ముంచేసింది
ABN , Publish Date - May 05 , 2025 | 12:25 AM
అకస్మాత్తుగా కురిసిన అకాల వర్షం రైతులను ముంచేసింది. జిల్లాలో వరి మాసూళ్లు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో వర్షానికి కల్లాల్లో ధాన్యం, రోడ్డుపై ఉన్న రాశులు, బస్తాల్లో నింపిన ధాన్యం తడిచిపోయింది.
కల్లాల్లో 1.50 లక్షల టన్నుల ధాన్యం
తడిచిన ధాన్యం రాశులు, బస్తాలు
నేలనంటిన వరి, నేలరాలిన మామిడి
విరిగిపడిన విద్యుత్ స్తంభాలు, తెగిన వైర్లు
పల్లపు ప్రాంతాలు జలమయం
చేలల్లో నిలిచిన వర్షపు నీరు
అకస్మాత్తుగా కురిసిన అకాల వర్షం రైతులను ముంచేసింది. జిల్లాలో వరి మాసూళ్లు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో వర్షానికి కల్లాల్లో ధాన్యం, రోడ్డుపై ఉన్న రాశులు, బస్తాల్లో నింపిన ధాన్యం తడిచిపోయింది. వర్షానికి తోడు ఈదురు గాలుల ధాటికి కోతకు సిద్ధంగా ఉన్న చేలు నేలనంటాయి. మామిడి కాయలు నేల రాలాయి. చెట్లు నేలకొరిగాయి. జిల్లాలో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. వైర్లు తెగిపోవడంతో సరఫరా నిలిచిపోయింది. తీర ప్రాంతంలో ఉప్పు మడులు, రాశులు కరిగిపోయాయి. జిల్లాలో పలు పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. తణుకు మండలం వేల్పూరులో ఇల్లు కూలింది.
భీమవరం రూరల్, మే 4 (ఆంధ్రజ్యోతి): అకాల వర్షం రైతులకు శాపంగా మారింది. పంట చేతికందే సమయంలో ముం చేసింది. ఆదివారం తెల్లవారుజామున మూడు గంటలకు పైగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షంతో వరికి నష్టం వాటిల్లిం ది. ముమ్మరంగా మాసూలు జరుగుతున్న సమయంలో భారీ వర్షంతో ధాన్యం రాశులు తడిచిపోయాయి. చేలల్లో వర్షపు నీరు భారీగా చేరింది. దీంతో రైతులు రాశులు మార్పు చేసుకునేందుకు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. జిల్లాలో 2.15 లక్షల ఎకరాల్లో దాళ్వా సాగు చేయగా, ఇంకా 50 వేల ఎకరాల్లో మాసూలు చేయాల్సి ఉంది. వారం రోజులుగా మాసూలైన 1.50 లక్షల టన్నుల ధాన్యం రాశులుగా రహదారులు, కల్లాల్లో ఉండిపో యింది. భీమవరం, వీరవాసరం, పాలకోడేరు, నరసాపురం, పెనుమంట్ర, ఆచంట, కాళ్ళ తదితర మండలాల్లో రైతులకు భారీ నష్టం వాటిల్లింది. ధాన్యం రాశులు, బస్తాలు సైతం తడిచి పోయాయి. ధాన్యం రంగు మారడం, మొలకలతో నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. చేలల్లో నీరు నిలిచిపోవ డంతో వారం రోజులపాటు పంట మాసూలుకు అవకాశం ఉండదిన రైతులు వాపోతున్నారు.
లక్ష టన్నుల అదనపు కొనుగోలు
దాళ్వా సీజన్‌లో వరి దిగుబడి పెరుగుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. జిల్లాలో 6 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటికే 4.58 లక్షల టన్నులు కొనుగోలు చేశారు. ఇంకా 1.5 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా రైతుల వద్ద అదనంగా ఇంకో లక్ష టన్నులు ఉంటుంది. లక్ష టన్నులు అదనంగా కొనుగోలుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు జిల్లా వ్యవసాయ యంత్రాంగం తెలిపారు.
తడిచి ముద్దయిన ధాన్యం రాశులు
ఆచంట: మండలంలో వారం రోజులుగా దాళ్వా మాసూళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆదివారం ఒక్కసారిగా ఈదురు గాలులతో సుమారు 3 గంటలు పాటు కురిసిన వర్షానికి కల్లాల్లో ధాన్యం రాశులు తడిచి ముద్దయ్యాయి. ఎ.వేమవరంలో ధాన్యం రాశులు నీట మునిగడంతో కల్లాల్లో నీటిని బయటకు తోడడానికి రైతులు అవస్థలు పడ్డారు. పలు గ్రామాల్లో రోడ్లపై ధాన్యం బస్తాలు తడిచిపోయాయి. సుమారు 520 ఎకరాల్లో వరి చేలు పాక్షికంగా నేల కొరిగాయి. కట్టలుగా కట్టుకోవాలని ఏవో నాగరాజు సూచించారు.
