గోదావరి ఉధృతి
ABN , Publish Date - Sep 29 , 2025 | 12:05 AM
గోదావరి వరద మళ్లీ పెరుగుతోంది. శనివారం సాయంత్రం కొంత నెమ్మదించిన గోదావరి ఆదివారం ఉదయం నుంచి పెరుగుతోంది.
మునిగిన పుష్కర ఘాట్‌లు
కనకాయలంక కాజ్‌వేపై వరద నీరు
పంటు, పడవ రాకపోకల నియంత్రణ
రేవు వద్ద పోలీసు బందోబస్తు
ఆచంట / యలమంచిలి /నరసాపురం, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): గోదావరి వరద మళ్లీ పెరుగుతోంది. శనివారం సాయంత్రం కొంత నెమ్మదించిన గోదావరి ఆదివారం ఉదయం నుంచి పెరుగుతోంది. ఆచంట మండలం కోడేరు, పెదమల్లం, భీమలాపురం, కరుగోరుమిల్లి పుష్కరఘాట్‌లు పూర్తిగా నీట మునిగాయి. గోదావరిలో నాటుపడవలు రాకపోకలు కూడా నామమాత్రంగా తిరుగుతున్నాయి. యలమంచిలి మండలం కనకా యలంక కాజ్‌వే నీట మునిగింది. గ్రామస్తులు కాజ్‌వే వద్ద పడవల్లో రాకపోకలు సాగిస్తున్నారు. ఆగస్టులో రెండుసా ర్లు, ఈ నెలలో రెండుసార్లు గోదావరికి వరద రావడం కాజ్‌వే సుమారు 15రోజులు ముంపులోనే ఉంది. నరసాపు రం వద్ద వశిష్ట గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వలంధర్ రేవులో స్నానాలు నిలుపుదల చేశారు. బాపు ఘాట్ వద్ద నీరు మెట్ల వరకు చేరింది. గోదావరిలో వలకట్లను మత్స్య కారులు తొలగించారు. మాధవాయిపాలెం– సఖినేటిపల్లి రేవుల మధ్య పంటు, పడవల రాకపోకలను శనివారం రాత్రి నుంచి నిలుపుదల చేశారు. పడవల రాకపోకల నియంత్రణకు రేవులో పోలీస్ బందోబస్తు ఉంచారు.