తమ్మిలేరుకు పెరిగిన వరద
ABN , Publish Date - Aug 16 , 2025 | 12:55 AM
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు తమ్మిలేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది.
కొనసాగుతున్న వర్షాలు
చాట్రాయి/చింతలపూడి, ఆగస్టు15(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు తమ్మిలేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. వరద ఉదృతి కారణంగా మండలంలోని కోటపాడు, చింతలపూడి మండలం పోతునూరు, చీపురుగూడెం, మల్లాయిగూడెం గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శుక్రవారం సాయంత్రానికి తమ్మిలేరు ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 3400 క్యూసెక్కులు ఉందని, ప్రస్తుత నీటి మట్టం 344 అడుగులు కాగా, ప్రాజెక్టు సామర్థ్యం 355 అడుగులు అని ప్రాజెక్టు ఏఈ లాజర్‌బాబు తెలిపారు. 352 అడుగులకు చేరితే వరద నీటిని దిగువకు విడుదల చేస్తామన్నారు.
కొనసాగుతున్న వర్షాలు
ఏలూరుసిటీ: బంగాళాఖాతంలో ఏర్పడి న అల్పపీడన ప్రభావంతో వర్షాలు కొనసాగుతున్నాయి. గడచిన 24 గంటల్లో జిల్లాలో అత్యధికంగా పోలవరం మండలంలో 24.4 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదు కాగా జిల్లాలో సరాసరి వర్షపాతం 4.6 మి.మీగా నమోదయింది. చాట్రాయి 24.2, వేలేరు పాడు 21, కామవరపుకోట 14.2, కొయ్యలగూడెం 11, జంగారెడి ్డగూడెం 9.6, టి.నరసాపురం 5, లింగపాలెం 3.8, కుక్కునూరు 3.8, బుట్టాయిగూడెం 2.4 మి.మీ వర్షపాతం నమోదు కాగా జిల్లాలో వర్షం కురిసిన మిగిలిన మండలాల్లో 2 మి.మీ కన్నా తక్కువగానే వర్షపాతం నమోదైంది.
ఆక్వా రైతుల్లో ఆందోళన
కలిదిండి: భారీ వర్షాలు కురు స్తుండడంతో ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. రొయ్యల చెరువుల్లో నీరు చల్లబడి ఆక్సిజన్ కొరత ఏర్పడడంతో పాటు పలు వ్యాధులు, వైరస్ సోకే ప్రమాదం ఉండడంతో చెరువుల్లో నిరంతరాయంగా ఏరియేటర్లను తిప్పుతున్నారు. ట్రంప్ సుంకంతో రొయ్యలకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో వైరస్ సోకి రొయ్యలు చనిపోతే భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. పలు గ్రామాల్లోని చెరువుల్లో ఆక్సిజన్ లోపించి చిన్న సైజు రొయ్యలు చనిపోతుండడంతో హడావిడిగా పట్టుబడి చేసి ఏలూరు, ఆకివీడు మార్కెట్‌కు తరలించి అయిన కాడికి అమ్ముకుంటున్నారు. చిన్న సైజు రొయ్యలను వ్యాపారులు కొనుగోలు చేయడం లేదు.