Share News

జిల్లాలో వర్షం జోరు

ABN , Publish Date - Aug 18 , 2025 | 01:05 AM

బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. జిల్లాలో ఆది వారం మోస్తరు వర్షం, అక్కడక్కడా భారీ వర్షం కురిసింది.

జిల్లాలో వర్షం జోరు
ద్వారకాతిరుమల ఆలయం వద్ద వర్షం జోరు

ఏలూరు సిటీ, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. జిల్లాలో ఆది వారం మోస్తరు వర్షం, అక్కడక్కడా భారీ వర్షం కురిసింది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా కుక్కునూరు మండలంలో 32.4 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. వేలేరుపాడులో 12, దెందులూరులో 5.2, పోలవరంలో 3.6, ఆగిరిపల్లిలో 2.8 మి.మీ. వర్షపాతం నమోదైంది.

పోలవరంలో..

పోలవరం: అల్పపీడన ప్రభావంతో మూడు రోజులు గా పోలవరంలో నిరంతరాయంగా వర్షం కురుస్తూనే ఉంది. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎడతెరపి లేని వర్షంతో వీధులు జలమయం అయ్యా యి. గూటాల, పట్టిసీమ, కొత్తపట్టిసీమ, పోలవరం గ్రా మాలలో ఏటిగట్టుకు దిగువన నివాసాలు జలమయం అయ్యాయి. పట్టిసీమ వీరభద్రపురం సంచార జాతుల కాలనీలలో నీరుచేరి స్థానికులు ఇబ్బందులు పడ్డారు.

కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌

ఏలూరు సిటీ: పెరుగుతున్న గోదావరి వరద ఉధృతి కారణంగా అధికార యంత్రాంగం అత్యంత అప్రమత్తం గా ఉండాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి సూచించారు. ప్రజలు నదిలో ఈతకు వెళ్లడం, చేపల పట్టడం చేయరాదని హె చ్చరించారు. అత్యవసర సమయంలో మోటార్‌ బోట్లు, గజ ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు. గోదావరి వరద నేపథ్యంలో కలెక్టరేట్‌లో 1800–233–1077, 94910 41419 ఫోన్‌ నెంబర్లతో ప్రత్యేక కంట్రోలు రూమ్‌ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎంపీ

వర్షాలు, గోదావరి, కొల్లేరు వరద ఉధృతి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీ పుట్టా మహేశ్‌ కుమార్‌ సూచించారు. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అగ్నిమాపక, రెవెన్యూ, పోలీస్‌, వైద్యశాఖ, విద్యుత్‌ శాఖల అధికారులను సమన్వయం చేస్తూ అత్యవసర సహాయక చర్యలు వేగవంతం చేయాలన్నారు. ప్రజలు అత్యవసర పరిస్థితులను అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.

నేడు పీజీఆర్‌ఎస్‌ రద్దు

ఏలూరు: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలో ఈ నెల 18న సోమవారం ప్రజా పిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్‌) రద్దు చేశారు. ప్రజలు గమనించాలని జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - Aug 18 , 2025 | 01:05 AM