Share News

గోదావరి వరద.. దూసుకొస్తోంది !

ABN , Publish Date - Jul 12 , 2025 | 12:13 AM

ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలతో గోదావరి నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. గత 24 గంటల్లోనే భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 30 అడుగుల నుంచి శుక్ర వారం సాయంత్రానికి 37 అడుగులకు చేరుకుంది.

గోదావరి వరద.. దూసుకొస్తోంది !
కుక్కునూరు–దాచారం గ్రామాల మధ్య నీటమునిగిన గుండేటివాగు లోలేవెల్‌ కాజ్‌వే

కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు అప్రమత్తం

భద్రాచలం వద్ద నేడు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం

పునరావాస కేంద్రాలకు స్థానికుల తరలింపు

జిల్లా, మండలస్థాయిలో కంట్రోలు రూమ్‌ల ఏర్పాటు

ముంపు ప్రాంతాలకు చేరుకున్న ప్రత్యేకాఽధికారులు

పునరావాస కేంద్రాల్లో విద్యుత్‌ సహా సౌకర్యాల ఏర్పాటు

ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలతో గోదావరి నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. గత 24 గంటల్లోనే భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 30 అడుగుల నుంచి శుక్ర వారం సాయంత్రానికి 37 అడుగులకు చేరుకుంది. మరికొద్ది గంటల్లో తొలి ప్రమాద హెచ్చరిక దిశగా నీటిమట్టం చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నా రు. ఇప్పటికే ముంపు మండలాలైన కుకునూరు, వేలేరుపాడులో వరద ఛాయలు కనిపిస్తున్నాయి. వాగుల్లోకి గోదావరి నీరు ఎగబాకడంతో ఎక్కడికక్కడ కాజ్‌వేలు నీట మునగడంతో రాకపోకలకు అవాం తరం ఏర్పడింది. వేలేరుపాడు మండలం ఎద్దువాగు కాజ్‌వే పైకి వరద నీరు చేరడంతో 14 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కుక్కునూరు లో గుండేటి వాగు పరిస్థితి ఇదే మాదిరి ఉంది.

(ఏలూరు/కుక్కునూరు, ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

నాలుగేళ్లుగా గోదావరి వరదను ఈ రెండు మండలాలు చవిచూస్తున్నాయి. భద్రాచలం వద్ద నీటిమట్టం 43 అడుగులు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేస్తారు. ఈ నాలుగేళ్లలో మూడుసార్లు ఈ హెచ్చరిక జారీ అయింది. గోదావరిలో వరద దూసుకొస్తుండటంతో స్థానికులు అప్రమత్తయ్యారు. ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు. దాచారం పునరావాస కేంద్రంలోకి ఇప్పటికే వారు చేరుకోవడం ఆరంభించారు. రెండు రోజుల క్రితమే కలెక్టర్‌ వెట్రిసెల్వి, జేసీ ధాత్రిరెడ్డి వరద ముంద స్తు నివారణ చర్యలపై సమీక్షించారు. ముంపు మండలాలకు వెళ్లి అధికారులకు సూచనలు చేశారు. ఈ సమీక్ష ముగిసిన 24 గంటల వ్యవధిలోనే ప్రత్యేకాధికారులను నియమించారు.

జూలై వచ్చిందంటే చాలు..

ఏటా జూలై వచ్చిందంటే చాలు కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు వణికిపోతున్నాయి. 2022లో చేదు అనుభవాలను మిగిల్చాయి. జూలై 11న గోదావరిలో వరద పతాక స్థాయికి చేరుకోవడంతో వేలేరుపాడును ముంచెత్తింది. కరెంటు స్థంభం ఎత్తుకు పైబడే వరద ముంచెత్తడంతో స్థానికులే విస్తుపోవాల్సి వచ్చింది. రేపాకగొమ్ము వరద తాకిడికి చిన్నాభిన్నమైంది. స్థానికు లు సమీపంలోని గుట్టలపైకి చేరి రెండు వారాలపాటు బిక్కు బిక్కుమంటూ గడిపారు. ఇప్పటికే రేపాకగొమ్ముతోపాటు రుద్రం కోటవాసులు గుట్టపై నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అధి కారులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచనలు చేసినా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇంతకు ముందు 2023 జూలై చివరి వారంలో భద్రాచలం వద్ద 56 అడుగులు నీటిమట్టం నమోదు కావడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. ఇప్పుడు సరిగ్గా జూలై 11 రానే వచ్చింది. ఆ వెంటనే గోదావరిలో వరద తొలి ప్రమాద హెచ్చరికకు చేరువ అవుతోంది. 1986 తొలి సారిగా భద్రాచలం వద్ద 75.60 అడుగుల మేర వరద నీటి మట్టం నమోదైంది. 27 లక్షల క్యూసెక్కుల నీటి మట్టం విడుదలైంది. 2022లోనూ 71.30 అడుగుల నీటిమట్టం నమోదు కాగా అప్పట్లో 21.78 లక్షల క్యూసెక్కుల నీటి వరదనీరు సాగింది. గతేడాది జూలై 27న వారంపాటు గోదావరిలో వరద బెంబెలెత్తించింది. అప్పట్లో భద్రాచలం వద్ద 56.9 అడుగుల మేర వరద నీరు చేరింది. ఈ అనుభవాల నేపథ్యంలో జూలై వచ్చిందంటే తీరంలో అంతా గడగడలాడాల్సి వస్తోంది.

