Share News

గోదావరి ఉరకలు

ABN , Publish Date - Aug 20 , 2025 | 12:11 AM

గువన కురిసిన వర్షాలతో గోదావరి ఉధృతి పెరుగుతోంది.

గోదావరి ఉరకలు
నీట మునిగిన కనకాయలంక కాజ్‌వే

తగ్గుతూ.. పెరుగుతూ.. ఉధృతమవుతున్న గోదావరి

సిద్ధాంతం, కోడేరులో మునిగిన పుష్కరఘాట్లు

లంక గ్రామాలకు పడవలపై రాకపోకల నియంత్రణ

నీట మునిగిన కనకాయలంక కాజ్‌వే

నరసాపురం వద్ద వలకట్లు తొలగింపు

మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక

ఎగువన కురిసిన వర్షాలతో గోదావరి ఉధృతి పెరుగుతోంది. భద్రాచలం వద్ద తగ్గుతూ.. పెరుగుతున్నప్పటికీ ధవళేశ్వరం వద్ద వరద జలాలు సముద్రంలోకి విడుదల చేయడంతో జిల్లాలో గోదావరి పోటెత్తుతోంది. సిద్ధాంతం, పెదమల్లం, కోడేరు పుష్కర ఘాట్లు, కనకాయలంక కాజ్‌ వే నీట మునిగాయి. నరసాపురం వద్ద వల కట్లను తొలగించారు. పడవలపై రాకపోకలు తగ్గాయి. వేటకు వెళ్లొద్దని మత్స్యకారులను అధికారులు హెచ్చరించారు.

ఆచంట/పెనుగొండ, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలతో గోదావరి ఉరకలు వేస్తోంది. మంగళవారం కోడేరు, పెదమల్లం, కరుగోరుమిల్లి, పుష్కరఘాట్‌లు నీట మునిగాయి. పెనుగొండ మండలం సిద్ధాంతం, నడిపూడి పుష్కరఘాట్‌ల వరకు నీరు చేరింది. గోదావరిలో పడవలపై వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నాటు పడవలు నామమాత్రంగా తిరుగుతున్నాయి.

కాజ్‌వే నీట మునిగింది

యలమంచిలి: మండలంలోని కనకాయలంక కాజ్‌వే మంగళవారం నీట మునిగింది. కనకాయలంక – డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా చాకలిపాలెం గ్రామాల మధ్య రాకపోకలకు కాజ్‌వే కీలకం. మంగళవారం సాయంత్రానికి కాజ్‌వేపై సుమారు ఒక అడుగు వరద నీరు ప్రవహిస్తోంది. క్రమేపీ వరద ఉధృతి పెరుగుతోంది.

కనకాయలంక కాజ్‌ వే వద్ద వరద పరిస్థితిని తహసీల్ధారు జి.పవన్‌కుమార్‌ పరిశీలించారు. గ్రామస్తుల రాకపోకలకు పడవలను ఏర్పాటు చేశామన్నారు. లంకగ్రామాల ప్రజలు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కనకాయలంకలో దొడ్డిపట్ల పీహెచ్‌సీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని జిల్లా వైద్యాధికారి జి.గీతాబాయి పరిశీలించారు. 24 గంటలూ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. గ్రామంలో కాన్పుకు దగ్గరగా ఉన్న గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని తెలిపారు.

అల.. కల్లోలం

నరసాపురం: వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఎగసిపడుతున్నాయి. ప్రస్తుత అల్పపీడనం బలహీన పడుతున్నా మరో వాయుగుండం పొంచి ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని మంగళవారం అధికారులు హెచ్చరించారు. పేరుపాలెం, కేపీపాలెం, పీఎంలంక వద్ద బీచ్‌లో సందర్శకులను అనుమతించడం లేదు.

Updated Date - Aug 20 , 2025 | 12:11 AM