Share News

ఉచిత వైద్యసేవకు సొమ్ములు వసూళ్లు

ABN , Publish Date - Nov 20 , 2025 | 11:59 PM

:ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఎన్టీఆర్‌ ఉచిత వైద్యసేవలకు రోగులనుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న కారణాలపై జిల్లాలోని రెండు నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు కలెక్టర్‌ వెట్రిసెల్వి జరిమానా విధించారు.

ఉచిత వైద్యసేవకు సొమ్ములు వసూళ్లు

రెండు నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు జరిమానా

ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ ద్వారా రోగుల నుంచి సమాచార సేకరణ

ఎన్టీఆర్‌ వైద్యసేవ ఆసుపత్రుల్లో ఆకస్మిక తనిఖీలకు కలెక్టర్‌ నిర్ణయం

ఏలూరు అర్బన్‌, నవంబరు 20 (ఆంధ్ర జ్యోతి):ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఎన్టీఆర్‌ ఉచిత వైద్యసేవలకు రోగులనుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న కారణాలపై జిల్లాలోని రెండు నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు కలెక్టర్‌ వెట్రిసెల్వి జరిమానా విధించారు. మరో నెట్‌వర్క్‌ ఆసుపత్రిపై వచ్చిన ఫిర్యాదుపై రీ ఎంక్వయిరీ చేయాలని ఆదేశించారు. జిల్లాలో ఎన్టీఆర్‌ ఉచిత వైద్యసేవ పథకం కింద నమోదైన 32 నెట్‌వర్క్‌ ఆసు పత్రుల్లో రోగులకు అందుతున్న ఉచిత వైద్యసేవలపై ఇటీవల ఐవీఆర్‌ఎస్‌ ఫోన్‌కాల్స్‌ ద్వారా సంబంధిత రోగుల నుంచి సేకరించిన సమాచారం, నిబంధనల ఉల్లంఘనతో నమోదైన ఫిర్యాదులపై గురువారం కలెక్టరేట్‌లో ఎన్టీఆర్‌ వైద్యసేవలు–జిల్లాస్థాయి క్రమశిక్షణ చర్యల కమిటీ(డీడీసీ) సమావేశం జరిగింది. ప్రభుత్వ, ప్రైవేటు నెట్‌వర్క్‌ ఆసుపత్రులపై వచ్చిన ఫిర్యాదులను కలెక్టర్‌ సమీక్షించారు. ఉచితవైద్యసేవ కోసం రిజిస్టరైన రోగి వద్ద ఎక్స్‌రే నిమిత్తం డబ్బులు వసూలు చేశారనే కారణంపై ఏలూరు గుడ్‌సమరిటన్‌ క్యాన్సర్‌ ఆసుపత్రి యాజమాన్యానికి రూ.3,500, ఎన్టీఆర్‌ ఉచిత వైద్యసేవ కింద ఆసుపత్రిలో చేరిన గర్భిణీకి జన్మించిన శిశువుకు ఇన్వెస్టిగేషన్స్‌ నిమిత్తం డబ్బులు వసూ లు చేశారనే అభియోగంపై జంగారెడ్డిగూడెం సాయిస్ఫూర్తి మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌ యాజ మాన్యానికి రూ.40 వేలు జరిమానా విధించారు. వసూలు చేసిన డబ్బు లకు నిబంధనల ప్రకారం పది రెట్లు జరిమానాగా విధిస్తారు. ఔషధా లను బయట కొనుగోలు చేసినట్టు ఓ రోగి ఫిర్యాదు చేసిన కేసులో నూజివీడులోని జిఫర్డ్‌ మెమోరియల్‌ హాస్పిటల్‌పై మరోదఫా విచారణ చేసి, తదుపరి సమీక్ష సమావేశానికి నివేదికను అందజేయాలని ఎన్టీఆర్‌ ఉచిత వైద్యసేవ ట్రస్టు జిల్లా కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ రాజీవ్‌ను ఆదేశించారు. వీటితో పాటు ఉచితవైద్యసేవ పథకాన్ని జిల్లాలో పర్యవేక్షించే జిల్లా కో–ఆర్డినేటర్‌, టీమ్‌ లీడర్లు, ఆరోగ్యమిత్రల పరిశీలనలో మరో 15 నెట్‌ వర్క్‌ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యసేవలు పొందిన రోగుల నుంచి ఫిర్యాదు లు వచ్చినప్పటికీ సంబంధిత ఆసుపత్రుల్లో ఉచిత వైద్యసేవకు రిజిస్టర్‌ కాక ముందు చేసిన రోగ నిర్ధారణ పరీక్షలకు వసూలు చేసిన డబ్బులను రిజిస్టరైన తర్వాత ఆసుపత్రుల యాజమాన్యాలు వాపసు ఇచ్చేయడంతో నిబంధనల ఉల్లంఘన జరగలేదని ప్రకటిం చారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం వద్ద నమోదైన ప్రతీ నెట్‌వర్క్‌ ఆసుపత్రిలో నగదు రహిత ఉచిత వైద్యసేవలు అందరికీ అర్థమయ్యేలా ఫ్లెక్సీ బోర్డులను ప్రదర్శించాలని ఆదేశించారు. రోగి డిశ్చార్జి అయిన తర్వాత మందులు, రవాణా చార్జీలు ఇవ్వాల్సిందేనన్నారు. వైద్యసేవలు, చికిత్సలు నిరాకరణ, డబ్బుల వసూలు, తదితర సమస్యలు తలెత్తితే నేరుగా రోగులనే విచారిస్తామన్నారు. ఇక మీదట తాను నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తానని వెల్లడించారు. డీఆర్వో విశ్వేశ్వరరావు, డీఎంహెచ్‌వో డాక్టర్‌ అమృతం, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ పాల్‌సతీష్‌, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజు, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు పాల్గొన్నారు.

Updated Date - Nov 20 , 2025 | 11:59 PM