Share News

చేను.. చెరువు!

ABN , Publish Date - Aug 15 , 2025 | 12:30 AM

జిల్లాలో బుధవారం కురిసిన భారీ వర్షానికి 15 మండ లాల్లో వరి చేలు దెబ్బతిన్నాయి.

చేను.. చెరువు!
పెనుగొండ మండలం మునమర్రులో పంట కాలువ పొంగి చేలోకి వెళుతున్న నీరు

15 మండలాల్లో వరి చేలు మునక

ఒక్కరోజు వర్షంతో రైతు కుదేలు

వాతావరణం పొడిగా ఉంటేనే ఊరట

బిక్కుబిక్కుమంటున్న అన్నదాత

రోజుల తరబడి వర్షం కోసం అంతా ఎదురుచూశారు. ఒకవైపు వేడి.. మరోవైపు ఉక్కపోతతో జిల్లా ప్రజలు అల్లాడిపోయారు. చినుకు కోసం తహతహలాడారు. కానీ ఒకేరోజు గంటల పాటు కురిసిన వర్షం రైతులను అతలాకుతలం చేసింది.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

జిల్లాలో బుధవారం కురిసిన భారీ వర్షానికి 15 మండ లాల్లో వరి చేలు దెబ్బతిన్నాయి. దాదాపు 21వేల ఎకరాల్లో చేలు నీట మునిగాయి. పెంటపాడు మండలం పరిమళ్ల, యానాలపల్లి, తణుకు రూరల్‌ మండలం, ఇరగవరం, ఆచంట, యలమంచిలి తదితర మండలాల్లో వరి చేలు చెరువులను తలపిస్తున్నాయి. వాతావరణం పొడిగా ఉందని రైతులు ఎరువులు కూడా వేశారు. తొలి విడత ఎరువులు వేసిన రైతులు వర్షం కోసం ఎదురు చూశారు. ఆచంట, పోడూరు, యలమంచిలి మండలాల్లో ఇంకా నారుమడులు ఉన్నాయి. శివారు ప్రాంతాలకు సాగునీరు అందడంలేదని రైతులు వర్షం కోసం ఎదురుచూశారు. రెండు గంటలపాటు కురిసిన కుంభవృష్టితో అన్నదాత ఆశలు తల్లకిందులయ్యాయి. వేల ఎకరాల్లో చేలు నీట మునిగాయి. గురువారం వాతావరణం పొడిగా ఉండడం తో రైతులు కాస్త కుదుటపడ్డారు. రానున్న మూడు రోజులు జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గురువారం విద్యా సంస్థలకు సెలవు కూడా ప్రకటించారు. కానీ వాతావరణం పొడిబారింది. ఎండ కాయడంతో చేలలో నిలిచిన నీరు బయటకు వెళుతోంది. వాతావరణం పొడిగా ఉంటే రైతులకు నష్టం ఉండదని వ్యవసాయ శాఖ అంచనా.. రైతులు కూడా అదే ఆశిస్తున్నారు. లేదంటే పంట దెబ్బతింటుందని ఆందోళన చెందుతున్నారు.

జిల్లాలో 90 మి.మీ వర్షపాతం

భీమవరం టౌన్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణితో భారీ వర్షం కురిసినా గురువారం వాతావరణం పొడిగా ఉంది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు కుండపోతంతో పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జిల్లాలో సగటున 90 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తణుకులో అత్యధికంగా 236.6 మి.మీ., మొగల్తూరులో అత్యల్పం 8.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. తాడేపల్లిగూడెంలో 16.2. మి.మీ, పెంటపాడు 189, అత్తిలి 85.4, గణపవరం 144.4 ఆకివీడు 77.2, ఉండి 54.4, పాలకోడేరు 76.2 పె నుమంట్ర 75.2, ఇరగవరం 196.6 పెనుగొండ 193.8, ఆ చంట 40.2, పోడూరు 82.6, వీరవాసరం 22.2, భీమవరం 27.6, కాళ్ల 42.6 నరసాపురం 32.4, పాలకొల్లు 35.2, యలమంచిలిలో 17.4మి.మీ వర్షపాతం నమోదైంది.

నీట మునిగిన చేలను పరిశీలించిన కలెక్టర్‌

అత్తిలి: మండలంలోని తిరుపతిపురం, వరిఘేడు గ్రామాల్లో భారీ వర్షాలకు నీట మునిగిన చేలను కలెక్టర్‌ నాగరాణి గురువారం పరిశీలించారు. స్థానిక రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం వర్షం తగ్గడంతో నీరు తొల గిపోతే పంటకు ఎలాంటి నష్టం ఉండదని కలెక్టర్‌ అన్నా రు. మండలంలో సుమారు 400 నుంచి 500 ఎకరాలు ముంపునకు గురైనట్లు అధికారులు అంచనా వేశారు.

Updated Date - Aug 15 , 2025 | 12:30 AM