Share News

కుండపోత

ABN , Publish Date - Sep 14 , 2025 | 12:41 AM

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాకు ఆనుకుని పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో శుక్ర వారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. దీనిపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ కారణంగా జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి.

కుండపోత
గుబ్బల మంగమ్మ ఆలయం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న వాగు

ఏజెన్సీలో పొంగిన వాగులు

గుబ్బల మంగమ్మతల్లి ఆలయం వద్ద చిక్కుకున్న భక్తులు

తమ్మిలేరు, ఎర్రకాలువకు వరదపోటు

పెరుగుతున్న గోదావరి.. భయపెడుతున్న పెదవాగు

నిండిన చెరువులు.. మెట్ట రైతుల్లో హర్షం

ఏలూరుసిటీ/బుట్టాయగూడెం/పోలవరం/లింగపాలెం/చింతలపూడి/ముసునూరు/కామవరపుకోట/పెదపాడు/ఆగిరిపల్లి/పెదవేగి,సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాకు ఆనుకుని పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో శుక్ర వారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. దీనిపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ కారణంగా జిల్లాలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. జనజీవనం స్థంభించింది. రానున్న రెండు రోజుల్లో కోస్తా జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏలూరు నగరంలో శనివారం కుండపోతగా కురిసిన వర్షంతో పవర్‌పేట ప్రాంతంలో రోడ్లపై ఉధృతంగా నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు మెట్ట ప్రాంతాల్లోని చెరువుల్లో నీరు చేరడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఏజెన్సీ అటవీ ప్రాంతంలోని కొండవాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. బుట్టాయగూడెం మండలం కామవరంలో వర్షపునీరు ఇళ్లలోకి చేరింది. గుబ్బల మంగమ్మతల్లి ఆలయం వద్ద ఉన్న ఎదురెక్కుడు కొండవాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. అమ్మవారి దర్శనానికి వెళ్లిన భక్తులు, వ్యాపారులు వాగుకు అవతలి వైపునే చిక్కుకు పోయారు. వారిని తీసుకు రావడానికి ఆలయ కమిటీవారు ఏర్పాట్లు చేస్తున్నారు. రెడ్డిగణపవరం జల్లేరు కొండవాగు, వీరన్నపాలెం కొండవాగు, విప్పలపాడు వద్ద కొండవాగు, బైనేరు వాగు, కెఆర్‌ పురం తూర్పు కాలువ వాగు పొంగి ప్రవహిస్తున్నాయి. పోలవరం మండలంలో జిల్లేళ్లగూడెం, గుంజవరం, కొవ్వాడ కాలువ కొండవాగులు పొంగి ప్రవహించాయి. కొండ వాగుల జలాలు కొవ్వాడ కాలువ అవుట్‌ ఫాల్‌ స్లూయిజ్‌ 23 గేట్ల నుంచి గోదావరిలోకి ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. పోలవరం మెయిన్‌ బజార్‌లో వర్షపునీరు నిలిచింది. లింగపాలెం, చింత లపూడి, ముసునూరు/ పెదపాడు మండలాల్లో లోత ట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కామవరపు కోట మండలం తడికలపూడి నుంచి ఆడమిల్లికి వెళ్లే రహదారిలో చెట్లు విరిగి రోడ్ల మీద పడడంతో రాకపోకలకు విఘాతం ఏర్పడింది. తడికల పూడి సొసైటీ చైర్మన్‌ తూతా బాలాజీకుమార్‌ కార్యకర్తలను సమీకరించి రోడ్లపై పడిన చెట్లను తొలగించే చర్యలు చేపట్టారు. ఆగిరిపల్లి–నూగొండపల్లి మధ్యగల కుంపెనీ వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఆగిరిపల్లి నుంచి నూగొండపల్లి, పిన్నమరెడ్డిపల్లి, రాజ వరం, ఎస్‌ఏపేట గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. ఆగిరిపల్లి– తోటపల్లి మధ్య వాగు నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. పెదవేగి మండలంలో ఉద్యానపంటల్లో వరదనీరు ముంచెత్తి, పంటపొలాలు ఎర్రనీటితో కనిపించాయి.

జలాశయాలకు వరదనీరు

జంగారెడ్డిగూడెం/చింతలపూడి: మండలంలోని శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయంలోకి వరదనీరు చేరుతోంది. శనివారం రాత్రి 9గంటలకు 11,600 క్యూసెక్కుల వరదనీరు జలాశయంలోకి చేరుతుండగా 3,700 క్యూసెక్కుల నీరు దిగువ ప్రాంతాలకు జలాశయం గేట్ల ద్వారా విడుదల చేసినట్టు ఇరిగేషన్‌ డీఈ కె.సునీత తెలిపారు. జలాశయం నీటి సామర్థ్యం 83.50 మీటర్లు కాగా శనివారం రాత్రికి 82.65 మీటర్లు నీరు జలాశయంలో ఉన్నట్టు అధికారులు తెలిపారు. జల్లేరు వాగు ఉధృ తంగా ప్రవహిస్తూ వరద నీరంతా జలాశయంలోకి చేరుతోంది. చింతలపూడి సమీపంలోని తమ్మిలేరు రిజర్వాయర్‌కు ఎగువ నుంచి వరద వచ్చి చేరుతుంది. శనివారం సాయంత్రం ఆరు గంటలకు ఎగువ నుంచి 1400 వందల క్యూసెక్కుల వరదనీరు వస్తుండగా దిగువకు రెండువేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్‌ నీటిమట్టం 348.24 అడుగు లు ఉందని దిగువ ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్ట్‌ ఏఈ లాజర్‌బాబు తెలిపారు.

