Share News

హోంగార్డులకు అండగా ఉంటాం

ABN , Publish Date - Dec 07 , 2025 | 12:02 AM

పోలీసు శాఖ ఆధ్వర్యంలో 63వ హోంగార్డ్స్‌ ఆవిర్భావ దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు.

హోంగార్డులకు అండగా ఉంటాం
హోంగార్డ్స్‌ వ్యవస్థాపక దినోత్సవంలో మాట్లాడుతున్న ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి

ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి

భీమవరం క్రైం, డిసెంబరు 6(ఆంధ్రజ్యోతి): పోలీసు శాఖ ఆధ్వర్యంలో 63వ హోంగార్డ్స్‌ ఆవిర్భావ దినోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి హోంగార్డ్స్‌ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. హోంగార్డుల సంక్షేమానికి జిల్లా పోలీసు శాఖ ప్రాధాన్యం ఇస్తుందని, వారికి అండగా ఉంటుందన్నారు. హోంగార్డ్స్‌ వ్యవస్థ ప్రజలు, పోలీసు బలగాలకు వెన్నెముకగా నిలుస్తోందని కొనియాడారు. శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్‌ నియంత్రణ, విపత్తు నిర్వహణతోపాటు జైళ్లు, అగ్నిమాపక వంటి కీలక విభాగాల్లో హోంగార్డులు నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. వారి ఆరోగ్య పరిరక్షణ, భవిష్యత్‌ భద్రతకు సంబంధించిన పలు కీలక అంశాలపై తక్షణ చర్య లు తీసుకోవాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. ఏఎస్పీ వి.భీమారావు, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ డీఎస్పీ ఎంవీవీ.సత్యనారాయణ, డీఎస్పీలు జి.శ్రీవేద, డి.విశ్వనాథ్‌, హోం గార్డు ఇన్‌చార్జి ఆర్‌ఎస్‌ఐ కె.గోపీకృష్ణ పాల్గొన్నారు.

శాంతిభద్రతలపై ముందస్తు ప్రణాళిక

క్రిస్మస్‌, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల నేపథ్యంలో జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు ముం దస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లాలో శాంతి భద్రతలు, కేసుల పురోగతిపై జిల్లా పోలీసు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో శనివారం నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, పోక్సో, అత్యాచార కేసులు, రోడ్డు ప్రమాదాల కేసుల దర్యాప్తు తీరుతెన్నులపై పోలీస్‌ స్టేషన్ల వారీగా సమీక్షించారు. పెండింగ్‌ కేసుల సంఖ్యను తగ్గించాలని, నాణ్యమైన చార్జిషీట్లు దాఖలు చేసి నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ తెలిపారు. పోలీస్‌ స్టేషన్ల వారీగా కేసుల సంఖ్య, అరెస్టుల వివరాలు, చార్జిషీట్లు దాఖలు చేసిన స్థితి, దర్యాప్తు ఆలస్యానికి గల కారణాలపై నివేదికలు కోరారు. కేసుల ఛేదన, నేర నియంత్రణకు దోహదపడే పలు సూచనలు, మెలకువలను అధికారులకు దిశా నిర్దేశం చేశారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా బ్లాక్‌ స్పాట్లను గుర్తించి, ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.

Updated Date - Dec 07 , 2025 | 12:02 AM