Share News

గురువా.. తీరు మారాలి!

ABN , Publish Date - Dec 20 , 2025 | 12:33 AM

కొందరు టీచర్లు సమయానికి విధులకు హాజరుకావడం లేదు.. పిల్లలను అకారణంగా కొడుతున్నారు..ఇంకొందరైతే ఫ్రంట్‌ బెంచ్‌ విద్యార్థులపైనే శ్రద్ధ కనబరుస్తున్నారు..

గురువా.. తీరు మారాలి!

హైస్కూళ్లలో క్షేత్రస్థాయి పరిస్థితులపై థర్డ్‌పార్టీ ఏజన్సీతో సోషల్‌ ఆడిట్‌

కొందరు టీచర్ల వ్యవహార శైలిపై విస్మయం

ఏలూరు అర్బన్‌, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): కొందరు టీచర్లు సమయానికి విధులకు హాజరుకావడం లేదు.. పిల్లలను అకారణంగా కొడుతున్నారు..ఇంకొందరైతే ఫ్రంట్‌ బెంచ్‌ విద్యార్థులపైనే శ్రద్ధ కనబరుస్తున్నారు.. గుడ్‌ టచ్‌– బ్యాడ్‌ టచ్‌ల గురించి బాలికలను చైతన్యపర్చడం లేదు.. జిల్లాలోని పలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో వెలుగు చూసిన వాస్తవాలివి.

జిల్లాలోని ప్రభుత్వ హైస్కూళ్లలో పదిశాతం పాఠ శాలల్లో కొద్దిరోజులుగా ప్రభుత్వం నియమించిన థర్డ్‌పార్టీ ఏజన్సీ ఎస్‌ఎస్‌ఏఏటీ (స్టాండ్స్‌ ఫర్‌ ది సొసైటీ ఫర్‌ సోషల్‌ ఆడిట్‌, అక్కౌంటబిలిటీ అండ్‌ ట్రాన్సపరెన్సీ) సంస్థ నిర్వ హించిన క్షేత్రస్థాయి పరిశీలనలో కొన్ని ఉన్నత పాఠశాలల్లో గమనించిన అవాంఛనీయ పరిణామాలపై బుధవారం ఏలూరు సుబ్బమ్మదేవి మున్సిపల్‌ హైస్కూలులో జరిగిన సమీక్షంలో చర్చించారు. ఈ సమావేశానికి సంబంధిత సోషల్‌ ఆడిట్‌ జరిగిన హైస్కూళ్ల ప్రధానోపాధ్యాయులను పిలిపించి, వారి ఎదుటే ఎస్‌ఎస్‌ఏఏటీ సమర్పించిన నివేది కలను హెచ్‌ఎంలకు వివరించి పరిస్థితులను చక్కదిద్దాలని ఆదేశించారు. ఈ సమీక్ష వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని మొత్తం హై స్కూళ్లలో పదిశాతం చొప్పున ఉన్నత పాఠశాలల్లో సోషల్‌ ఆడిట్‌ను ప్రభుత్వం జరిపించిందని, ఈ క్రమంలోనే జిల్లా లో 36 ఉన్నత పాఠశాలల్లో సోషల్‌ ఆడిట్‌ను నిర్వహించిన థర్డ్‌పార్టీ ఏజన్సీ హైస్కూళ్ల వారీగా గమనించిన విషయా లను నివేదికల రూపంలో విద్యాశాఖకు అందజేసింది. మధ్యాహ్న భోజన పథకం అమలు, ఆహార పదార్థాల నాణ్యత, బాలికల వాష్‌రూమ్‌లు, పరిశుభ్రత, గుడ్‌టచ్‌– బ్యాడ్‌టచ్‌, ఉపాధ్యాయుల సమయపాలన, ప్రవర్తన, స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ కమిటీ (ఎస్‌ఎంసీ)లు, పూర్వ విద్యా ర్థులు, తల్లిదండ్రులతో సత్సంబంధాలు, పరీక్షల నిర్వహణ, తరగతిగది వాతావరణం, విద్యార్థినులకు శానిటరీ నాప్కిన్స్‌ అందజేత, తాగునీరు, తదితర అంశాలపై స్కూ లులోనే థర్డ్‌పార్టీ ఏజన్సీ ప్రతినిధులు, సమగ్రశిక్ష/ విద్యాశాఖ సీఆర్పీలతో సోషల్‌ ఆడిట్‌ నిర్వహించారు.

సోషల్‌ ఆడిట్‌లో వెలుగు చూసిన కొన్ని అంశాలు..

ఏలూరు టూటౌన్‌లోని ఓ హైస్కూలులో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా అందజేసే చిక్కీలు కాలపరిమితి ముగిసినా ఎక్స్‌పైరీ అయినవాటి ని బాలబాలికలకు అందజేస్తున్నారు. ప్రభుత్వం సరఫ రా చేసిన చిక్కీలను ఎప్పటికప్పుడు వినియోగించ కుండా స్కూలు స్టాక్‌/స్టోర్‌ రూమ్‌లో ఉంచుతున్నారు.

పోలవరంలోని ఓ స్కూలులో తరగతికి 30 మంది విద్యార్థులు హాజరైనట్టు నమోదు చేయగా వాస్తవంగా అక్కడ 23 మందే భౌతికంగా ఉన్నారు. హెచ్‌ఎంను వివరణ కోరితే సమాధానం లేదు.

ఏలూరు వన్‌టౌన్‌లోని ఓ ఉన్నత పాఠశాలలో వ్యాయా మోపాధ్యాయుడు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తు న్నారు. స్కూలు ప్రాంగణంలోనే ధూమపానం చేస్తున్నాడు. ఇదే స్కూలులో సోషల్‌ సబ్జెక్టు బోధించే టీచరు తరగతి గదిలో ముందుబెంచీలో కూర్చున్న విద్యార్థులకే ప్రత్యేకంగా బోధిస్తూ, మిగతా వారిని నిర్లక్ష్యం చేస్తున్నారు. సామాజిక వర్గాలుగా బాల బాలికలను విడదీసి వివక్ష చూపిస్తున్నారు. ఈ విషయాలను హెచ్‌ఎం దృష్టికి సమావేశంలో అధికారులు తీసుకెళ్లగా ఇకమీదట అలా జరగకుండా చూస్తానని హెచ్‌ఎం వివరణ ఇచ్చినట్టు తెలిసింది.

చింతలపూడిలోని ఓ హైస్కూలులో హెచ్‌ఎం సహా టీచర్లు సకాలానికి విధులకు హాజరు కావడం లేదు. బోధన లేకుండా నోట్సులను రాసుకోమని విద్యార్థులకు సలహాలిస్తున్నారు. స్కూలులో రికార్డులేవీ సరిగా నిర్వహించడం లేదు. సకాలానికి హాజరు కాకపోవడంపై ఏలూరులో బుధవారం నిర్వహించిన సమావేశానికి హాజరై వివరణ ఇవ్వాలని సమగ్రశిక్ష అధికారులు హెచ్‌ఎంను ఆదేశించగా, ఉదయం 11 గంటల తర్వాత హాజరు కావడం అందరినీ విస్మయానికి గురిచేసింది.

Updated Date - Dec 20 , 2025 | 12:33 AM