ముంచేసింది
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:31 AM
జిల్లావ్యాప్తంగా ఎడతెరపిలేని వర్షాలతో జనజీవనం స్తంభించింది. పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం
పల్లపు ప్రాంతాలు జలమయం
వరి, ఇతర పంటలకు నష్టం
కొల్లేరుకు వరద పోటు
జిల్లావ్యాప్తంగా ఎడతెరపిలేని వర్షాలతో జనజీవనం స్తంభించింది. పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు చోట్ల కోత దశలో ఉన్న వరి నేలకొరిగింది. ఇతర పత్తి, పొగాకు పంటలకు నష్టం వాటిల్లింది. రహదారులు ధ్వంసమై గోతుల్లో వర్షపు నీరు చేరి వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. కొల్లేరు వరద ఉధృతితో లంక గ్రామాలకు ముంపు ముప్పు పొంచి ఉంది.
ఏలూరు సిటీ, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి తీరం దాటినా శుక్రవా రం మరో అల్పపీడనం ఏర్పడడంతో జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. పాటు పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి. జిల్లాలో వరితోపాటు ఇతర పంటలు దెబ్బతిన్నాయి. గడచిన 24 గంటల్లో జిల్లాలో అత్యధికంగా ముదినేపల్లి మండలంలో 71.4 మి.మీ., జిల్లాలో సరాసరి 29.2 మి.మీ. వర్షపాతం నమోదైంది.
నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు
కైకలూరు/మండవల్లి/దెందులూరు, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలకు కైకలూరు మండలంలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు భారీ వర్షంతో జన జీవనం స్తంభించింది. కైకలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ముందు జాతీయ రహ దారిపై గోతుల్లో నీరు నిలిచింది. వరహాపట్నం–సీత నపల్లి రహదారి కాలువను తలపిస్తోంది. గోపవరం, రాచపట్నం తదితర గ్రామాల్లోని పంట పొలాల్లోకి భారీగా వర్షపునీరు చేరింది. ఎగువ నుంచి భారీగా నీరు చేరడంతో కొల్లేరు ఉధృతి పెరిగి పెద్దఎడ్లగాడి – పెనుమాకలంక రహదారి పూర్తిగా నీటమునిగింది. రోడ్డుపై మూడు అడుగుల మేర నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిపివేశారు. పెనుమాకలంక, ఇంగి లిపాకలంక, నందిగామలంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లంక గ్రామాల చుట్టూ నీరు పెద్దఎత్తున చేరుకుంది. ఆటపాక పక్షుల కేంద్రం వద్ద పోల్‌రాజ్ డ్రెయిన్ ఉధృతంగా ప్రవహిస్తూ కొల్లేరులో భారీఎత్తున నీరు చేరుతుంది.
ఉధృతంగా గుండేరు వాగు
దెందులూరు మండలంలో గుండేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. సత్యనారాయణపురం వద్ద డ్రెయిన్ ఉధృతితో గ్రామంలోకి రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామస్తులు డ్రెయిన్ దాటకుండా వీఆర్వో లు చర్యలు తీసుకున్నారు.
1987 ఎకరాల్లో వరి పంట మునక
జిల్లాలో భారీ వర్షాలతో 1987 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. కైకలూరు, పోలవరం, కలిదిండి, ఏలూరు, లింగపాలెం, భీమడోలు, ముదినేపల్లి, పెదపాడు, కామవరపుకోట మండలాల్లో మొత్తం 69,891 ఎకరాల్లో వరి పంట సాగు చేయగా 31గ్రామాల్లో 1987 ఎకరాల్లో వరి పంట మునిగింది. ఉద్యాన పంటలు, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది.