Share News

కుండపోత

ABN , Publish Date - Oct 14 , 2025 | 12:48 AM

బంగాళా ఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాల తిరోగమన ప్రభావంతో జిల్లాలో కుండ పోతగా వర్షం కురిసింది. సోమవారం తెల్లవారు జాము నుంచి ప్రారంభమైన వర్షం సోమవారం మధ్యాహ్నం వరకు ఎడతెరపిలేకుండా కురి సింది.

కుండపోత
నీట మునిగిన ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ఆర్‌ఆర్‌పేటకు వెళ్లే రోడ్డు

భారీ వర్షాలతో స్తంభించిన జనజీవనం

ఏలూరు నగరం జలమయం

కొయ్యలగూడెంలో 8 గంటల్లో 91.4 మి.మీ వర్షపాతం

రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు.. ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ

ఏలూరుసిటీ, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): బంగాళా ఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాల తిరోగమన ప్రభావంతో జిల్లాలో కుండ పోతగా వర్షం కురిసింది. సోమవారం తెల్లవారు జాము నుంచి ప్రారంభమైన వర్షం సోమవారం మధ్యాహ్నం వరకు ఎడతెరపిలేకుండా కురి సింది. జిల్లాలో జనజీవనం స్తంభించింది.

ఏలూరు జలమయం

ఏలూరు నగరంలో పవర్‌పేట రైల్వే స్టేషన్‌వద్ద, శ్రీనివాసా థియేటర్‌ సెంటర్‌లో లోలెవల్‌ బ్రిడ్డి వద్ద వర్షపునీరు ఉధృతంగా ప్రవహించింది. లోలెవల్‌ బ్రిడ్జిని మూసివేయడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. కొత్తపేటలో మురుగుకాలువ నీరు రహ దారులపై ప్రవహించింది. పత్తేబాద రైతుబజారు రోడ్డుపై నీరు ఉధృతంగా ప్రవహించింది. డ్రెయినేజీల నీరు రహదారుల పైకి చేరడంతో ఆయా ప్రాంతాల్లో దుర్గంధం నెలకొని ఉంది.

ఎనిమిది గంటల్లోనే 91.4 మి.మీ వర్షపాతం

గత 24 గంటల్లో (ఆదివారం ఉదయం 8.30 గంటల నుంచి సోమవారం ఉదయం 8.30 గంటల వరకు) జిల్లాలో అత్యఽధికంగా కైకలూరు మండలం లో 87.4 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదు కాగా జిల్లాలో సరాసరి వర్షపాతం 13.9 మి.మీగా నమోదైంది. అయితే సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు దాదాపు 8 గంటల్లోనే జిల్లాలో అత్యధికంగా కొయ్యలగూడెం మండలంలో 91.4 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో సరాసరి వర్షపాతం 33.4 మి.మీ నమోదైంది. లింగపాలెం 81.8, బుట్టాయిగూడెం 67, కలిదిండి 46.2, పెదవేగి 58.8, ఏలూరు రూరల్‌ 44.6, కైకలూరు 41.2, నిడమర్రు 39, ఏలూరు అర్బన్‌ 37.6, చింతలపూడి 31.2 జీలుగుమిల్లి 31, ఉంగుటూరు 29.4, ముదినేపల్లి 34.2, దెందులూరు 39, కామవరపుకోట 30.2, నూజివీడు 26.6, భీమడోలు 23.2, జంగారెడ్డిగూడెం 28.8, ముసునూరు 28.6, వేలేరుపాడు 20, పోలవరం 19.2, చాట్రాయి 17.4, ఆగిరిపల్లి 15.8టి నరసాపురం 14, ద్వారకాతిరుమల 12.8, మండవల్లి 10.4, కుక్కునూరు 9.4, పెదపాడు 7.4 మి.మీ వర్షపాతాలు నమోదయ్యాయి.

ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ

జిల్లాలో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాకు ఆరంజ్‌ అలెర్ట్‌ జారీ చేయడంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు.

Updated Date - Oct 14 , 2025 | 12:48 AM