Share News

అదృశ్యమైన హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి

ABN , Publish Date - Sep 01 , 2025 | 12:49 AM

అదృశ్యమైన ఎస్‌బీ హెడ్‌ కానిస్టేబుల్‌ మృతదేహం ఎర్ర కాలువలో ఆదివారం లభ్యమైంది.

అదృశ్యమైన హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి
కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న ఎస్పీ కిశోర్‌

ఎర్రకాలువలో మృతదేహం లభ్యం

విధుల్లో ఉండగా ద్విచక్ర వాహనంతో గల్లంతు

కుటుంబ సభ్యులకు ఎస్పీ పరామర్శ

జంగారెడ్డిగూడెం, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): అదృశ్యమైన ఎస్‌బీ హెడ్‌ కానిస్టేబుల్‌ మృతదేహం ఎర్ర కాలువలో ఆదివారం లభ్యమైంది. ఆగస్టు 29న రాత్రి నుంచి కనిపించకుండా పోయిన ఎస్బీ హెడ్‌ కానిస్టేబుల్‌ బుడుపుల సుబ్బారావు (55) మృతి చెందారు. జంగారెడ్డిగూడెం మండలం ఎ.పోలవరం సమీపంలో ఎర్రకాలువలో ఆయన లభ్యమైంది. డీఎస్పీ యు.రవిచంద్ర తెలి పిన వివరాల ప్రకారం కామవరపుకోట, టి.నరసాపురం పోలీస్‌ స్టేషన్ల పరిధిలో సుబ్బారావు స్పెషల్‌ బ్రాంచ్‌ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. స్వగ్రామం బుట్టాయగూడెం నుంచి ప్రతీరోజు విధులకు హాజరవడం ఇబ్బందిగా ఉందని కామవరపుకోటలోనే గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు. 29న రాత్రి విధుల్లో భాగం గా టి.నరసాపురం మండలం మధ్యాహ్నపువారిగూడెం నుంచి అప్పలరాజుగూడెం రహదారిలో చప్టాపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న ఎర్రకాలువలో ప్రమాదవశాత్తు సుబ్బారావు తన ద్విచక్ర వాహనంతో పాటు గల్లంతయ్యాడని డీఎస్పీ తెలిపారు. వరద ఉధృతిని అంచనా వేయలేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నామన్నారు. సుబ్బారావు ఫోన్‌ పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆయన కుమారుడు జాన్‌ రాజు శనివారం తడికలపూడి పోలీస్‌ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. సుబ్బారావు ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా ఆధునిక సాంకేతికను ఉపయోగించి జంగారెడ్డిగూడెం, పోలవరం డీఎస్పీలు రవిచంద్ర, వెంకటేశ్వరరరావు ఆధ్వర్యంలో శనివారం నుంచి ఎర్రకాలువలో ఫైర్‌, ఫిషరీస్‌ సిబ్బంది, గజ ఈతగాళ్లు, డ్రోన్‌ కెమేరాలతో గాలించారు. ప్రమాదం జరిగిన ప్రదేశం వద్ద సుబ్బారావు ద్విచక్ర వాహనం లభ్యమైంది. ఆదివారం ఉదయం తిరిగి గాలింపు చర్యలు చేపట్టగా గల్లంతయ్యాడని భావిస్తున్న ప్రదేశానికి మూడు కిలో మీటర్ల దూరంలో కాలువలో మృత దేహం లభ్యమైంది. జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో పో స్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. సుబ్బారావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం : ఎస్పీ

బుట్టాయగూడెం: మృతి చెందిన సుబ్బారావు కుటుంబ సభ్యులను ఎస్పీ కేపీఎస్‌.కిశోర్‌ పరామర్శించారు. అతడి భ్యార్య పిల్లలకు ధైర్యం చెప్పి, శాఖాపరంగా ఆదుకుంటామన్నారు. పూర్తి విచారణ జరిపి న్యాయం చేస్తామన్నారు. డీఎస్పీ వెంకటేశ్వరావు, స్పెషల్‌ బ్రాంచ్‌ సిఐ మల్లేశ్వరావు నివాళులర్పించారు.

సుబ్బారావు మృతదేహానికి పోలీస్‌ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. సమాధి కార్యక్రమానికి ముందు గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. డీఎస్పీ, సీఐలు, ఎస్‌ఐ పోలీసులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

Updated Date - Sep 01 , 2025 | 12:49 AM