యలమంచిలి: మండలంలో వర్షం జోరుకు వరి కుప్పలు తడిచిపోయాయి. ఈదురు గాలులకు సుమారు 250 ఎకరాల వరి నేలకొరిగింది. గాలి ఉధృతికి పలుచోట్లు చెట్లు పడిపో యాయి. కాజ వద్ద కొబ్బరిచెట్టు విద్యుత్ తీగలపై పడిపోయింది.
నేలరాలిన మామిడి కాయలు
మొగల్తూరు: ఈదురు గాలులు, వర్షంతో తీర ప్రాంత రైతులు తీవ్రంగా నష్టపోయారు. పశ్చిమ తీరంలో ఆలస్యంగా చేతికి వచ్చే మామిడి ఫలసాయం కొట్టుకుపోయింది. మొగల్తూరు మండలంలో సుమారు 980 ఎకరాల్లోరి మామిడితోటల్లో ప్రతీ చెట్టు నుంచి 50 నుండి 200 కాయలు రాలిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. రాలిన కాయలను కిలోల లెక్కన అయినకాడికి అమ్ముకోవల్సి వస్తుందని, కూలీ ఖర్చులు కూడా వచ్చే పరిస్ధితి లేదని రైతులు వాపోతున్నారు. దర్భరేవు డ్రెయిన్ ఆటుపోటుల ప్రభావంతో ముంపుకు గురవుతున్న రామన్నపాలెం అడవిపర్రలో సుమారు 300 ఎకరాల్లో రైతులు వ్యయప్రయాసలతో దాళ్వా సాగు చేశారు. కోతకు వచ్చిన చేలు నేలకొరిగి వరి కంకులు నీటిలో నానిపోతున్నాయి. కనీసం కోత, మాసూళ్ల ఖర్చులు కూడా వచ్చే పరిస్ధితి లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. మొగల్తూరు పాతకాలువ సెంటర్, పేరుపాలెం, కాళీపట్నం గ్రామాల్లో చెట్లు నేలకొరిగాయి.
విద్యుత్ శాఖకు రూ.2 కోట్ల నష్టం
భీమవరం టౌన్: జిల్లాలో పలు ప్రాంతాల్లో చెట్లు కూలడంతో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ట్రాన్స్‌ఫార్మర్లు పడిపోయి, వైర్లు తెగిపడి సరఫరా నిలిచిపోయింది. జిల్లాలోని 94 సబ్ స్టేషన్ల పరిధిలో సుమారు 200 స్తంభాలు పడిపోయినట్లు అధికారులు గుర్తించారు. పదుల సంఖ్యలో ట్రాన్స్‌ఫార్మర్లు, వైర్లు తెగిపోవడం తో సుమారు రూ.2 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారుల అంచనా. కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటుచేసి తెగిపడిన వైర్లు సరిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణాల్లో సరఫరా నిలిచిపోవడంతో పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. సాయంత్రానికి పట్టణాల్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. విద్యుత్ శాఖ ఎస్‌ఈ ఆలపాటి రఘునాథబాబు జిల్లాలో పర్యటించారు. అన్ని ప్రాంతాలకు సరఫరా అందించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
లక్ష్యానికి మించి ధాన్యం కొనుగోలు : నిమ్మల
రైతు వద్ద ధాన్యం పూర్తిగా కొనుగోలు చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు భరోసా ఇచ్చారు. నిర్దేశిత లక్ష్యం మేరకు కొనుగోలు పూర్తయినా ఇంకా కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. తమది రైతు మేలు ప్రభుత్వమని, ఎప్పుడూ రైతుకు అండగా ఉంటామన్నారు. రైతులు నచ్చిన మిల్లుకు ధాన్యం అమ్ము కోవడానికి పూర్తిస్వేచ్ఛ ఇచ్చి 48 గంటల్లోనే సొమ్ము రైతుల ఖాతాలకు జమ చేస్తున్నామన్నారు.
ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు : జేసీ
తడిచిన ధాన్యాన్ని కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆచంట మండ లంలో తడిచిన ధాన్యం రాశులు, బస్తాలను జేసీ, ఆర్డీవో దాసి రాజు పరిశీలించారు. తడిచిన ధాన్యం రైస్ మిల్లుకు పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, రైతులు ఆందోళన చెందవద్దన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ కనకరాజు, ఏవో బి. నాగరాజు, రైతులు పాల్గొన్నారు.
30 లక్షల గోనె సంచులు సిద్ధం : జేడీ
ధాన్యం కొనుగోలులో రెండు, మూడు రోజులుగా సంచుల కొరత ఏర్పడినట్లు రైతులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారీ వర్షంతో అత్యవసరంగా 30 లక్షల గోనె సంచులను అందించే ఏర్పాట్లు చేసినట్లు వ్యవసాయ శాఖ జెడి జడ్డు వెంకటేశ్వర్లు తెలిపారు. ఇప్పటివరకు కోటీ 20 లక్షల గోనె సంచులు రైతులకు అందించామన్నారు.