Share News

గోదావరి తగ్గుముఖం

ABN , Publish Date - Jul 15 , 2025 | 12:29 AM

గోదావరి వరద ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. భద్రాచలం వద్ద సోమవారం ఉదయం 25.6 అడుగుల నుంచి సాయంత్రానికి 23.2కు చేరింది. నీటిమట్టం తగ్గటంతో కుక్కునూరులోని గుండేటివాగు వరద తగ్గింది.

గోదావరి తగ్గుముఖం
బురదలో పెదమల్లం లంకవాసులు కష్టాలు

ఊపిరి పీల్చుకున్న తీర ప్రాంత ప్రజలు

సముద్రంలోకి లక్షల క్యూసెక్కులు..

నరసాపురంలో వశిష్ఠ వద్ద పరవళ్లు

ఆచంట/యలమంచిలి/నరసాపురం, జూలై 14(ఆంధ్రజ్యోతి):గోదావరి వరద ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. భద్రాచలం వద్ద సోమవారం ఉదయం 25.6 అడుగుల నుంచి సాయంత్రానికి 23.2కు చేరింది. నీటిమట్టం తగ్గటంతో కుక్కునూరులోని గుండేటివాగు వరద తగ్గింది. పోలవరం ప్రాజెక్టులోకి చేరుకున్న 4,11,238 క్యూసెక్కుల అదనపు జలాలను జల వనరుల శాఖ అధికారులు దిగు వకు విడుదల చేశారు. ధవళేశ్వరం ఆర్మ్‌లోని మొత్తం గేట్లను ఒక మీటరు మేర, ర్యాలీ, మద్దూరు, విజ్జేశ్వర ఆర్మ్‌లలో మొత్తం గేట్లను 0.60 మీటర్ల మేర పైకి ఎత్తి 3,58,900 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. నీటిమట్టం 10.50 అడుగులుగా నమోదైంది. రైతు డిమాండ్‌ మేరకు వ్యవసాయ అవసరాల కోసం డెల్టా కాలువలకు నీటి విడుదలను పెంచారు. తూర్పు డెల్టాకు 5 వేల క్యూసెక్కులు, మధ్య డెల్టాకు 2600క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 6800 క్యూసెక్కులు చొప్పున విడుదల చేస్తున్నారు. ఆచంట మండలం కోడేరు పుష్కరఘాట్‌లో వరద నీరు తగ్గింది. గోదావరి తగ్గడంతో పెదమల్లంలంక, ఆనగార లంకకు ప్రజలు పనుల నిమిత్తం, విద్యార్థులు చదువుల నిమిత్తం పడవలపై యర్రంశెట్టివారిపాలెం వరకు వెళ్లి అక్కడి నుంచి గన్నవరం వెళ్లారు. ఆనగారలంక రేవులో బురద పేరుకుపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. యలమంచిలి మండలం కనకాయలంక కాజ్‌ వే వరద ముంపు నుంచి బయటపడడంతో రాకపోకలు యధా విధిగాసాగాయి. ధవళేశ్వరం నుంచి లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేయడంతో నరసాపురం వశిష్టలో వరద పరవళ్లు తొక్కింది. అన్ని రేవుల్లో నీటి మట్టాలు పెరిగాయి. ప్రవాహం ఎక్కువగా ఉండటంతో మత్స్యకారులు కట్టుకున్న ఐలు వలలను తొలగించి వేశారు. వేట సాగించడం లేదు. వలంధర్‌ రేవులో నీటి మట్టాలు పెరగడంతో స్నానాలకు అనుమతించలేదు. మరో రెండు రోజుల్లో వశిష్ఠకు వరద ఉధృతి తగ్గుతుం దని ఏటిగట్టుల శాఖ ఏఈ పవన్‌ చెప్పారు. బియ్యపు తిప్ప నుంచి దొడ్డిపట్ల వరకు ఉన్న ఏటిగట్లపై తరచూ తనిఖీలు చేస్తున్నామన్నారు.

Updated Date - Jul 15 , 2025 | 12:29 AM