ఏలూరులో తమ్మిలేరు ఉధృతి

ఏలూరు క్రైం: ఏలూరు నగరంలో శనివారం ఉదయం నుంచి తమ్మిలేరు కొంచెం కొంచెం పెరుగుతూ వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. శనివారపుపేట కాజ్‌వేకు ఆనుకుని ప్రవహించడంతో ముందస్తుగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంకో వైపు కొత్త బస్టాండ్‌ సమీపంలోని లోబ్రిడ్జి (రైలు పట్టాలు కింద) రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. వరద ఉధృతి మరింత పెరిగితే ఆదివారం ఉదయానికి మరోమారు శనివారపుపేట కాజ్‌వేపై నీటి ప్రవాహం ప్రవహించే అవకాశాలు కినిపిస్తున్నాయి.

జూ గత 24 గంటల్లో జిల్లాలోనే అత్యధికంగా ద్వారకాతిరుమల మండ లంలో 76.4 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైంది. జిల్లాలో సరాసరి వర్షపాతం 12.9 మి.మీ నమోదైంది. ఉంగుటూరు 35.4, కొయ్యల గూడెం 34.8, కలిదిండి 32.2, పోలవరం 24, పెదవేగి 22.4, భీమడోలు 16.4, కామవరపుకోట 13.6, జంగారెడ్డిగూడెం 12.4, కుక్కునూరు 12.2, పెదపాడు 11.8, దెందులూరు 9.6, నిడమర్రు 7.8, మండవల్లి 7.6, కైకలూరు 6.2, బుట్టాయిగూడెం 6, చింతలపూడి 5, వేలేరుపాడు 4.6, లింగపాలెం 4.4, ఏలూరు అర్బన్‌ 4.2, ఏలూరు రూరల్‌ 3.6, ఆగిరిపల్లి 3.6, టి.నరసాపురం 2.4, ముదినేపల్లి 1.8, నూజివీడు 1.2 జీలుగుమిల్లి 0.8 మి.మీ వర్షపాతాలు నమోదయ్యాయి.

పెదవాగుకు వరద ముంపు

వేలేరుపాడు/ఏలూరు/ఏలూరుసిటీ :పెద వాగు ప్రాజెక్టు ఎగువ భాగాన, వేలేరుపాడు మండలంలో శనివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షాల కారణంగా పెదవాగుకు వరద పోటెత్తుతోంది. గతేడాది ఇదే తరహాలో పెద వాగు ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో ప్రాజెకు ్టకు గండిపడి భారీగా ఆస్తి నష్టం కలిగించింది. అప్పటి పెదవాగు సృష్టించిన విధ్వంసంతో కకావికలమైన ప్రజలు పూర్తిగా మరచిపోక ముందే మరోసారి పెదవాగు ప్రాజెక్టుకు భారీ గా వరద చేరుకుంటోంది. ప్రాజెక్టు మూడు గేట్లను పూర్తిగా ఎత్తేశారు. మరోవైపు ప్రాజెక్టు దిగువన ఉన్న పదిగ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్‌

పెదవాగు వరద ఉధృతి పెరుగుతున్న నేప థ్యంలో ముంపునకు గురయ్యే దిగువ ప్రాంత ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తర లించాలని అధికారులకు కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి శనివారం ఆదేశాలు జారీచేశారు. కలెక్టర్‌ టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో సమీక్షించారు. పెదవాగు ప్రాజెక్టు నీటిమట్టం 77.43 అడుగుల కు చేరుకుందన్నారు. పెదవాగు రిజర్వాయర్‌ నుంచి ఇప్పటికే 10వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారని, ఆదివారాని కి ఇది మరింత పెరగవచ్చన్నారు.వేలేరుపాడు మండలంలోని కుమ్మరిగూడెం, గొల్లగూడెం, వసంతవాడ, గుండం బోరు, మద్దికొండ, లచ్చి గూడెం, రుద్రంకోట, అల్లూరి నగరం, కోయ మాదారం, రామవరం, గొల్లవాయి, రెడ్డిగూడెం, బండ్లపూర్‌, భూదేవి పేట, శివకాశీపురం , వేలేరుపాడు మొత్తం 17 నివాసిత ప్రాంతాలకు వరద రావచ్చని, ఆయా ప్రాంత ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు తరలి రావాలని కోరారు.

కంట్రోల్‌రూమ్స్‌ ఏర్పాటు

ఏలూరు కలెక్టరేట్‌లో 1800–233–1077, 94910 41419, ఫోన్‌ నెంబర్లతో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని కలెక్టర్‌ తెలిపారు. జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయంలో 83092 69056 నెంబర్‌తో, వేలేరుపాడు తహసీల్దార్‌ కార్యాలయంలో 83286 96546 నెంబర్‌తో, కుక్కునూరు తహసీల్దార్‌ కార్యా లయంలో 80962 74662 నంబర్‌తో కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు చేశామన్నారు. బోట్లు , గజ ఈతగాళ్ళను సిద్ధం చేశామని, రాష్ట్ర విపత్తు నివారణ దళంను సిద్ధం చేశామని తెలిపారు.

Updated Date - Sep 14 , 2025 | 12:41 AM