Share News

వరద గోదారి

ABN , Publish Date - Jul 14 , 2025 | 12:14 AM

ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో ధవళేశ్వరం వద్ద పెరుగుతున్న గోదావరి ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిలకడగా కొనసాగి ఆపై తగ్గుముఖం పట్టింది.

వరద గోదారి
కనకాయలంక కాజ్‌వే పై వరద నీటిలో రాకపోకలు

ధవళేశ్వరం వద్ద తగ్గిన గోదావరి ఉధృతి

సముద్రంలోకి 6,14,762 క్యూసెక్కుల నీరు విడుదల

సిద్ధాంతం, పెదమల్లం, కోడేరు లంకలకు వరద నీరు

నీట మునిగిన కనకాయలంక కాజ్‌వే

పెనుగొండ/ఆచంట/యలమంచిలి, జూలై 13(ఆంధ్రజ్యోతి): ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో ధవళేశ్వరం వద్ద పెరుగుతున్న గోదావరి ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిలకడగా కొనసాగి ఆపై తగ్గుముఖం పట్టింది. ఆదివారం ఉదయానికి అత్యధికంగా 6,56,341 క్యూసెక్కుల నీటిని కాటన్‌ బ్యారేజ్‌ గేట్ల ద్వారా దిగువకు విడుదల చేశారు. ధవళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం 10.90 అడుగులు నమోదైంది. సాయంత్రానికి 40 వేల క్యూసెక్కులకు పైగా తగ్గి 6,14,762 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి ప్రవహిస్తోంది. ఎగువన భద్రాచలం వద్ద 24గంటల వ్యవధిలో 10 అడుగుల తగ్గిన నీటి మట్టం ఆదివారం సాయంత్రానికి 30.60 అడుగులకు చేరుకుంది. కాటన్‌ బ్యారేజ్‌ నుంచి వ్యవసాయ అవసరాల కోసం తూర్పుడెల్టాకు 4,800క్యూసెక్కులు, మధ్య డెల్టాకు 2600క్యూసెక్కులు, పశ్చిమడెల్టాకు 6800క్యూసెక్కులు చొప్పున నీరు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం వద్ద నీటి విడుదల స్వల్పంగా తగ్గినప్పటికీ సిద్ధాంతం, ఆచంట, యలమంచిలి వద్ద గోదావరి ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. పెనుగొండ మండలం సిద్ధాంతం మధ్య లంకలో నీరు చేరుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సిద్ధాంతం మధ్య లంక రైతు లు జాగ్రత్త వహించాలని తహసీల్దార్‌ జి.అనితకుమారి సూచించారు. ఆదివా రం సాయం త్రానికి సిద్ధాంతం వశిష్ట గోదావరి వద్ద కేదార్‌ఘాట్‌ మెట్లు, పక్కనే శివలింగం వరద నీటిలో మునిగిపోయింది. ఆచంట మండలంలో లంక గ్రామాలకు పడవలపై రాకపోకలు తగ్గించారు. రెవెన్యూ అధికారులు గోదావరి వరద పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం వరదతో ముప్పు లేదని, ఏటిగట్టు పటిష్టంగా ఉందని ఇరిగేషన్‌ హెడ్‌ వర్క్స్‌ ఏఈ జి.పవన్‌ కుమార్‌ తెలిపారు.

నీటమునిగిన కనకాయలంక కాజ్‌ వే

గోదావరి వరద ప్రవాహం పెరగడంతో యలమంచిలి మండలం కనకాయ లంక కాజ్‌ వే నీటమునిగింది. కాజ్‌వేపై సుమారు ఒకఅడుగు వరదనీరు ప్రవహిస్తోంది. కనకాయలంక – డాక్టర్‌ డీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా చాకలిపాలెం మధ్య వరదనీటిలోనే గ్రామస్తులు రాకపోకలు సాగిస్తున్నారు. కాజ్‌ వే పూర్తిగా నీటమునిగితే పడవలపైనే రాకపోకలు సాగించాలి.

అప్రమత్తంగా ఉండాలి: ఆర్డీవో దాసి రాజు

గోదావరి వరద పెరుగుతున్న దృష్ట్యా అధికారులు, లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నరసాపురం ఆర్డీవో దాసి రాజు సూచించారు. కనకాయలంక కాజ్‌ వే వద్ద వరద పరిస్థితిని ఆదివారం ఆయన పరిశీలించారు. లంక గ్రామాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నామన్నారు.

Updated Date - Jul 14 , 2025 | 12:14 AM