అప్రమత్తంగా ఉండండి : కలెక్టర్‌

‘భద్రాచలం వద్ద గోదావరి నదికి శనివారం తెల్లవారుజామున మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయబోతున్నారు. యంత్రాంగం అప్రమత్తం కావాలి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ప్రజలెవరూ నదిలోకి వెళ్లవద్దు. చేపల వేట చేయవద్దు. జాగ్రత్తగా ఉండండి’ అంటూ కలెక్టర్‌ వెట్రిసెల్వి కుక్కునూరు, వేలేరుపాడులలో యంత్రాంగాన్ని, స్థానికులను శుక్రవారం రాత్రి అప్రమత్తం చేశారు. సాధ్యమైనంత మేర ప్రసవానికి దగ్గరలో వున్న గర్భిణులను దగ్గరలోని సామాజిక ఆరోగ్య కేంద్రాలకు తరలించాలని, వృద్ధులు, పిల్లలు, విభిన్న ప్రతిభావంతులను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని ఆదేశించారు. దాచారం ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీల్లో వరద పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి నిర్వాసితులకు భోజన, వసతి సౌకర్యాలు కల్పించాలని వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీచేశారు. పునరావాస కేందాల్ర్లో తాగునీరు, టాయిలెట్ల సౌకర్యం కల్పించాలని, వాటర్‌ట్యాంకులు సిద్ధం చేయాలని, అత్యవసర సమ యంలో వినియోగం నిమిత్తం మోటారుబోట్లు, ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాల న్నారు. వరద పునరావాస కేంద్రాల్లో నిత్యావసర సరుకులు, కాయగూరలు సిద్ధం చేయాలన్నారు. వరద నీరు ప్రవహించే కల్వర్టులు, కాజ్‌వేలు, రహదారులను ముందస్తుగా మూసి వుంచడంతోపాటు అవి ప్రజలు దాటకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు అత్యవసర టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించి జంగారెడ్డిగూడెం ఆర్డీవో, ఐసీడీఎస్‌ పీవోలను ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాల్సిందిగా ఆదేశించారు. వరద ప్రభావిత గ్రామాలైన లచ్చిగూడెం, గొమ్ముగూడెం గ్రామస్తులతో ఐసీడీఎస్‌ పీవో రాములనాయక్‌ భేటీ అయ్యారు. పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తహసీల్దార్‌ రమేశ్‌బాబు, ఎంపీడీవో నరసింహరావు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ వీరాస్వామి గ్రామాల్లో పర్యటిస్తూ ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.దాచారం పునరావాస కేంద్రంలో విద్యుత్తు సౌకర్యం ఏర్పాటు చేసినట్టు ఏపీఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ సాల్మన్‌రాజు చెప్పారు. పునరావాస కేంద్రాన్ని పరిశీలించి విద్యుత్తు సౌకర్యంతో పాటు జనరేటర్‌ను అందుబాటులో ఉంచామన్నారు.

కంట్రోల్‌ రూంలు ఇవే :

జిల్లా కంట్రోల్‌ రూమ్‌ 1800 233 1077

స్టేట్‌ కంట్రోల్‌ రూమ్‌ 833–390–8335022

జంగారెడ్డిగూడెం ఆర్డీవో ఆఫీసు – 83092 69056

కుక్కునూరు తహసీల్దారు ఆఫీసు – 83092 46369

వేలేరుపాడు తహసీల్దార్‌ ఆఫీసు – 83286 96546

విద్యుత్‌ సమస్యలపై కంట్రోల్‌ రూం ఏర్పాటు

జంగారెడ్డిగూడెం: భారీ వర్షాలు, గోదావరి వరదల కారణంగా విద్యుత్‌ అంతరాయాలు, విద్యుత్‌ పునరుద్ధరణకు జంగారెడ్డి గూడెం విద్యుత్‌ శాఖ డివిజన్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్టు విద్యుత్‌ శాఖ ఈఈ పీర్‌ అహ్మద్‌ఖాన్‌ శుక్ర వారం తెలిపారు. వరద ప్రాంతాల ప్రజలు 94910 30712కు ఫోన్‌ ద్వారా సమాచారం తెలుపవచ్చన్నారు

పునరావాస కేంద్రాలకు రండి : ఎంపీ మహేశ్‌కుమార్‌

భారీ వర్షాలతో పెరుగుతున్న వరద ఉధృతి నేపథ్యంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్‌ అధికారులను అప్ర మత్తం చేశారు. నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలిం చాలని, వరద ఉధృతి తగ్గేంత వరకు అన్ని జాగ్రత్తలు తీసుకోవా లని జిల్లా యంత్రాగాన్ని కోరారు. నది పరీవాహక ప్రాంతాల వైపు ప్రజలు ఎవరూ వెళ్లకుండా అధికారుల సూచనలను పాటించాలని ఎంపీ విజ్ఞప్తి చేశారు.

Updated Date - Jul 12 , 2025 | 12:13 AM