ఉచిత ప్రయాణం.. దొంగల చేతివాటం
ABN , Publish Date - Aug 31 , 2025 | 01:06 AM
జిల్లాలో ఉచిత బస్సు ప్రయాణాల్లో మహిళలకు దొంగల బెడద ఎదురవుతోంది. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణాలు ప్రారం భం కాగా ఇటీవల దొంగలు, అపరిచితుల చేతివాటాలతో విలువైన సెల్‌ఫోన్లు చోరీకి గురవుతున్నాయి.
క్షణాల్లో సెల్‌ఫోన్‌లు మాయం
అప్రమత్తంగా ఉండాలంటూ ఆర్టీసీ అధికారుల సూచన
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
జిల్లాలో ఉచిత బస్సు ప్రయాణాల్లో మహిళలకు దొంగల బెడద ఎదురవుతోంది. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణాలు ప్రారం భం కాగా ఇటీవల దొంగలు, అపరిచితుల చేతివాటాలతో విలువైన సెల్‌ఫోన్లు చోరీకి గురవుతున్నాయి. మొదటి వారం ఎలాంటి చోరీలు జరగకపోగా గత వారం నుంచి బాగా రద్దీగా ఉన్న సమయాల్లో చోరులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఏలూరు నుంచి హనుమాన్ జంక్షన్, అక్కడి నుంచి ఏలూరుకు వచ్చే పల్లె వెలుగు, అల్ర్టా పల్లె వెలుగు బస్సుల్లో చోరీలు జరుగుతున్నాయని ప్రయాణికులు బెంబే లెత్తుతున్నారు. మహిళలు ప్రయాణం చేసే సమయాల్లోనే విద్యా ర్థులు కాలేజీలకు, స్కూళ్లకు రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో కొంత రద్దీగా బస్సు సర్వీసులుంటున్నాయి. జరగండి... జరగండి అంటూ మిగతా ప్రయాణిలను తొందరపెట్టి జరిగే క్రమంలో దొంగ లు తమ చేతికి పని చెబుతున్నారు. నలుగురైదుగురుతో కూడిన అపరిచిత బృందాలు హడావుడి సృష్టించి సడన్‌గా బస్సులు దిగి వెళ్లిపోతున్నారు. అప్పటికే వచ్చిన పని కాస్త పూర్తయినట్టు ఎవ్వరు గ్రహించలేకపోతున్నారు. ఇటీవల ఏలూరు–హనుమాన్ జంక్షన్– వయా మచిలీపట్నం సర్వీసుల్లో ఇటీవల ఐదారు సెల్‌ఫోన్‌లు చోరీకి గురయ్యాయి. దీనిపై ఎవరికి కంప్లైంట్‌లు ఇవ్వలేక మహిళా ప్రయా ణికులు మిన్నకుంటున్నారు. కొంతమంది విద్యార్థులు మాత్రం తమ సెల్‌ఫోన్లు పోయినట్టు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఇటీవల ఏలూరు కొత్తబస్టాండ్‌లో ఒక ఫోన్‌ను చోరీ చేసేందుకు ప్రయత్ని స్తుండగా ఆ విషయాన్ని వెంటనే కొందరు పసిగట్టి కేకలు వేయ డంతో ఆ దొంగ పలాయనం చిత్తగించాడు.
ఒక్క కానిస్టేబుల్‌తోనే సరి..
ఏలూరు కొత్త,పాత బస్టాండ్‌ల్లో పోలీస్ సిబ్బందిని గస్తీకి పెట్టారు. ఒక్క కానిస్టేబులే 10 నుంచి 15 ప్లాట్‌ఫారాలను తనిఖీ చేయాల్సి ఉంది. దీంతో రద్దీ సమయాల్లో పూర్తిస్థాయి నిఘా కొరవడుతోందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. మహిళలు ఆధార్, ఇతర అర్హతా పత్రాలను తీసి చూపించే లోపు చోరీలు జరిగిపోతున్నాయి. ఆర్టీసీ అధికారులు మాత్రం అప్రమత్తంగా ఉండి బస్సులు ఎక్కాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మహిళలు సైతం దొంగలను ఓ కంట కనిపెట్టుకుని ఉండాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం బస్సుల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని మహిళా ప్రయాణికులు కోరుతున్నారు.