అనుమతుల మాటున..!
ABN , Publish Date - May 30 , 2025 | 12:02 AM
వ్యవసాయ, గృహ అవసరాలకు మట్టి తోలకాలు చేపడుతూ చెరువులో పూడిక తీయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోకు అక్రమార్కులు కొత్త భాష్యం చెబుతున్నారు. అధికారుల అండతో అనుమతుల మాటున నిబంధనలను అతిక్రమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
అధికారుల అండతో నిబంధనల అతిక్రమణ
నూజివీడు నియోజకవర్గంలో అక్రమార్కుల మట్టిదందా
నూజివీడు, మే 29 (ఆంధ్రజ్యోతి) : వ్యవసాయ, గృహ అవసరాలకు మట్టి తోలకాలు చేపడుతూ చెరువులో పూడిక తీయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోకు అక్రమార్కులు కొత్త భాష్యం చెబుతున్నారు. అధికారుల అండతో అనుమతుల మాటున నిబంధనలను అతిక్రమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. నూజివీడు నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో మట్టి తోలకాలను తమ ఆర్థిక వనరుగా మార్చుకునేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. ఈ మేరకు మట్టి తోలకాలకు ఎక్స్‌కవేటర్లు, టిప్పర్లను సిద్ధం చేయడం గమనార్హం. చిన్న, పేద, మధ్య తరగతి వర్గాలు తమ ఇంటి అవసరాలకు మట్టి తోలుకునేందుకు సవాలక్ష అనుమతులు కావాలని చెప్పే అధికారులు అక్రమార్కులకు ప్రభుత్వ జీవోల పేరిట యథేశ్చగా అనుమతులు ఇవ్వడం విశేషం.
నిబంధనలు ఇలా..
చెరువులలో మట్టి తొలకాలకు సంబంధించి ఇరిగేషన్ అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి. అధికారులు సంబంధిత చెరువులలో చేసిన మార్కింగ్‌ను బట్టి ఆ పరిధిలోనే అధికారులు సూచించిన మేర అనుమతులు ఇచ్చినంత మాత్రమే మట్టి తవ్వకం చేయాలి. చెరువు తూము లెవల్ కన్నా పైన మాత్రమే పూడిక మట్టిని తోలుకునేందుకు అనుమతులు ఇవ్వాలి. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్‌లతో ఆయా గ్రామాల పరిధిలో మాత్రమేవ్యవసాయ భూములను సారవంతం చేసుకునేందుకు లేదా గృహ అవసరాల మేరువాకు మట్టి తోలకాలు చేపట్టాలి. అనుమతులు తీసుకునే సమయంలో క్యూబిక్ మీటర్‌కు రూపాయి చొప్పున శిస్తు చెల్లించాల్సి ఉంటుంది.
నిబంధన లు అతిక్రమిస్తే...
నిబంధనలు అతిక్రమించి చెరువుల్లో మట్టి తోలకాలు చేస్తున్న అక్రమార్కులు కందకాలు పెట్టడం వల్ల వర్షాకాలంలో పశువులు చెరువులలోకి దిగిన అనేక మంది మృత్యువాత పడిన ఘటనలు ఉన్నాయి.
నిబంధనలకు విరుద్ధంగా లారీలతో ఇతర ప్రాంతాలకు మట్టి తోలకాలు చేపడితే గ్రామస్థులు అక్రమ మట్టి తోలకాలపై వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. లేదా గ్రామ రెవెన్యూ అధికారి,తహసీల్దార్, ఆర్డీవో కలెక్టర్‌కు ఫిర్యాదు చేయవచ్చు.
గుళ్ళపూడిలో చెరువులో మట్టి తవ్వకాలు
ముసునూరు : గుళ్ళపూడి ఊరచెరువులో గురువారం అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని తహసీల్దార్, వీఆర్వో, ఇరిగేషన్ ఏఈలకు ఫిర్యాదు చేసిన స్పందన లేదని స్థానిక టీడీపీ నాయకులు బోగోలు సత్యనారాయణ, నెక్కగంటి రాజేశ్, వేంపాటి చైతన్య ఆరోపించారు. అనుమ తులు ఉన్నాయంటూ కొంతమంది అధికార పార్టీ నాయకుల అండదండలతో యథేచ్ఛగా ఉదయం నుంచి అక్రమంగా మట్టిని తవ్వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఇరిగేషన్ ఏఈ విజయ్‌ను వివరణ కోరగా ఊర చెరువుల్లో మట్టి తవ్వకాలకు అనుమతి ఇంకా ఇవ్వలేదని, ఫైల్ ఉన్నతాధికారుల వద్దే ఉందన్నారు. అయితే గుళ్ళపూడి చెరువులో మట్టి తోలుకునేందుకు అనుమతులు ఇచ్చినట్టు తెలిపారు.