గోదావరికి వరదపోటు
ABN , Publish Date - Aug 19 , 2025 | 12:59 AM
గోదావరి, శబరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఈ రెండు నదు లకు వరద పోటెత్తుతోంది.
భద్రాచలం వద్ద 38.30 అడుగులకు నీటిమట్టం
ఉధృతంగా ఉరకలు వేస్తున్న శబరి
గోదావరికి మరింత పెరగనున్న వరద ప్రవాహం
వేలేరుపాడు/కుక్కునూరు/పోలవరం, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): గోదావరి, శబరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఈ రెండు నదు లకు వరద పోటెత్తుతోంది. సోమవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద 38.30 అడుగులకు నీటిమట్టం చేరుకోగా, పోలవరం వద్ద శబరి, గోదావరి సంగమం వద్ద శబరి నీటి మట్టం 30 అడుగులకు చేరుకుంది. మరో 12 గంటల్లో బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం, వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరందాటే అవ కాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంటూ విశాఖ, అనకాపల్లి, ఏలూరు, అల్లూరి సీతారామ రాజు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీని కారణంగా 25 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటికే ఒడిశాలో కురుస్తున్న వర్షాలకు శబరి నదికి భారీగా వరద చేరుకుంటుంది. గోదావరిలో కలిసే వాగుల ద్వారా వరదనీరు వేలేరుపాడు మండలం నుంచి ప్రవేశిస్తుండగా దీని కారణంగా ఎద్దువాగు వంతెన నీట మునిగిపోయింది. దీంతో 15 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. గోదావరి నది ఎగువ భాగాన తెలంగాణలోని గోదావరి పరీవాహక జిల్లాలైన భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, ములుగు, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు రెడ్ ఎలర్ట్ ప్రకటించటంతో అక్కడ భారీ వర్షపాతం నమోదవుతోంది. నీరంతా గోదావరికే వచ్చి చేరనుండటంతో భద్రాచలం వద్ద వరద తీవ్రత అధికమయ్యే ప్రమాదం పొంచి ఉంది. భద్రాచలం నుంచి దిగువకు ఏడు లక్షల 19 వేల క్యూసెక్కుల వరద నీరు కిందకు వస్తోంది. బ్యాక్ వాటర్ రూపంలోను ముంపు ఏర్పడనుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. గోదావరి వరద ప్రభావంతో కుక్కునూరు మండలంలోని గుండేటివాగులో లెవెల్ కాజ్‌వే నీట మునిగింది. గోదావరి మరో నాలుగు అడుగులు పెరిగితే ముంపు తప్పదని పత్తి, అరటి సాగు చేసే రైతాంగం ఆందోళన చెందుతున్నారు. పంటలు మునిగే అవకాశం ఉందని రైతాంగం చెబుతున్నారు. కాగా ప్రజలెవరు గోదావరి తీర ప్రాంతాలకు వెళ్లవద్దని తహసీల్దార్ రమేశ్‌బాబు హెచ్చరించారు. జాలర్లు వేటను నిలిపివేయాలని సూచనలు జారీ చేశారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వేలోకి అదనంగా వస్తున్న 6,42,370 క్యూసెక్కుల జలాలను జలవనరుల శాఖ అధికారులు దిగువకు విడుదల చేశారు. పట్టిసీమ శివక్షేత్రం వద్ద ఇసుకతిన్నెలు నీటమునిగాయి. శివక్షేత్రం చుట్టూ వరద జలాలు ఆక్రమించాయి.
కొల్లేరు.. గండం!
బిక్కుబిక్కుమంటున్న లంకవాసులు
పెనుమాకలంక రహదారి మూసివేత
రహదారి వద్ద పోలీసు పికెట్
పొంగిపొర్లుతున్న డ్రెయిన్లు
కైకలూరు/మండవల్లి, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి):అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీవర్షాలకు కొల్లేరు పరవళ్లు తొక్కుతుండడంతో గ్రామాల చుట్టూ వరదనీరు భారీగా చేరింది. మండవల్లి, కైకలూరు మండలాల్లో కొల్లేరు సరస్సు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి 64 మేజర్, మైనర్ డ్రెయిన్ల ద్వారా కొల్లేరులోకి పెద్దఎత్తున నీరు చేరుతోంది. మండవల్లి మండలం పెద్దఎడ్లగాడి నుంచి పెనుమాకలంకకు వెళ్లే రహ దారిపై నాలుగడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. రాకపోకలను నిషేధించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి పోలీసు పికెట్ పెట్టారు. మూడు రోజులు సెలవుల అనంతరం పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ మరబోట్లలో పెద్దఎడ్లగాడి వంతెన వద్దకు చేరుకున్నారు. సోమవారం మధ్యాహ్నం నుంచి బోటు మరమ్మతుకు గురి కావడంతో ప్రత్యామ్నాయదారుల వెంబడి వెళ్లేందుకు ప్రజలు, విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. మండవల్లి మండలం పెనుమాకలంక, ఇంగిలిపాక లంక, నందిగామలంక, పుల్లపర్రు, నుచ్చుమిల్లి, తక్కెళ్లపాడు, చింతపాడు గ్రామాల చుట్టూ పెద్దఎత్తున వరదనీరు చేరింది. ఎగువ నుంచి భారీగా వరదనీరు కొల్లేరులోకి చేరడం. పెద్దఎడ్లగాడి వంతెన కానాల వద్ద గుర్రపు డెక్క, తూడు పేరుకుపోవడంతో ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఆదే శాల మేరకు డ్రెయినేజీ శాఖ అధికారులు యంత్రాల సహాయంతో తొలగిస్తు న్నారు. కైకలూరు మండలం ఆటపాక, గోనెపాడు వద్ద పోల్ రాజ్ డ్రెయిన్ నుంచి వరద నీరు కొల్లేరులోకి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆటపాక పక్షుల కేంద్రం సరస్సు నీటితో పోటెత్తుతోంది. సర్కారు కాలువ వద్ద రోజురోజుకు నీటి ఉధృతి పెరుగుతోంది. వాయుగండం ప్రభావం తగ్గకపోతే పూర్తిగా కొల్లేరు లంక గ్రామాలన్నీ జలదిగ్బంధంలో చిక్కు కుంటాయి.