Share News

అక్కడ అలా.. ఇక్కడ ఇలా!

ABN , Publish Date - Dec 09 , 2025 | 12:43 AM

పశ్చిమ ఏజెన్సీ, మెట్ట ప్రాంతాల్లో ఎండుగడ్డికి డిమాండ్‌ ఏర్పడింది. నిత్యం పదుల సంఖ్యలో ఎండుగడ్డి ట్రాక్టర్లు ఏజెన్సీ, మెట్ట ప్రాంతాలకు తరలివ స్తున్నాయి.

అక్కడ అలా.. ఇక్కడ ఇలా!

ట్రాక్టర్‌ ఎండు గడ్డి ధర మెట్టలో రూ.10 వేలు.. డెల్టాలో రూ.6,500

దూరాన్ని బట్టి గడ్డి ధర పెరుగుదల

బుట్టాయగూడెం, డిసెంబరు 8(ఆంధ్రజ్యోతి):పశ్చిమ ఏజెన్సీ, మెట్ట ప్రాంతాల్లో ఎండుగడ్డికి డిమాండ్‌ ఏర్పడింది. నిత్యం పదుల సంఖ్యలో ఎండుగడ్డి ట్రాక్టర్లు ఏజెన్సీ, మెట్ట ప్రాంతాలకు తరలివ స్తున్నాయి. దూరాన్ని బట్టి ట్రాక్టరు గడ్డిని రూ.8 వేల నుంచి 10 లేదా 12 వేలకు విక్రయిస్తున్నారు. విడిగా ఉన్న గడ్డికి ఒక రేటు, కట్టలు కట్టిన గడ్డికి మరొక రేటుతో గడ్డి యాజమానులు అమ్మకాలు జరుపుతున్నారు. విడిగా ఉన్న ఎకరంలోని గడ్డి ట్రాక్టరులో లోడు చేసి 8వేల నుంచి 10 వేల వరకు దూరాన్ని బట్టి అమ్ముతుండగా కట్టలు కట్టిన గడ్డిని ఎకరాకు 60 నుంచి 70 కట్టలు కట్టి దూరాన్ని బట్టి 140 రూపాయలు పైనే ఒక్కో కట్టను అమ్ముతున్నారు. జలాశయాల కింద వరిపంటను సాగుచేసిన రైతుల నుంచి వ్యాపారులు ఎకరాల చొప్పున కొనుగోలు చేసి ఏజెన్సీ, మెట్ట ప్రాంతాలకు తరలిస్తూ అమ్మకాలు జరుపుతున్నారు.

వాణిజ్య పంటలపైనే ఆసక్తి

ఏజెన్సీ, మెట్ట ప్రాంతాల్లో వాణిజ్య పంటలైన వర్జినీయా పొగాకు, మొక్కజొన్న, ప్రత్తి ఇతర పంటలపై మోజు పెంచుకున్న రైతులు వరిపంటను సాగుచేయడం అరుదనే చెప్పాలి. బోర్ల కింద మహా అయితే 500 నుంచి 1500 ఎకరాలకు వరిపంట మించదు. అందుకే ఏజెన్సీలో ఎండుగడ్డికి ఎక్కడాలేని డిమాండ్‌ ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని జలాశయాలు, పంటకాల్వల కింద వరిని సాగుచేసిన రైతులు కోతలు అనంతరం గడ్డిని ఏజెన్సీకి తరలిస్తుండగా ఇక్కడి పశువుల యజమానులు గడ్డి దొరికే సమయంలో కొనుగోలు చేసి ముందుగానే జాగ్రత్త చేస్తారు. ప్రతిఏటా వందల సంఖ్యలో ఎండుగడ్డి ట్రాక్టర్లు ఏజెన్సీ, మెట్ట ప్రాంతాల్లో దర్శనమిస్తుంటాయి. ఎండుగడ్డి వ్యాపారంలో దళారుల పాత్రను కొట్టిపారేయలేము. అప్పుడప్పుడు కృత్రిమ కొరతను సృష్టిస్తూ సొమ్ములు చేసుకుంటారు. ఇప్పటికే వందల ట్రాక్టర్లు ద్వారా ఎండుగడ్డి ఏజెన్సీ, మెట్ట ప్రాంతాలకు చేరుకున్నది.

తగ్గిన గడ్డి ధర

రూ. 4 వేలు

భీమవరం రూరల్‌, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): సార్వా పంట మాసూళ్లతో వాతావరణం అనుకూలం. ఎండగడ్డి మాసూళ్ళకు వీలుగా మారింది. దీంతో ఎండుగడ్డి సరసమైన ధరకు దొరుకుతున్నది. గతంలోకంటే ట్రాక్టర్‌ గడ్డి రూ. 4 వేలు తక్కువగానే అందుబాటులో ఉంటున్నది. గత ఏడాది సార్వా పంటలో పంట సాగు తక్కువ సాగడం మాసూళ్ళ సమయంలో వర్షాలు పడి గడ్డి పాడయ్యింది. దీంతో అప్పట్లో ట్రాక్టర్‌ గడ్డి రూ. 10 వేల పైగా ధర పలికింది. ఇప్పుడు ట్రాక్టర్‌ గడ్డి రూ. 6500లకు అమ్మకాలు చేసుకున్నారు. సార్వా గడ్డిపైనే రైతులు ఎక్కువ మక్కువ చూపుతారు. పురుగు మందుల వాడకం తక్కువ ఉంటుంది. అందువల్ల పశువులకు ఎక్కువ గడ్డి నిల్వ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈసారి కావలసిన గడ్డి సరిపడ ధరకు అందుబాటులో వస్తుంది. వారం రోజులుగా ఎండుగడ్డి నిల్వలు అన్ని ప్రాంతాల్లో చేస్తున్నారు.

3 లక్షల 65 వేల టన్నులు గడ్డి అవసరం

పశువు ఒకటి రోజుకి 5 కేజీల ఎండుగడ్డి తింటుంది. దాని ప్రకారం జిల్లాలోని 2 లక్షల 36 వేల పశువులకు 3 లక్షల 65 టన్నులు గడ్డి అవసరం ఉంటుంది. ఈ సార్వా పంటలో రెండు లక్షల పైగా టన్నుల గడ్డిని భద్రపరచడానికి రైతులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఏడాది సార్వా సాగు 2 లక్షల 17 వేల ఎకరాలలో సాగింది. వాతావరణం అనుకూలం కారణంగా పంటచేలు బాగా తయారయ్యాయి. ఎండుగడ్డి బాగానే వస్తుంది. దీంతో ఆయా ప్రాంతాల్లోని రైతులు గడ్డిని గట్లకు చేర్చుకుని మోడులుగా చేస్తున్నారు.

గడ్డి మాసూళ్ళలో సులువు విధానం

ఎండుగడ్డి మాసూళ్ళకు సులువు విధానం అందుబాటులోకి వచ్చింది. వరికోత యంత్రం మాసూళ్ళు చేసిన చేలలో ఎండుగడ్డి మాసూళ్ళు, యాంత్రిక పనిముట్లతో చేస్తున్నారు. ట్రాక్టర్‌కు ఎటాచ్‌ చేసి ఉంటే పనిముట్లు గడ్డిని నాటుతూ మోపుగా చుడుతుంది. అలా చుట్టినందున రూ. 30 వసూలు చేస్తున్నారు. రైతుకు కూలీలు అవసరం లేకుండానే ఎండుగడ్డి మోపులుగా మారుతుంది. ఇప్పుడు అలానే ఎక్కువ మాసూళ్ళు చేస్తున్నారు.

Updated Date - Dec 09 , 2025 | 12:43 AM