Share News

చిగురించిన ఆశలు!

ABN , Publish Date - Nov 03 , 2025 | 12:21 AM

ఏటా గోదావరి వరదలు వస్తే పిల్లా పాపలతో తట్టాబుట్టా సర్దుకుని మెరక ప్రాంతాలకు తరలి వెళ్లాలి.. రహదారులు మూసుకు పోతాయి.

చిగురించిన ఆశలు!
ఏటా గోదావరి వరదలతో ముంపునకు గురవుతున్న కుక్కునూరు బీ, సీ బ్లాక్‌లు (ఫైల్‌)

మంత్రి నిమ్మల హామీతో నిర్వాసితుల్లో సంతోషం

పట్టించుకోని గత వైసీపీ ప్రభుత్వం

సరిదిద్దుతున్న కూటమి ప్రభుత్వం

ఏటా గోదావరి వరదలు వస్తే పిల్లా పాపలతో తట్టాబుట్టా సర్దుకుని మెరక ప్రాంతాలకు తరలి వెళ్లాలి.. రహదారులు మూసుకు పోతాయి. లోతట్టు ప్రాంతంలో ఉన్న ఆ గ్రామాలను 41.15 కాంటూరు లెవెల్‌లో చేర్చి పరిహారం అందించాలి. కానీ గత ప్రభుత్వ నిర్లక్ష్యం, క్షేత్రస్థాయిలో ముంపును గుర్తించకుండా అధికారుల ఉదాసీనత కారణంగా వేలాది మంది నిర్వాసితులకు పరిహారం అందని పరిస్థితి ఏర్పడింది. తాజాగా రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల ప్రకటనతో ఆ గ్రామాల నిర్వాసిత కుటుంబాల్లో ఆశలు రేకెత్తాయి.

– కుక్కునూరు

వైసీపీ ప్రభుత్వ నిర్వాకంతో అన్యాయం

వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 45.72 కాంటూరు లెవెల్‌లో నిర్మాణం చేపట్టారు. అందుకు అనుగుణంగా భూసేకరణ, నిర్వాసితు లకు పునరావాస ప్రక్రియ చేపట్టారు. కానీ గత వైసీపీ ప్రభుత్వం అనూహ్యంగా 41.15 కాంటూ రు లెవెల్‌ని తెర మీదకు తీసుకొచ్చింది. ఏటా గోదావరి వరద ముంపునకు గురవుతున్న పలు గ్రామాలను 41.15 కాంటూరు లెవెల్‌లో ముంపు నకు గురవుతున్నట్టు గుర్తించలేదు. కొన్ని గ్రామాలు వరద ముంపునకు గురి కానప్పటికి వాటిని 41.15 కాంటూరు లెవెల్‌లో చేర్చి పరి హారం అందించడంతో బాధిత నిర్వాసితులు విస్తుబోయారు.

