కాళీపట్నం భూముల హక్కుపత్రాలు ఇవ్వండి
ABN , Publish Date - Dec 12 , 2025 | 12:07 AM
కాళీపట్నం జమిందారీ భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులు వారి హక్కుపత్రాలు అందించాలని నరసాపురం ఆర్డీవో దాసిరాజు సూచించారు.
మొగల్తూరు, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): కాళీపట్నం జమిందారీ భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులు వారి హక్కుపత్రాలు అందించాలని నరసాపురం ఆర్డీవో దాసిరాజు సూచించారు. గురువారం కాళీపట్నం పడమర గ్రామ సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రామసభలో ఆయన మాట్లాడారు. కాళీపట్నం రెవెన్యూ పరిధిలో గల రైతులు వారు సాగు చేసుకుంటున్న భూములకు సంబంధించి 1945 నాటికి గల హక్కు పత్రాలు గ్రామసభ ద్వారా అందిస్తే వాటిని పరిశీలించి ఆన్‌లైన్ చేస్తారన్నారు. కాళీపట్నం రెవెన్యూ పరిధి 5 గ్రామ పంచాయతీల పరిధిలో గ్రామకంఠం భూముల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్నవారికి ఎంజాయ్‌మెంట్ సర్టిఫికెట్‌లు అందిస్తామన్నారు. కాళీపట్నం రెవెన్యూ పరిధి జగన్నాధపురం, కోమటితిప్ప, నీటితిప్ప గ్రామాలకు సంబందించి గ్రామకంఠం భూముల సర్వే పూర్తయిందని మిగిలిన గ్రామాల్లోని వారు హక్కుపత్రాలు చూపితే వారందరికీ ఎంజాయ్‌మెంట్ సర్టిఫికెట్‌లు అందిస్తామ న్నారు. నూతనంగా గృహలు నిర్మించుకునేవారికి ప్రభుత్వ సహయం అందుతుందని వివరించారు. తహసీల్దార్ కె.రాజ్‌కిషోర్, సర్పంచ్ కవురు సావిత్రి ఆదినారాయణ, మాజీ సర్పంచ్ జోగి పండు, రైతులు పాల్గొన్నారు.