Share News

గుట్కా గుట్టలు

ABN , Publish Date - Jul 09 , 2025 | 12:27 AM

ఉమ్మడి పశ్చిమ జిల్లాలో గుట్కా, నిషేధిత ఉత్పత్తుల విక్రయాలపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు.

గుట్కా గుట్టలు
ఏలూరు షాపులో గుట్కాను పట్టుకున్న ఏఎస్పీ తదితరులు

ఏలూరు క్రైం/జంగారెడ్డిగూడెం/పోలవరం/ చింతలపూడి/ భీమవరం క్రైం, జూలై 8 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి పశ్చిమ జిల్లాలో గుట్కా, నిషేధిత ఉత్పత్తుల విక్రయాలపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. 18 ఏళ్లలోపు పిల్లలకు సిగరెట్లు, మత్తుపదార్థాల అమ్మకాలు జరపరాదని ఎవరైనా విక్రయించినట్లు నిర్ధారణైతే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ ఎన్‌.సూర్యచంద్రరావు హెచ్చరించారు. రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్‌గుప్తా, ఈగల్‌ టీమ్‌ ఐజీ ఎ.రవికృష్ణ ఉత్తర్వులతో ఏలూరు జిల్లా ఎస్పీ కిశోర్‌ ఆదేశాలతో జిల్లాలోని ఏలూరు, జంగారెడ్డిగూడెం, పోలవరం, నూజివీడు సబ్‌డివిజన్‌ పరిధిలో అన్ని పోలీస్‌ స్టేషన్‌ ప్రాంతాల్లో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ‘ఆపరేషన్‌ సేవ్‌ క్యాంపస్‌ జోన్‌’ అనే కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించారు. విద్యా సంస్థలకు 100 మీటర్ల దూరంలో ఉన్న షాపులను తనిఖీలు చేశారు. ఆ షాపులలో ఉన్న సిగరెట్లు, ఖైనీ, గుట్కాలు వంటి వాటిని సీజ్‌ చేశారు. ఏలూరు సీఆర్‌ఆర్‌ కాలేజీ సమీపంలోని ఐదు షాపులను తనిఖీలు చేయగా అక్కడ నిషిద్ద సిగరెట్లు, మత్తుపదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్‌, ఏలూరు త్రీ టౌన్‌ సీఐ వి.కోటేశ్వరరావు, టూటౌన్‌ సీఐ ఎ.అశోక్‌కుమార్‌, త్రీ టౌన్‌ సీఐ రాంబాబు, ఆర్‌ఎస్‌ఐ ఉదయ భాస్కర్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ సూర్యచక్ర పలువురు పాల్గొన్నారు.

జంగారెడ్డిగూడెంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఉన్న కిరాణా, పాన్‌ షాపుల్లో డీఎస్పీ యు.రవిచంద్ర ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిషేదిత గుట్కా, సిగరెట్లు, పేక ముక్కలు స్వాధీనం చేసుకుని మూడు దుకాణాల యజమానులకు అపరాధ రుసుము విధించారు. తనిఖీల్లో సీఐ ఎంవి.సుభాష్‌, ఎస్‌ఐ ఎస్‌కే జబీర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ కెవి.రమణ పాల్గొన్నారు. పోలవరం మండలం పోలవరం మెయిన్‌ బజార్‌లో వున్న షాపులు, జూనియర్‌ కళాశాల వద్ద సీఐ బాల సురేశ్‌ బాబు, సిబ్బందితో కలిసి తనిఖీలు చేశారు. చింతలపూడిలో పాతబస్టాండ్‌, ఫైర్‌స్టేషన్‌ ఏరియాల్లో పలు సిగరెట్ల దుకాణాలపై చింతలపూడి సీఐ క్రాంతికుమార్‌, ఎస్‌ఐ సతీష్‌కుమార్‌ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు.

రూ. 25 వేలు విలువైన సిగరెట్లు, గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

భీమవరం వన్‌టౌన్‌, టూటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ల పరిధిలో సేవ్‌ క్యాంపస్‌ కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి ఆదేశాల మేరకు ఆకస్మిక తనిఖీలు చేశారు. సుమారు రూ. 25 వేల విలువైన సిగరెట్లు, గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని సీజ్‌ చేసినట్లు తెలిపారు. వన్‌టౌన్‌ సీఐ నాగరాజు, టూటౌన్‌ సీఐ కాళీచరణ్‌ వారి సిబ్బందితో షాపులలో దాడులు నిర్వహించారు.

బహిరంగ ప్రదేశాల్లో స్మోకింగ్‌ చేస్తే శిక్షార్హులు

ద్వారకాతిరుమల : బహిరంగ ప్రదేశాల్లో, ధూమపానం నిషేధిత ప్రాంతాల్లో స్మోకింగ్‌ చేస్తే చట్టరీత్యా శిక్షార్హులని... పొగాకు ఉత్పత్తుల అమ్మకాలు చట్టరీత్యా నేరమని భీమడోలు సీఐ యూజే విల్సన్‌ అన్నారు. ద్వారకాతిరుమల మండలంలోని పలు ప్రాంతాల్లో ఆయన సిబ్బందితో కలిసి దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. కొన్ని దుకాణాల్లో నిషేధిత పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్నట్లు గుర్తించి వాటిని స్వాఽధీన పర్చుకున్నారు. అనంతరం దేవాలయ సమీపంలోనూ, బస్టాండ్‌ వద్ద సిగరెట్‌ కాల్చుతున్న వ్యక్తులకు జరిమానా విధించారు. ఏఎస్‌ఐ అమీర్‌, హెచ్‌సీ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 09 , 2025 | 12:27 AM