టీడీపీతోనే భవిత
ABN , Publish Date - May 25 , 2025 | 12:14 AM
రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా పేదలు అభ్యున్నతి చెందాలన్నా మరో 15 ఏళ్లపాటు తెలుగుదేశం అధికారంలో ఉండాలి. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేసింది.
పదేళ్లు సీఎంగా చంద్రబాబు
పవన్ నోట ఇదే మాట.. పార్టీ కోసం కష్టపడండి
లేదంటే రాష్ట్రం అధోగతే.. చరిత్ర చెప్పిందిదే
రానున్న రోజుల్లో బీసీలకు పెద్ద పీట
టీడీపీ జిల్లా మహానాడులో నేతల స్పష్టీకరణ
భీమవరం/తణుకు/తణుకు రూరల్, మే 24(ఆంధ్ర జ్యోతి):‘రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా పేదలు అభ్యున్నతి చెందాలన్నా మరో 15 ఏళ్లపాటు తెలుగుదేశం అధికారంలో ఉండాలి. ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేసింది. పేదలకు కూడు, గూడు, గుడ్డ లభించింది. తెలుగుదేశం ఓటమి చెందిన ప్రతీసారి రాష్ట్రం అధోగతి పాలైంది. అభివృద్ధి వెనుకబడింది. 2019 నుంచి 2024 వరకు ఐదేళ్ల రాక్షస పాలన సాగింది. దుర్మార్గపు పాలన అంతమొందించడానికి ప్రతి కార్యకర్త కష్టపడ్డారు. ఎన్నో అవమానాలు భరించారు. అహర్నిశలు శ్రమించి టీడీపీ కూటమిని అధికారంలోకి తెచ్చారు. ప్రజలు అండగా నిలిచారు. రాష్ట్ర భవిష్యత్తు మళ్లీ గాడిలో పడింది. ఇదే అభివృద్ధి కొనసాగాలంటే, రాజధాని, పోలవరం ప్రాజెక్ట్‌లు పూర్తి కావాలంటే మన ప్రభుత్వం 15 ఏళ్లపాటు కొనసాగాలి. రాష్ట్రం కోసం, ప్రజల కోసం టీడీపీ ప్రభుత్వాన్ని కాపాడుకుందాం’ అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు పిలుపునిచ్చారు. తణుకులో శనివారం సాయంత్రం టీడీపీ జిల్లా మహానాడు పార్టీ జిల్లా అధ్యక్షుడు మంతెన రామరాజు ఆధ్వర్యంలో జరిగింది. స్థానిక ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పర్యవేక్షణలో మహానాడు విజయవంతమైంది. పొలిట్ బ్యూరో సభ్యులు, ఎంఎల్‌ఎలు, కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్యనేతలు, కార్యకర్తలు, నాయకులు హాజరయ్యారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు తెలుగుదేశం ప్రస్థానంపై ముఖ్య నాయకులు ప్రస్తావించారు. గతంలో పార్టీకి పునాది వేసి ఎన్టీఆర్ అభివృద్ధి చేస్తే వర్తమానంలో చంద్రబాబు, భవిష్యత్తులో లోకేశ్ కీలకంగా ఉంటారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో దుర్గార్గపు పాలన అంతమొందిం చడానికి కలసి వచ్చిన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు అభిన ందనలు తెలిపారు. తెలుగుదేశం కూటమి ఐక్యతగా ఉండాలని, కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు అభినందిస్తూ తీర్మానం చేశారు. మహానాడులో ఆరు తీర్మానాలను ఆమోదించారు. నాలుగు దశాబ్దాలుగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తూ అండగా ఉంటున్న కార్యకర్తల సంక్షేమం కోసం నిధిని ఏర్పాటు చేయాలంటూ మహానాడు తీర్మానించారు.
సంక్షేమం, అభివృద్ధి దిశగా పాలన : మంతెన
జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఏపీఐ ఐసీ చైర్మన్ మంతెన రామరాజు మాట్లాడుతూ ‘పేదల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా టీడీపీ ఏర్పడింది. ఆ లక్ష్య సాధనే ధ్యేయంగా పాలన సాగిస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలపై ఎన్ని కేసులు బనాయించి నిర్బంధాలు పెట్టినా కార్యకర్తలు లెక్క చేయకుండా పార్టీని ముందుకు నడిపించార’ని చెప్పారు.
విప్లవాత్మకమైన మార్పులు : గన్ని
ఆప్కాబ్ రాష్ట్ర చైర్మన్ గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ ‘ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో విప్లవాత్మ కమైన మార్పులు చోటు చేసు కుంటున్నాయి. అమరావతి, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంటు, రైల్వే జోన్ వంటి పలు పనులు పురోగతిలో ఉన్నాయి’ అని అన్నారు.
అభివృద్ధికి సహకరించాలి : ముళ్లపూడి
తణుకు మాజీ ఎమ్మెల్యే ముళ్ళపూడి వెంకట కృష్ణారావు మాట్లాడుతూ ‘క్రమశిక్షణతో ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉన్న వారు పార్టీ ద్వారా సేవ చేయవచ్చు. ప్రజలకు న్యాయం చేయాలనే ప్రదాని మోదీ, పవన్, సీఎం చంద్రబాబు కలసి పనిచేస్తున్నారు. మూడు పార్టీలు సమష్టిగా పని చేసి అబివృద్ధికి సహకరించాలి’ అన్నారు.
స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాలి : పొత్తూరి
నరసాపురం టీడీపీ ఇన్‌చార్జి పొత్తూరి రామరాజు మాట్లాడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు కృషి చే యాలని పిలుపునిచ్చారు.
బీసీలకు ప్రాధాన్యం : పితాని
మహానాడులో సామాజిక న్యాయంపై చర్చ సాగింది. ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో బీసీలకు తగిన ప్రాధాన్యం లభించాలని టీడీపీ బీసీ సెల్ నాయకుడు గౌరునాయుడు తదితరులు ప్రస్తావించారు. దీనిపై పొలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ స్పందించారు. ‘నామినేటెడ్ పదవుల్లో బీసీలకు తగిన ప్రాఽధాన్యం ఇవ్వకపోవడం వాస్తవమే. నీటి సంఘాలు, మార్కెట్ కమిటీల్లో తగిన ప్రాధాన్యం ఇచ్చారు. ఎంపీపీ, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, సొసైటీ ఎన్నికలకు అంతా సిద్ధం కండి. బీసీలకు తగిన ప్రాధాన్యం వస్తుంది. కార్పొరేషన్‌లలో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వలేదన్న చర్చ సాగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లా. కార్పొరేషన్ పాలకవర్గాల్లో అయినా బీసీలకు, ఎస్సీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరాను. చంద్రబాబు అందుకు సమ్మతించారు. సభా ముఖంగా ఈ విషయాన్ని చెబుతున్నా. బీజేపీ, టీడీపీ, జనసేన కలసికట్టుగా పనిచేయాలి. జనసేనను తక్కువ చేయడానికి లేదు. ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుంది’ అంటూ పితాని ప్రకటించారు.