ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ఉచిత బస్సు ప్రయాణం
ABN , Publish Date - Jul 22 , 2025 | 11:36 PM
కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వచ్చేనెల 15 నుంచి అమలు కానున్నది.
ఆధార్ కార్డు ఆధారంగా నమోదు
ఆగస్టు 15 నుంచి అమలు ?
వచ్చే నెలలో స్పష్టత వచ్చే అవకాశం
భీమవరం టౌన్, జూలై 22 (ఆంధ్రజ్యోతి) : కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వచ్చేనెల 15 నుంచి అమలు కానున్నది. ఇప్పటికే దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్టీసీ ఉన్నతాధికారులతో చర్చించిన నేపథ్యంలో ఇక అమలు తథ్యమే అన్న భావన వ్యక్తం అవుతోంది. ఉచిత ప్రయాణం ఏవిధంగా ఉండబోతున్నదనే దానిపై ఆర్టీసీ అధికారులకు ఇంతవరకు స్పష్టత రాలేదు. అయితే ఉన్నతాధికారుల చేస్తున్న ఆలోచన నేపథ్యంలో పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాను పరిగణనలోకి తీసుకుంటే ఆర్టీసీలో ఆక్యుపెన్సీ 69 శాతం ఉంటోంది ఇందులో దాదాపు 50 శాతంపైగా మహిళలు ప్రయాణం చేస్తున్నట్టుగా ఒక అంచనా. ఈ విధానం వల్ల ఉమ్మడి జిల్లాలో తిరిగే సర్వీసులకు ఇబ్బంది ఉండదని, జిల్లా దాటిన తరువాత ప్రయాణికులు టికెట్టు తీసుకోకపోతే కండక్టర్‌కు ఇబ్బందులు తప్పవనే ఆందోళన వ్యక్తం అవుతోంది. దీనికి యాజమాన్యం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన చేపట్టేందుకు ఆలోచన చేసున్నారు. అందువల్ల పూర్వ పశ్చిమ గోదావరి జిల్లాలోని ప్రాంతాల్లో మహిళలు ఆధార్ కార్డు ద్వారా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. బస్సు ఎక్కిన మహిళలకు ఆధార్ కార్డు నంబరును నమోదు చేసి జీరో టికెట్టు ఇవ్వనున్నారు. అయితే టిక్కెట్టు ధర ఎంతనేది ముద్రిస్తారు. దీనివల్ల మహిళలు ఎంత ప్రయోజనం పొందుతున్నారో తెలుస్తుంది. ప్రస్తుతం అమలు చేస్తున్న తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాల్లో ఈ విధంగానే టికెట్టు జారీ చేస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను టిమ్‌లో అప్‌లోడ్ చేస్తారని చెబుతున్నారు.
ఆర్టీసీపై భారమే
ఉచిత బస్సు ప్రయాణం ఆర్టీసీపై భారం పడనున్నది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న నాలుగు ఆర్టీసీ డిపోల్లో రోజుకు 69 శాతం ఆక్యుపెన్సీ ఉంటోంది. రోజుకు 80 వేల మంది ప్రయాణికులు బస్సులో ప్రయాణిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. వీరి ద్వారా రోజుకు రూ.30 నుంచి రూ.40 లక్షల వరకు ఆదాయం వస్తోంది. నెలకు 13 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. ఈ విధానం అమలు చెయ్యడం వల్ల ఆర్టీసీపై ఎంత భారం అనేది ఒక నెల అమలు అయిన తర్వాత తెలుస్తుందని అంటున్నారు.