నలుగురు అధికారులపై కలెక్టర్ వేటు
ABN , Publish Date - Dec 26 , 2025 | 12:07 AM
పెంటపాడు మండలం ప్రత్తిపాడులో శివాలయం నిర్మాణం అధికారులపై వేటుకు కారణమైంది. హైకోర్టులో కేసు నడుస్తున్నా ఆలయంలో విగ్రహాలు పెట్టడంపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు.
ప్రత్తిపాడులో ఆలయ నిర్మాణంపై సీరియస్
పెంటపాడు తహసీల్దార్, ఈవోపీఆర్‌డీ, ప్రత్తిపాడు కార్యదర్శి,వీఆర్వోలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు..
సీఐ,ఎస్‌ఐలను సస్పెండ్ చేయాలంటూ ఎస్పీకి లేఖ
భీమవరం, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి) : పెంటపాడు మండలం ప్రత్తిపాడులో శివాలయం నిర్మాణం అధికారులపై వేటుకు కారణమైంది. హైకోర్టులో కేసు నడుస్తున్నా ఆలయంలో విగ్రహాలు పెట్టడంపై జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. పెంటపాడు తహసీల్దార్ రాజరాజేశ్వరి, ఈవోపీఆర్‌డీ వైవీఆర్ ప్రసాద్‌తో పాటు, ప్రత్తిపాడు పంచాయతీ కార్యదర్శి జవ్వాది నాగేశ్వరరావు, వీఆర్‌వోలను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ నాగరాణి ఉత్తర్వులు జారీచేశారు. తాడేపల్లిగూడెం ఆర్‌డీవో, డీఎల్ డీవోలకు మోమో జారీచేశారు. తాడేపల్లిగూడెం రూరల్ సీఐ, పెంటపాడు ఎస్‌ఐలపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. ప్రత్తిపాడులో జిల్లా పరిషత్‌కు చెందిన సుమారు 15 సెంట్ల స్థలంలో గ్రామస్థులు శివాలయాన్ని నిర్మిస్తున్నారు. విరాళాలు సేకరించి ఆలయ నిర్మాణం చేపట్టారు. ఆలయం వల్ల ఇబ్బంది కలుగుతోందని, మంచినీరు కూడా తమకు రావడం లేదంటూ ఇద్దరు ప్రత్తిపాడు గ్రామస్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రభుత్వ భూమిని పరిరక్షించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.అయినాసరే గుడి నిర్మిస్తున్నారంటూ పిర్యాదుదారులు హైకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు వేశారు. గుడి నిర్మాణం విషయంలో జిల్లా కలెక్టర్‌ను కూడా ప్రతివాదిగా చేర్చారు. కేసులో పెంట పాడు తహసీల్దార్ కూడా ఉన్నారు. వచ్చేనెల 5వ తేదీన కోర్టు ధిక్కరణ కేసు విచారణకు రానున్నది. శివాలయ నిర్మాణం చేపట్టిన గ్రామస్తులు కూడా హైకోర్టును ఆశ్రయించినట్టు సమాచారం. ఇదిలా ఉంటే గుడిలో విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యారు. కోర్డులో కేసు ఉండగా విగ్రహాలు ఏర్పాటు చేయడాన్ని ఎందుకు అడ్డుకోలేదంటూ నలుగురిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ విషయంలో పంచాయతీ కార్యద్శి నిర్మాణదారులకు నోటీసులు కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది.