కలెక్టరేట్‌కు.. క్యూ
ABN , Publish Date - Nov 17 , 2025 | 11:52 PM
జిల్లా కలెక్టరేట్ మొదలుకొని తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల వరకు ప్రతీ సోమ వారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కా ర వేదిక (పీజీఆర్‌ఎస్)కు మిశ్రమ స్పందన లభిస్తోంది.
మండల కేంద్రాల్లో పీజీఆర్‌ఎస్‌కు స్పందన నిల్
ప్రజలు ఫిర్యాదులు చేసినా పరిష్కారం నామమాత్రం
ఇక అధికారుల హాజరూ అంతంత మాత్రమే
అందుకే కలెక్టర్ దృష్టికి సమస్యలు
రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నా.. కొందరు అధికారుల తీరుతో మొక్కుబడి తంతు
(ఆంధ్రజ్యోతి–న్యూస్ నెట్‌వర్క్)
జిల్లా కలెక్టరేట్ మొదలుకొని తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల వరకు ప్రతీ సోమ వారం నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)కు మిశ్రమ స్పందన లభిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం దీనిని సీరియస్‌గా తీసుకుంది. ప్రజలు ఇచ్చిన ప్రతి ఫిర్యాదును అధికారులు ఆన్‌లైన్‌లో నమోదు చేసి, నిర్ణీత గడువులో పరిష్కరించాలి. మండలాల స్థాయిలో ఇస్తున్న ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో పరిష్కారం కాకపోవడంతో బాధితులు జిల్లా కలెక్ట రేట్‌కు క్యూ కడుతున్నారు. ఆంధ్రజ్యోతి సోమ వారం జిల్లాలోని పలు ప్రభుత్వ కార్యాలయా లు విజిట్ చేయగా, కొన్నిచోట్ల పలు విభాగాల అధికారులు హాజరు మొక్కుబడిగా వుంది. పలుచోట్ల అధికారులు వున్నప్పటికి ఒక్క ఫిర్యాదుదారు రాలేదు. ప్రభుత్వం తీసుకున్నం త సీరియస్‌గా జిల్లాలోని పలు విభాగాల అధికారులు తీసుకున్నట్లు కనిపించలేదు.
కలెక్టరేట్‌లో 162 అర్జీలు
ప్రజల నుంచి పీజీఆర్‌ఎస్‌కు వచ్చే ప్రతి అర్జీని అధికారులు క్షుణ్ణంగా అధ్యయనం చేసి పరిష్కరించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్ట రేట్‌లో జరిగిన పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్, జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి, ఆర్డీవో బి.శివన్నారాయ ణ రెడ్డి తదితరులు 162 ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో ఎక్కువగా పింఛన్లు పెంచాల ని, కుటుంబ, సరిహద్దు తగాదాలు, భూసమస్యలపై ఎక్కువగా వున్నాయి.
ఎస్పీ కార్యాలయంలో తొమ్మిది
భీమవరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో 9 ఫిర్యాదులు వచ్చాయి. కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, భర్త, అత్తారింటి వేధింపులు తదితర సమస్యలపై అర్జీదారుల సమస్యలను ఎస్పీ అద్నాన్ నయీం అస్మి విని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు.