వరద గోదారి
ABN , Publish Date - Aug 30 , 2025 | 12:57 AM
గోదావరి వరద మళ్లీ ముంచుకొస్తోంది. ఎగువన భారీ వర్షాలకు తెలంగాణ ప్రాజెక్టులన్ని పూర్తిస్థాయిలో నిండడంతో లక్షలాది క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
భద్రాచలం వద్ద 43 అడుగులు
దిగువకు పోటెత్తుతున్న వరద
వేలేరుపాడు మండలంలో 23 గ్రామాలకు రాకపోకలు బంద్
యంత్రాంగం అప్రమత్తం
కుక్కునూరు/వేలేరుపాడు/పోలవరం, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): గోదావరి వరద మళ్లీ ముంచుకొస్తోంది. ఎగువన భారీ వర్షాలకు తెలంగాణ ప్రాజెక్టులన్ని పూర్తిస్థాయిలో నిండడంతో లక్షలాది క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. భద్రాచలం వద్ద శుక్రవారం ఉదయం 6గంటలకు 35.20 నీటిఅడుగుల నీటిమట్టం నమోదు కాగా సాయంత్రానికి 43 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. స్థానిక రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమైంది. భద్రాచలం నుంచి దిగువకు 9.5లక్షల క్యూసెక్కుల వరద నీరు రావడంతో వేలేరుపాడు–కొయిద, వేలేరుపాడు–రుద్రమ్మకోట రహదారి మునిగింది. సుమారు 23గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలవరం వద్ద కడమ్మ స్లూయిజ్ గేట్లు కొంతమేర మూసూకుపోయి ఏటిగట్టు కుడివైపు కొండ వాగుల జలాలు పెరుగుతున్నాయి.
ఉధృతంగా తమ్మిలేరు
ఏలూరు క్రైం/చింతలపూడి/చాట్రాయి, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): నాగిరెడ్డిగూడెంలో తమ్మిలేరు జలాశయం నిండుతుండడంతో దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. తమ్మిలేరు జలాశయం పూర్తిస్ధాయి నీటి మట్టం 355 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 348.15 అడుగులు ఉంది. ఎగువ నుంచి 5 వేల క్యూసెక్కుల నీరు వస్తుండడం తో జలాశయం నుంచి వెయ్యి క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదలచేస్తున్నారు. ఈ నీరు ఏలూరు చొదిమెళ్ల ఎఫ్‌సీఐ గోడౌన్స్ నుంచి తంగెళ్లమూడి మీదుగా తూర్పు లాకుల వద్ద నుంచి కొల్లేరులో చేరుతుంది. మరోపాయ శనివారపుపేట కాజ్‌వే, కొత్త బస్టాండ్, పడమర లాకుల నుంచి పోణంగి వైపు వెళ్లి కొల్లేరులో కలుస్తుంది. శుక్రవారం అర్ధరాత్రి నాటికి శనివారపుపేట కాజ్‌వేపై మరింత నీరు ప్రవహించే అవకాశాలు ఉండడంతో ట్రాఫిక్ పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఇళ్లలో వినాయ క చవితి పూజలు చేసినవారు తమ్మిలేరులో నిమజ్జనాలు చేస్తున్నారు. తమ్మిలేరు వద్ద విధుల్లో ఉన్న పోలీసులు వారికి జాగ్రత్తలు సూచిస్తున్నారు.