పసిడి పండగ
ABN , Publish Date - May 01 , 2025 | 12:11 AM
నగల దుకాణాల్లో బుధవారం అక్షయ తృతీయ సందడి కనిపించింది. ఉదయం నుంచి రాత్రి వరకు కొనుగోలుదారులతో దుకాణాలు కిటకిటలాడాయి.
నగల దుకాణాల్లో అక్షయ తృతీయ సందడి
ధర పెరిగినా.. తగ్గని డిమాండ్
జోరుగా సాగిన కొనుగోళ్లు
నరసాపురం/భీమవరం క్రైం, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): నగల దుకాణాల్లో బుధవారం అక్షయ తృతీయ సందడి కనిపించింది. ఉదయం నుంచి రాత్రి వరకు కొనుగోలుదారులతో దుకాణాలు కిటకిటలాడాయి. సెంటి మెంట్‌తో కొందరు గ్రాము నుంచి రెండు గ్రాముల బంగారం కొనుగోలు చేశారు. వెండి కన్న బంగారు వస్తువులే ఎక్కువ విక్రయాలు జరిగాయి. గత ఏడాది ఆక్షయ తృతీయ నాడు గ్రాము బిస్కెట్ బంగారం రూ.7340, ఆర్నమెంట్ బంగారం రూ 6740 పలికింది. ప్రస్తుతం బిస్కెట్ బంగారం గ్రాము రూ. 9780, ఆర్నమెంట్ బంగారం రూ.8990 ఉం ది. ధర పెరిగినా కొనుగోలు మొగ్గు చూపారు.
రూ.20 కోట్ల అమ్మకాలు!
జిల్లాలో సుమారు 500 నగల దుకాణాలు ఉన్నాయి. వ్యాపారులు అక్షయ తృతీయకు రెండు రోజులు ముందుగానే ఆఫర్లు ప్రకటించారు. ఒక దుకాణంలో ఎంత బం గారం కొంటే అంత వెండి ఉచితం అని, మరో దుకాణంలో 24 క్యారెట్ల ధరకే వస్తువులు అమ్మకం అంటూ ప్రచారం చేశారు. దాంతోపాటు రూ.2 లక్షల విలువైన వస్తువు కొనుగోలు చేస్తే వెండి పట్టీలు ఉచితం అంటూ రకరకాల ఆఫర్లతో కొనుగోలుదారులు దుకాణాల వద్ద క్యూ కట్టారు. బంగారం ధర చుక్కల్లో ఉన్నా కూడా కొనుగోలు శాతం తగ్గలేదని వ్యాపారులు చెబుతున్నారు. సుమారు జిల్లాలో ఒక్కరోజే సుమారు రూ.20 కోట్ల వరకు వ్యాపారాలు జరిగినట్లుగా అంచనా.
వెండికీ డిమాండ్
అక్షయ తృతీయ సందర్భంగా బంగారంతో పాటు వెండి వస్తువులు కొనుగోలు చేశారు. అక్షయ తృతీయ నాడు బంగారమే కాకుండా వెండి కూడా కొనుగోలు చేస్తే సకల శుభాలు కలుగుతాయన్న ప్రచారంతో కొనుగోళ్లు సాగాయి. కేజీ వెండి ధర రూ.లక్ష తాకినా కొనుగోలులో ఎటువంటి మార్పురాలేదు. వ్యాపారులు కొనుగోలుదారుల కోసం ప్రత్యేకంగా రకరకాల కొత్త మోడల్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. యాండిక్, స్టెల్లింగ్ వంటి సిల్వర్‌ను అందుబాటులో ఉంచారు. బంగారు, వెండి కొనుగోలుదారులతో దుకాణాలు కళకళలాడాయి. ఈ హడావుడి ఏడాదిపాటు కొనసాగితే వ్యాపారాలకు ఢోకా ఉండ దని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. కొందరు మాత్రం ధర తగ్గితే వ్యాపారాలు ఇంకా పుంజుకుంటాయన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇండియా–పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో ధరలు భారీగా పెరగవచ్చన్న అంచనాలు కొందరు నిపుణులు వేస్తున్నారు.