రహదారులకు మోక్షం
ABN , Publish Date - Oct 09 , 2025 | 01:43 AM
జిల్లాలో రహదారులకు మోక్షం లభించనుంది. ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా స్థాయి మేజర్ రహదారులకు నిధులు కేటాయించింది.
రాష్ట్ర, జిల్లా స్థాయి రహదారుల అభివృద్ధి
పరిపాలన అనుమతులు మంజూరు చేసిన ప్రభుత్వం
టెండర్లు పిలవనున్న ఆర్‌అండ్‌బీ శాఖ
కాంట్రాక్టర్లలో నిస్తేజం..బకాయిల కోసం ఎదురుచూపు
పెండింగ్ పనులను చేపట్టని కాంట్రాక్టర్లు
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
జిల్లాలో రహదారులకు మోక్షం లభించనుంది. ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా స్థాయి మేజర్ రహదారులకు నిధులు కేటాయించింది. పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. త్వరలోనే టెండర్‌లు పిలవనున్నారు. పనులు చేపట్టనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రహదారులపై దృష్టి పెట్టింది. జిల్లాలో రాష్ట్ర, జిల్లా రహదారులు ఆర్ అండ్‌బి పరిధిలో ఉంటాయి. వాటిని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం పెద్దమొత్తంలో నిధులు మంజూరు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 1000 కోట్లు కేటాయించింది. జిల్లాకు సుమారు రూ. 46.45 కోట్లు విడుదల చేసింది. పరిపాలను అనమతులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. జిల్లాలో ముఖ్యంగా 12 రహదారులను అభివృద్ది చేయనున్నారు. వాటికోసం ఎప్పటినుంచో కూటమి నేతలు ఎదురు చూస్తున్నారు. జిల్లా నుంచి ప్రతి నియోజకవర్గ శాసన సభ్యుడు తమ పరిధిలో అర్ అండ్ బి రహదారులు అభివృద్ధి కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇటీవల అసెంబ్లీ సమావేశ ంలోనూ జిల్లాలో రహదారుల అభవృద్ధిపై పలువురు ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. నిధులు కేటాయించాలని కోరారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిధులు కేటా యించింది. భీమవరం, పాలకొల్లు, ఆచంట, ఉండి, తణుకు నియోజక వర్గాల పరిధిలో రహదారులను అభివృద్ధి చేయనున్నారు.
టెండర్లు పూర్తయిన పనులు
వాస్తవానికి ఇదే వరకే టెండర్‌లు పూర్తయిన పనులు కూడా జిల్లాలో ఉన్నాయి. వాటిని చేపట్టేందుకు కాంట్రాక్టర్లు నిరాకరిస్తున్నారు. తాడేపల్లిగూడెంలో ముత్యాలంబపురం నుంచి ప్రత్తిపాడు వరకు రూ. 7 కోట్లతో చేపట్టే పనులకు టెండర్‌లు ఖరారు చేశారు. కాంట్రాక్టర్‌లు ప్రభుత్వం నుంచి రూ. 25 కోట్ల మేర బిల్లులు రావాల్సి ఉంది. దాంతో కాంట్రాక్టర్ చేతులెత్తేశారు. ఇలా జిల్లాలో దాదాపు రూ.30 కోట్ల మేర పనులు పెండింగ్‌లో ఉన్నాయి. లోసరి నుంచి భీమవరం మీదుగా పిప్పర వరకు తాడేపల్లిగూడెం ర హదారి అభివృద్ధి కోసం కేంద్రం రూ. 100 కోట్లు కేటా యించింది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తేనే టెండర్‌లు పిలవనున్నారు. వైసీపీ హయాంలో చేపట్టిన పనులకు ఇంకా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అప్పట్లో చేపట్టిన పనులు కూడా పూర్తి కాలేదు. దాంతో లోసరి– భీమవరం– తాడేపల్లిగూడెం రహదారికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. దీనికోసం కూటమి నేతలు ఎదురు చూస్తున్నారు. భీమవరం నుంచి యండగండి వరకు వేసిన రహదారి మళ్లీ అక్కడక్కడా దెబ్బతింటోంది. యండగండి నుంచి కేశవరం వరకు వేసిన రహదారి కూడా మరమ్మతులకు వచ్చేస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్రం కేటాయించిన రూ. 100 కోట్లతోనే నాణ్యమైన రహదారి వేయడానికి అవకాశం ఉంటుంది. అయితే బకాయిలు ఉండడంతో ప్రధాన రహదారికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం లేదు. ఇతర కీలకమైన రహదారులకు నిధులు కేటాయిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. అనుమతులు జారీ చేసింది.
రాష్ట్ర రహదారులు నిధులు
మార్గేరు– కోడేరు రహదారి రూ. 4 కోట్లు
పాలకొల్లు– పూలపల్లి రూ. 3 కోట్లు
తణుకు–భీమవరం రూ. 2 కోట్లు
కాళీపట్నం–భీమవరం రూ .5 కోట్లు
జిల్లా రహదారులు
పాలకొల్లు సచిత్రాలయ–తిల్లపూడిపాలెం రూ. 4.30 కోట్లు
ఎస్.చిక్కాల–తిల్లపూడిపాలెం రూ. 5.90 కోట్లు
అత్లిలి– అలంపురం రహదారి రూ. 4.80 కోట్లు
కొల్లేరు–భీమవరం, కవిటం, మల్లివానితిప్ప రూ. 4.85 కోట్లు
అర్ధవరం––పాందువ్వ రూ. 2.50 కోట్లు
విజయవాడ–విశాఖపట్నం సర్వీస్ రోడ్ రూ.. 4.90 కోట్లు
మెట్రేవు– పేరుపాలెం బీచ్ రోడ్ రూ. 2.20 కోట్లు
భీమవరం– ఎల్‌వీఎన్ పురం రూ. 3. కోట్లు