ఆదుకుంటాం.. మంత్రి నిమ్మల హామీ

కుక్కునూరు మండలంలో బీ,సీ,డీ బ్లాక్‌లు పెద్దగూడెం, ఉప్పరిమద్దిగట్ల, ముత్యామ్మపాడు, కౌండిన్యముక్తి, మాధవరం, ఎల్లప్పగూడెం, అంబోతులగూడెం, చెరువుకొమ్ముగూడెం, సీతా రామనగరం, వెంకటాపురం ఎస్సీ కాలనీ, శ్రీధర తదితర గ్రామాలు ఏటా గోదావరి వరదకు ప్రభావితం అవుతున్నాయి. ఈ గ్రామాలేవి 41.15 కాంటూరులో లేవు. ఇదే పరిస్థితి అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం, మిగిలిన ముంపు మండలాల్లోను ఉంది. గత వైసీపీ ప్రభుత్వ నిర్వాహం వల్ల 41.15 కాంటూరు లెవెల్‌లో ఉన్న గ్రామాలకు మాత్రమే పరిహారం ఇచ్చి 45.72 కాంటూరు లెవెల్‌లో ఉన్న గ్రామాలకు పరిహారం ఇవ్వరు అనే భావనలో నిర్వాసితుల్లో నెలకొంది. కానీ 45.72 కాంటూరు లెవెల్‌లో ఉన్న గ్రామాలు కూడా పరిహారం ఇస్తామని వేలేరుపాడులో శనివారం జరిగిన పరిహారం అందజేత సభలో మంత్రి నిమ్మల హామీ ఇవ్వడంతో నిర్వాసిత గ్రామాల్లో సర్వత్ర హర్షం వ్యక్తమవు తోంది. ‘41.15 కాంటూరు లెవెల్‌లో ఉన్న గ్రామాలకు పూర్తి స్థాయిలో పరి హారం అందజేస్తున్నాం. ఇక 45.72 కాంటూరు లెవెల్‌లో ముంపు గ్రామాలపై దృష్టి పెట్టి పరి హారం చెల్లిస్తాం’ అంటూ ఆయన స్పష్టం చేయ డంతో తమకు సైతం పరిహారం అందుతుందని, తమ కష్టాలు తీరుతాయని నిర్వాసిత కుటుంబా ల్లో ఆనందం నెలకొంది. ప్రాజెక్టు పరిధిలోని ఆరు మండలాల్లో 45.72 కాంటూరు లెవెల్‌లో 201 గ్రామాలు ఉండగా సుమారు 58 వేలు కుటుంబాలున్నాయి. కూటమి ప్రభుత్వ నిర్ణ యంతో వీరందరికీ న్యాయం జరగనుంది.

మా గ్రామం ముంపులో లేదు

మా గ్రామం కుక్కు నూరు పంచాయతీలో ఉంది. గోదావరి వరద కారణంగా గుండేటివాగు ప్రభావంతో మా గ్రామం ముంపునకు గురవుతుంది. అయినా ముంపులో చేర్చలేదు. ఇప్పుడు 45.72 కాంటూరులో చేర్చి పరిహారం ఇవ్వాలి.

– కొవ్వాసి నాగార్జున, వంజ్యంవారిగుంపు

మేము మునుగుతున్న పరిహారం లేదు

గోదావరి వరదలకు మునుగుతున్న మా గ్రామాన్ని 41.15 కాంటూరులో చేర్చకుండా 45.72 పరిధిలో చేర్చారు. దీంతో మాకు అన్యాయం జరిగింది. ఇప్పుడు మంత్రి ఇచ్చిన హామీతో మాకు న్యాయం జరిగే అవకాశం ఉంది.

– ఎన్‌.నాగరాజు, బెస్తగూడెం

మండలాన్ని యూనిట్‌గా తీసుకోవాలి

మండలాన్ని యూనిట్‌గా తీసుకుని గ్రామాలకు పరిహారం అందించాలి. అప్పుడే ప్రతి నిర్వాసి తునికి న్యాయం జరుగు తుంది. అధికారులు వేగవంతంగా ప్రాజె క్టు నిర్మాణం పూర్తి చేసున్నట్టే పునరావాస ప్రక్రియ పూర్తి చేయాలి. నిర్వాసితులకు అన్ని విధాల న్యాయం చేయాలి.

– యర్రంశెట్టి నాగేంద్రరావు,

సీపీఎం జిల్లా నాయకుడు

45.72 కాంటూర్‌ లెవెల్‌లో

పరిహారం అందించాలి

45.72 కాంటూర్‌ లెవెల్‌లో ముంపు గ్రామాలకు పరిహారం అందిస్తామని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు. ఆ మేరకు అమలు చేస్తే అన్ని గ్రామాల నిర్వాసితులకు న్యాయం జరుగుతుంది. గోదావరి వరదలకు ఏటా ముంపుకు గురవుతున్న నిర్వాసితుల భాధలు తీరుతాయి.

– కొన్నె లక్ష్మయ్య, సీపీఐ మండల కార్యదర్శి

Updated Date - Nov 03 , 2025 | 12:21 AM