Share News

దళితులు లక్ష్యంగా జగన్‌ దాడులు

ABN , Publish Date - May 14 , 2025 | 12:40 AM

రాష్ట్రంలో దళితులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడిన ఘనత జగన్‌కు దక్కుతుందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు.

దళితులు లక్ష్యంగా జగన్‌ దాడులు
తణుకులో కమ్యూనిటీ హాలును ప్రారంభిస్తున్న మంత్రి అనిత

హోం మంత్రి అనిత ధ్వజం

తణుకు, మే 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో దళితులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడిన ఘనత జగన్‌కు దక్కుతుందని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. తణుకు నియోజకర్గంలో మంగళవారం పర్యటించిన ఆమె మాట్లాడుతూ దళితులకు చెందాల్సిన పథకాలను జగన్‌ పాలనలో నిర్వీర్యం చేశారన్నారు. డాక్టర్‌ సుధాకర్‌ను నడిరోడ్డుపై చిత్ర హింసలకు గురి చేశారని, ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్‌ను చంపి డోర్‌ డెలివరీ చేశారని, ఇసుక కుంభకోణంపై ప్రశ్నించిన వరప్రసాద్‌ అనే దళిత యువ కుడిని సాక్షాత్తు పోలీసు స్టేషన్‌లో కూర్చో పెట్టి శిరోముండనం చేశారని గుర్తు చేశారు. దళితులనే లక్ష్యంగా చేసుకొని అరాచకాలు చేశారని ఆమె దుయ్యబట్టారు.

టీడీఆర్‌ కుంభకోణంలో ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు నియోజకవర్గ ప్రజల నుంచి చీత్కారాలు ఎదుర్కొన్నారని ఎద్దేవా చేసారు. స్వేచ్ఛ, సమానత్వం చూపించడా నికి తానే ఒక మార్గదర్శిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థాయిలో సామాన్యురాలి ఇంటికి వచ్చి అతిథ్యం స్వీకరించారని గుర్తు చేశారు. తనలాంటి సామాన్య ఉపాధ్యాయురాలు అసెంబ్లీకి వెళ్లిందంటే ఆనాడు బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ పెట్టిన బిక్షగా భావించాలన్నారు. దళిత వర్గానికి రెండు కళ్లు అంబేడ్కర్‌, బాబు జగ్జీవన్‌ అన్నారు. అంబేడ్కర్‌, జగ్జీవన్‌ విగ్రహాలు దళితవాడల్లో ఒకేచోట ఏర్పాటు చేయడం దళితుల మద్య ఐక్యతకు నిదర్శనం అన్నారు. వారి అడుగు జాడల్లో వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు.

వైసీపీ ప్రభుత్వంలో దళితుల పథకాలకు తిలోదకాలు ఇస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పునరుద్ధరించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కే దక్కు తుందన్నారు. ఏపీఐఐసీ చైర్మన్‌ మంతెన రామరాజు మాట్లాడుతూ గంజాయిపై ఉక్కు పాదం మోపిన ఘనత మంత్రి అనితకే దక్కుతుందన్నారు. ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధా కృష్ణ మాట్లాడుతూ ఎక్కడకి వెళ్లిన ప్రజల చూపిస్తున్న ఆదరణ కూటమి ప్రభుత్వ పనితీరుకు నిదర్శమన్నారు. గత ఏడాది మే 13న జరిగిన ఎన్నికల్లో 164 స్థానాల్లో గెలిపించిన ప్రజలు కూటమికి అధికారం అప్పజెప్పారని పేర్కొన్నారు. టీడీపీ కుంచు కోట ఇల్లింద్రపర్రు అన్నారు. ముందుగా టీడీపీ క్యాంపు కార్యాలయం వద్ద మంత్రి అనితకు పోలీసులు గౌరవ వందనంతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - May 14 , 2025 | 12:40 AM