వంతెన నిర్మాణం వదిలేశారు..!
ABN , Publish Date - Sep 23 , 2025 | 12:25 AM
జాతీయ రహదారిపై తణుకు వద్ద నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులు నిలిచిపోయాయి.
ఉండ్రాజవరం జంక్షన్, తేతలి వై జంక్షన్‌లో నిలిచిపోయిన ఫ్లై ఓవర్ నిర్మాణం
మూడేళ్లుగా ముందుకు సాగని పనులు
సర్వీసు రోడ్లు అధ్వానం
గోతులతో ఇప్పటివరకు ఐదుగురి మృతి
నిత్యం అనేక మందికి గాయాలు
జాతీయ రహదారిపై తణుకు వద్ద నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఉండ్రాజవరం జంక్షన్, తేతలి వై జంక్షన్ వద్ద పనులు మధ్యలో ఆగిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉండ్రాజవరం జంక్షన్‌లో సర్వీసు రోడ్డు అధ్వానం కావడంతో కాలినడకన వెళ్లడం కూడా కష్టంగా ఉంది. ఇరుకు మార్గంలో భారీ వాహనాల రాకపోకలతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
తణుకు రూరల్, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారిపై ఉండ్రాజవరం జంక్షన్ వద్ద ప్రమాదాల నివారణ కోసం నిర్మిస్తున్న ఫ్లైవోర్ బ్రిడ్జి (వంతెన) పనులు ప్రమాదకరంగా మారాయి. మూడేళ్ల క్రితం చేపట్టిన పనులు నిలిచిపోవడంతో వేలాది వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ఈ మార్గంలో నరకం చూస్తున్నారు. సుమారు కిలో మీటరు మేర రోడ్డులో వంతెనకు ఇరువైపులా సర్వీసు రోడ్లు గోతులు పడి వర్షం నీటితో ప్రయా ణికులు ప్రమాదాల బారిన పడుతున్నారు. గోతులలో పడి సుమారు ఐదుగురు మృతి చెందడంతో పాటు నిత్యం అనేక మంది గాయాల పాలవుతున్నా పట్టిం చుకునే వారు లేరని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు పెరుగుతున్నా నిర్మాణ సంస్థ లు మాత్రం పనులను పట్టించుకోవడం లేదు.
కోల్‌కతా– చెన్నై జాతీయ రహదారిపై నిత్యం భారీ వాహనాలతో పాటు వేలాది ఆటోలు, ద్విచక్ర వాహనాల రాకపోకలు సాగుతాయి. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు చోట్ల ట్రాఫిక్ రద్దీగా వుండే పలు ప్రాంతాలను బ్లాక్ స్పాట్‌లుగా గుర్తించి అక్కడ ఫై ఓవర్ బ్రిడ్జిల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధు లు మంజూరు చేసి కాంట్రాక్టర్లకు నిర్మాణ బాధ్యతలు అప్పగించారు. 2022లో అప్పటి కేంద్ర రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్గారి శంకుస్థాపన చేశారు.
అక్కడ అలా.. ఇక్కడ ఇలా..
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మోరంపూడి జంక్షన్, తణుకు ఉండ్రాజవరం జంక్షన్‌లో వంతెనల నిర్మాణానికి ఒకేసారి శంకుస్థాపన చేసి పనులు చేపట్టారు. మోరంపూడి జంక్షన్‌లో వంతెన గత ఏడాది ఆగస్టులో ప్రారంభించారు. ఇక్కడ మాత్రం ఇప్పటికీ నిర్మానం పూర్తి కాలేదు. అప్పట్లోనే ఇక్కడ నాయకులు శ్రద్ధ వహిస్తే అందుబాటులోకి వచ్చేదని పలువురు అంటున్నారు. ఇక్కడ నిర్మాణ పనులు నిలిచిపోవడంలో వంతెనకు ఇరవైపులా రోడ్లు గోతులు పడి ప్రయాణాలు ప్రమాదకరంగా మారా యి. ఈ మార్గంలో నిత్యం రావులపాలెం, పెరవలి, తాడేపల్లిగూడెం, ఏలూరు తదితర ప్రాంతాల నుంచి వందలాది వాహనాలతో ప్రయాణాలు సాగిస్తారు. వీటితో పాటు వివిధ ప్రైవేట్ పాఠశాలల బస్సులు, ఆటోలు, ద్విచక్రవాహాలపై రాకపోకలు సాగిస్తారు. ఈ వంతెన వద్ద రోడ్లు పూర్తిగా ధ్వంసమై పాటు గోతులు పడి రాకపోకలకు ఏమాత్రం అనువుగా లేదని ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. కనీసం వంతెన పక్కన రోడ్లనైనా నిర్మిస్తే ప్రయాణాలకు వీలుగా వుంటుందని ప్రయాణికులు వాపోతున్నారు.
తేతలి వై జంక్షన్‌లో పిల్లర్లతో సరి
తణుకు తేతలి వైజంక్షన్ వద్ద వంతెన నిర్మాణం పిల్లర్ల దశలోనే నిలిచిపోయింది. రహదారి మధ్యలో అసంపూర్తి పిల్లర్లు ప్రమాదాలకు కారణమవుతున్నా యి. మరోవైపు పిల్లర్ల పక్కన సర్వీసు రోడ్లు గోతులతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంతెన నిర్మాణం ఎలా వున్న కనీసం రోడ్డుపై గోతులనైనా పూడ్చాలని ప్రయాణికులు కోరుతున్నారు.
కేంద్ర మంత్రి హామీ నెరవేరేదెప్పుడు?
ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల జాతీయ రహదారిలోని పలు బ్లాక్ స్పాట్‌ల వద్ద చేపట్టిన ప్లైఓవర్ల నిర్మాణాలు 2025 ఏప్రిల్ నాటికి అందుబాటులోకి వస్తాయని కేంద్ర ఉపరితల రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ గతంలో ప్రకటించారు. ఇప్పకిటీ పనులు పూర్తి కాలే దు. స్థానిక ఎంపీ కేంద్ర మంత్రిగా ఉన్నా వంతెన నిర్మాణ పనులు నిలిచిపోవడంతో ప్రజలు చర్చించు కుంటున్నారు. పనులు నిలిచిపోవడంతో వివరాల కోసం జాతీయ రహదారుల నిర్మాణ ప్రాజెక్ట్ డైరెక్టర్ కు ఫోన్ చేసినా స్పందన లేదు.
అసెంబ్లీలో ప్రస్తావించినా..
జాతీయ రహదారిపై వంతెన నిర్మాణంలో అలసత్వం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలతో పాటు ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రస్తావించారు. అయినా ప్రభుత్వం స్పందించ లేదు. చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. సర్వీసు రోడ్డు కూడా ధ్వంసం కావడంతో ప్రజలు, ప్రయా ణికులు ఇబ్బందులు పడుతున్నారు.
– కడలి రామారావు, పీసీసీ సభ్యుడు, తణుకు