Share News

చేపా చేపా ఎక్కడ ?

ABN , Publish Date - Jul 04 , 2025 | 11:51 PM

ఈ ఏడాది వేట ఆరంభంలోనే మత్స్యకారులకు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. సముద్రంలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో మత్స్యసంపద చిక్కడం లేదు.

చేపా చేపా ఎక్కడ ?

సముద్రంలో ప్రతికూల పరిస్థితులు.. జాడ లేని మత్స్యసంపద

వేట ఆరంభంలోనే మత్స్యకారులకు ఎదురుదెబ్బ.. వరద నీరు వస్తేనే లభ్యం

ఈ ఏడాది వేట ఆరంభంలోనే మత్స్యకారులకు ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. సముద్రంలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో మత్స్యసంపద చిక్కడం లేదు. కనీసం ఖర్చులు కూడా రాక చాలామంది వేటకు వెళ్లడం లేదు. ఫైబర్‌ బోట్లు మినహా.. పెద్ద బోట్లలను అంతర్వేది, నరసాపురం బియ్యపుతిప్ప వద్ద కట్టేశారు. గోదావరికి వరద తాకితే గాని పరిస్థితులు మారేటట్లు కనిపించడం లేదని మత్స్యకారులు చెబుతున్నారు.

నరసాపురం, జూలై 4(ఆంధ్రజ్యోతి):రాష్ట్రంలో మత్స్య సంపదకు నరసాపురం తీరం పెట్టింది పేరు. గోదావరి సముద్రంలో కలిసే ప్రదేశం కావడంతో స్వదేశీ, అంతర్జాతీ య మార్కెట్‌లో మంచి డిమాండ్‌ వున్న టైగర్‌ రొయ్య, టోనా, పండుగొప్ప, సందువాయి, మాగ వంటి చేపలు ఇక్కడ పుష్కలంగా దొరుకుతాయి. అందుకే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలతోపాటు నెల్లూరు, మచిలీపట్నం, ఒంగోలు, గుంటూరు, ప్రకాశం నుంచి బోట్లపై వచ్చి మత్స్యకారులు నరసాపురం, అంతర్వేది రేవుల నుంచి వేట సాగిస్తుంటారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా పది వేల మంది ఈ రంగంపై ఉపాధి పొందుతున్నారు. ఇందులో ఐస్‌ ఫ్యాక్టరీలు, ఎక్స్‌పోర్టు కంపెనీలు, ట్రాన్స్‌పోర్టుదారులు ఉన్నారు. వేట పుష్పలంగా ఉంటే రోజు రూ.20 కోట్లపైనే ఎగుమతులు జరుగుతుంటాయి. ఈ ఏడాది జూన్‌ 15న వేటను ప్రారంభించారు. ఎన్నో ఆశలతో సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులకు ఆక్కడ పరిస్థితులు నిరాశ కల్పించాయి. విపరీతమైన గాలి, నీళ్లు రంగు మారడం, కెరటాలు ఎగసి పడుతుండటంతో వేట సాగడం లేదు. సముద్రం లోపలికి వెళ్లి మూడు, నాలుగు రోజులు వేట సాగించినా ఫలితం ఉండటం లేదు. దీంతో మత్స్యకారులు నిరాశతో వెనుదిరుగుతున్నారు. కనీసం ఖర్చులు రావడం లేదు. పెద్ద బోట్ల నుంచి ఫైబర్‌ బోట్ల వరకు ఇదే పరిస్థితి.

గతంలో ఎన్నడూ లేదు

గతంలో ఎన్నడూ ఇలాంటి పరి స్థితి లేదు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఇలాంటి పరిస్థితులు కనిపించేవి. గాలి, నీరు రంగు మారడం, కెరటా లు ఎగసిపడుతుండటంతో ఎక్కడా వేటకు అనుకూలమైన పరిస్థితులు లేవు. వేటకు వెళ్లి రెండు మూడు రోజుల్లో వెనక్కి వచ్చేస్తున్నాం. గోదావరికి వరద వస్తే గాని పరిస్థితులు మారేటట్లు కనిపించడం లేదు.

– వనమూడి రాంబాబు, బోటు యజమాని

Updated Date - Jul 04 , 2025 | 11:51 PM