పరుపుల తయారీ పరిశ్రమ దగ్ధం
ABN , Publish Date - Jul 11 , 2025 | 12:16 AM
అగ్ని ప్రమాదంలో పరుపుల తయారీ కంపెనీ, గోడౌన్ పూర్తిగా దగ్ధమైంది.
ఏలూరు క్రైం, జూలై 10(ఆంధ్రజ్యోతి): అగ్ని ప్రమాదంలో పరుపుల తయారీ కంపెనీ, గోడౌన్ పూర్తిగా దగ్ధమైంది. ఏలూరు సమీపంలోని కొత్తూరు రోడ్ వంగాయిగూడెం క్యాన్సర్ ఆసుపత్రి ఎదురుగా సుస్మిత ఫర్నీచర్ కుషనింగ్ సంస్థను శీలంశెట్టి రాజా, శీలంశెట్టి కిశోర్‌కుమార్, శీలంశెట్టి సంధ్య, కొండవీటి నీలిమ నిర్వహిస్తున్నారు. జ్యూట్‌మిల్లు గోడౌన్లు లీజుకు తీసుకుని పరుపుల తయారీ, స్పాంజ్, ఫోమ్, ఇతర షీట్లు తయారీ కొనసాగిస్తున్నారు. ఫ్యాక్టరీ నుంచి కార్మికులు వెళ్లిపోయిన తర్వాత బుధవారం రాత్రి ఇద్దరు వాచ్‌మెన్‌లు ఉన్నారు. స్పాంజ్, ఫోమ్ తయారీకి ఉపయో గించే రసాయనాలు కూలింగ్‌లో ఉంచాలి. ఈ రెండు ట్యాంకుల వద్ద పెద్ద ఎసీని గురువారం ఉదయం 6 గంటలకు వాచ్‌మెన్ ఆన్‌చేశాడు. తర్వాత మెయిన్ గేటు వద్ద టిఫిన్ చేస్తుండగా 6.30 గంటల సమయం లో లోపల నుంచి పొగలు రావడం గమనించారు. క్షణాల్లోనే స్పాంజ్, ఫోమ్ ఇతర కెమికల్స్ మండడంతో భారీ ఎత్తున పొగలు వ్యాపించాయి. మంటలు ఎగిసి పడడంతో చుట్టుపక్కల వారు భయభ్రాంతులయ్యారు. ఎదురుగా క్యాన్సర్ ఆసుపత్రి లో రోగుల రక్షణకు ఆసుపత్రి సిబ్బంది ముందస్తు జాగ్ర త్తలు తీసుకున్నారు. సమాచారం అందుకున్న జిల్లా అద నపు అగ్నిమాపక శాఖ అధికారి వి.రామకృష్ణ 2 ఫైర్ ఇంజన్లతో చేరుకున్నారు. మరోవైపు భీమడోలు, హనుమాన్ జంక్షన్, కైకలూరు ఫైర్ ఇంజన్లు కూడా రప్పించారు. 3 గంటల పాటు 5 ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పుతూనే ఉన్నాయి. అప్పటికే గోడౌన్‌లో కెమికల్స్, ఫోమ్, పరుపులకు సంబంధించిన మెటీరియల్ మొత్తం దగ్ధమైంది. కోట్లాది రూపాయల్లో నష్టం వాటిల్లింది. డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్, వన్‌టౌన్ సీఐ జి.సత్యనారాయణ, సిబ్బంది అక్కడకు చేరు కుని చుట్టు పక్కల ప్రజలను అప్రమత్తం చేశారు. మరో వైపు ఏలూరు – పెదపాడు మార్గంలో ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరా యం లేకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకు న్నారు. ఏసీ ఆన్‌చేయడంతో రసాయనాలు మండి ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. గోడౌన్ పక్కనే ఉన్న ఫంక్షన్ హాల్ ఏసీలు దగ్దమయ్యాయి.
అనుమతి ఎలా ఇచ్చారు..?
జనావాసాల మధ్య, ఆసుపత్రి సమీపంలో రసాయ నాలతో కూడిన పరుపుల తయారీ ఫ్యాక్టరీకి అనుమ తులు ఎలా ఇచ్చారని పరిశ్రమల శాఖ అధికారులను డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్ ఫోన్‌లో ప్రశ్నించారు. తక్షణమే కమిటీ ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ ఇలాంటి పరిశ్రమలు ఉన్నాయో తనిఖీ చేసి అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కంపెనీ ఉత్పత్తులకు లైసెన్సు, నిల్వ సామర్ధ్యం, తయారీ అనుమతులపై డీఎస్పీ ఆరా తీశారు.