ్లరిగేలా తిరగడంతో పాటు వివిధ అనామత్‌ ఖర్చుల కింద వేలల్లో భరించే వెసులుబాటు నుంచి విముక్తి కల్పించింది. 50 చదరపు మీటర్ల సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు చెల్లించాల్సిన ప్లాన్‌ రుసుం ఎత్తేసింది. కేవలం రూ.1 చెల్లిస్తే అనుమతులు మంజూరు చేసేలా పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో ఏలూరు కార్పొరేషన్‌తో పాటు నూజివీడు, జంగా రెడ్డిగూడెం మునిసిపాలిటీలు, చింతలపూడి నగర పంచాయతీల్లో 1500 నుంచి 2వేల వరకు 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పక్కా గృహాలు, రెండతస్తుల భవనాలు నిర్మిస్తుంటారు.

ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం..

ఇంటి నిర్మాణదారుడు ప్లాన్‌ కోసం ఆన్‌లైన్‌లో స్థలం పత్రాలు, ఆధార్‌కార్డు, లింక్‌ రిజిస్ర్టేషన్‌ డాక్యుమెంట్లు, ఈసీ, మార్కెట్‌ విలువ, సొంత అఫిడవిట్‌ ఇతర వివరాలను నమోదు చేయాలి. అనంతరం రూ.1 చెల్లిస్తే పురపాలక సంఘం ప్రణాళిక విభాగంలో అధికారులు వాటిని పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తారు.

గత ప్రభుత్వంలో ఛార్జీల మోత

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి ఇళ్ల నిర్మాణ అనుమతి రుసుం, దరఖాస్తు ఛార్జీలు, ట్రీగార్డు, ఇంకుడుగుంత, ఆ ప్రాంత అభివృద్ధి ఛార్జీల పేరుతో రూ.15 వేలు నుంచి రూ.20 వేల వరకు వసూలు చేసేవారు. ఇంటికి 30 అడుగుల రహదారి ఉంటేనే ప్లాన్‌కు అనుమతి లభించేది. లేకుంటే తన స్థలంలోని 30 అడుగులను ఆయా పురపాలక సంఘానికి దాఖలు పరుస్తూ తన సొంత ఖర్చులతో రిజిస్ర్టేషన్‌ చేయిస్తే ప్లాన్‌ మంజూరు చేసేవారు. కూటమి సర్కార్‌ ఆ

నిబంధనలను సవరించింది.

నిస్తేజం వీడేదెన్నడో ?

అయితే ఈ పథకం అమలు ప్రారంభించి కొద్దినెలలు అవుతోంది. అధికారులు, టౌన్‌ప్లానింగ్‌ సిబ్బంది కనీసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో పథకం అమలు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటి వరకు జిల్లాలో ఏలూరు కార్పొరేషన్‌ సహా ఏ పురపాలక సంఘంలోను అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం లేదు. ఈ విషయంలో ప్రజా ప్రతినిఽధులు, అధికారులకు సమన్వయం కొరవడిందనే విమర్శలున్నాయి. చింతలపూడి నగర పంచాయతీలో ఈ పథకం అమలు తీరుపై కమిషనర్‌ అంబటి రాంబాబును వివరణ కోరగా ఇప్పటికేమి దరఖాస్తులు రాలేదన్నారు. ఏలూరు కార్పొరేషన్‌లో కనీసం ఫోన్‌ ఎత్తి సమాచారం చెప్పే అధికారులే కరువయ్యారు. టౌన్‌ ప్లానింగ్‌ కిందిస్థాయి నుంచి పైస్థాయి అసిస్టెంట్‌ సిటీ ప్లానర్‌ సునీత వరకు అంతా ఇన్‌చార్జుల ఏలుబడిలోనే సాగుతోంది. కనీసం ఒక్క దరఖాస్తు కూడా రాలేదని సమాచారం. కనీసం ఈ పఽథకం అమలుపై కలెక్టర్‌ స్థాయిలోను ఎటువంటి సమీక్షలు జరగలేదు. ఇప్పటికైనా పాలక వర్గాలు, అధికారులు ఈ పథకంపై ప్రజలకు అవగాహన కల్పిస్తే వారికి మేలు జరుగుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Updated Date - Oct 11 , 2025 | 12:42 AM