కుండపోత
ABN , Publish Date - Oct 24 , 2025 | 12:45 AM
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి.
ఈదురుగాలులతో కూడిన వర్షాలు
స్తంభించిన జనజీవనం
పల్లపు ప్రాంతాలు జలమయం
విద్యుత్ శాఖ కంట్రోల్ రూమ్స్
పోలీస్ శాఖ ముందస్తు చర్యలు
ఏలూరు సిటీ, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో గురు వారం ఉదయం నుంచి ఎడతెరపి లేని భారీ వర్షాలతో జనజీవనం స్థంభించింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలతో పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
కూలిన పెంకుటిల్లు
కొయ్యలగూడెం/ముదినేపల్లి/జీలుగుమిల్లి, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): కొయ్యలగూడెం మండలం కన్నాయిగూడెం లో అధిక వర్షాలతో ఒక ఇల్లు నేలకూలింది. కోడే పాపమ్మ కుమారుడు రాంబాబు పెంకు టిల్లు పైకప్పు ఒక్కసారిగా కూలి పెంకులు పడి రాంబాబుకు స్వల్పగాయమైంది. సుమారు రూ.లక్షకు పైగా ఆస్తినష్టం సంభవించినట్లు తహసీల్దార్ నాగరాజు తెలిపారు.
అప్పారావుపేట పాఠశాల సెలవు
ముదినేపల్లి మండలంలోని అప్పారావుపేట ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు కూర్చునే అవకాశం లేకుండాపోయింది. భవన శ్లాబు నుంచి వర్షం కారుతుండడంతో తరగతి గదుల్లో నీరు నిలిచింది. సమస్యను ఎంఈవో కె.నరేష్ కుమార్‌కు హెచ్‌ఎం సల్మా వివరించడంతో గురువారం పాఠశాలకు సెలవు ప్రకటించారు.
పంటలకు నష్టం
జీలుగుమిల్లి మండ లంలో భారీ వర్షంతో పొగాకు, మిర్చి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మెట్టప్రాంతంలో పొగాకు నారుమడులు దెబ్బతిన్నాయి. వర్షాల కు మాగుడు తెగులు ఆశిస్తుందని, కోతకు వరి నేలకొరిగిందని వాపోతున్నారు.
విద్యుత్ శాఖ కంట్రోల్ రూమ్
జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు ఎస్‌ఈ పి.సాల్మన్‌రాజు తెలిపారు. ఏలూరు సర్కిల్ కార్యాలయంలో 94409 02926 నంబర్, జంగారెడ్డిగూడెం డివిజన్ కార్యాలయంలో 9491030712 నంబర్‌తో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశామన్నారు. 24 గంటలు పనిచేస్తాయన్నారు. భారీ వర్షాలు, వరదలతో విద్యుత్ సమస్యలపై కంట్రోల్ రూమ్స్‌లో ఎక్కడైనా ఫిర్యాదు చేస్తే తక్షణ చర్యలు తీసుకుంటామన్నారు.
పోలీస్ శాఖ అప్రమత్తం
జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఎస్పీ కేపీఎస్.కిశోర్ ఆదేశాలతో జిల్లాలోని లోతట్టు ప్రాంత ప్రజలకు ఇబ్బంది కలగకుండా రక్షణ చర్యలు చేపట్టారు. కాలువలు, వాగులు, నదులు, చెరువుల మీదుగా నీటి మార్గాలను దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. పలు జలాశయాల్లో నీటి ప్రవాహ వివరాలను తెలుసుకుని అనుగుణంగా పోలీసులు రక్షణ చర్యలు చేపడుతున్నారు.
పెరుగుతున్న కొల్లేరు
అల్పపీడన ప్రభావంతో ఎగువ నుంచి భారీగా వరద నీరు కొల్లేరు సరస్సులో చేరుతోంది. మండవల్లి మండ లం పెద్దఎడ్లగాడి–పెనుమాకలంక రహదారిపై గురువా రం రెండు అడుగుల మేర నీరు ప్రవహిస్తుండడంతో ద్విచక్ర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాల హెచ్చరికతో కొల్లేరు లంక గ్రామాలకు ముంపు పొంచి ఉంది. భారీవర్షానికి ఎగువ నుంచి కొట్టుకొచ్చిన గుర్రపుడెక్క వంతెన కానాల వద్ద పేరుకుపోయింది. నీటి ప్రవాహానికి అవరోధంగా మారడంతో పెనుమాకలంక, ఇంగిలిపాక లంక, నందిగా మ లంక ముంపుబారిన పడతాయని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.